Feb 12,2021 23:43

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్‌దేశారు

-విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆలోచన ఉపసంహరించుకోవాలి
-14న సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ
-16న కడపకు చేరుకోనున్న బైక్‌ ర్యాలీ
ప్రజాశక్తి - కర్నూలు జిల్లాపరిషత్‌:
 కడపలో స్టీల్‌ ప్లాంట్‌పై బిజెపి 2014లో మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికీ ఆరుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టినా ప్లాంట్‌ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం రాయలసీమ ప్రజలను వంచనకు గురి చేయడమేనని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్‌దేశారు విమర్శించారు. శుక్రవారం నగరంలోని కార్మిక, కర్షక భవన్‌లో సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 26 గ్రామాల ప్రజలు 26 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారని, 32 మంది ప్రాణాలు బలి అయ్యాక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడిందని తెలిపారు. 35 వేల మందికి ప్రత్యక్షంగా, లక్షమందికి పైగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను బిజెపి ప్రభుత్వం నష్టాల సాకు చూపి ప్రయివేటుకు అప్పగిస్తామని నిస్సిగ్గుగా చెప్పడం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. కడప ఉక్కు - రాయలసీమ హక్కు అనే నినాదంతో కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి నిధులు కేటాయించాలని సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈనెల 14న కర్నూలు నుంచి బైక్‌ర్యాలీ ప్రారంభిస్తున్నామన్నారు. మొత్తం రాయలసీమ జిల్లాల నుంచి 14న బైక్‌ ర్యాలీ ప్రారంభమై, కళాకారుల చైతన్య గీతాలతో గ్రామాలు తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ 16న కడపకు చేరుతుందని తెలిపారు. ఉత్సాహవంతులైన యువత ఈ బైక్‌ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టే పోరాటంలో భాగస్వామ్యులు కావాలన్నారు. అనంతరం డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగేష్‌ మాట్లాడారు. జిల్లాలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌.రాధాకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ ఆలోచనను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత ఇనుప గనులు కేటాయించాలని కోరారు. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విభజన హామీలు అమలు చేయాలని, కర్నూలులో రైల్వే వ్యాగన్‌ వర్కుషాపు నిర్మాణానికి, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ నిర్మాణానికి, చిత్తూరులో మన్నవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.