Sep 15,2021 15:09

న్యూఢిల్లీ : భారత సంతతికి చెంది 50 ఏళ్ల ఆఫ్ఘానిస్తానియుడొకరిని కాబూల్‌లోని కర్తే పర్వాన్‌ ప్రాంతం నుండి దుండగులు అపహరించారని అకాలీదళ్‌ నేత మన్‌జిందర్‌ సింగ్‌ శిర్సా ట్వీట్‌ చేశారు. అపహరణకు గురైన బన్సూరీ లాల్‌ ఓ చిన్న వ్యాపారస్తుడని తెలుస్తోంది. ఈ విషయంపై కాబూల్‌లో ఉన్న హిందూ సిక్కుల కుటుంబాలతో మాట్లాడానని ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ ప్రెసిడెంట్‌ కూడా అయిన మన్‌జిందర్‌ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు వారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 'గత రాత్రి బన్సూరీలాల్‌.. తన గిడ్డంగికి వెళుతుండగా.. ఐదుగురు దుండగులు.. తుపాకులను చూపించి, చంపేస్తామని బెదిరించి.. కారులోకెక్కించి.. బలవంతంగా కిడ్నాప్‌ చేశారు. ఈ విషయంలో సాయం చేయాలని బన్సూరీలాల్‌ సోదరుడు, ఈ కమ్యూనిటీకి చెందిన వారు కోరారు. ఈ అంశంపై సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా' అని ఓ వీడియో స్టేట్‌మెంట్‌లో మన్‌జిందర్‌ పేర్కొన్నారు. ఈ వీడియోను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ట్యాగ్‌ చేశారు. వీరితో పాటు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు కూడా ట్యాగ్‌ చేశారు. దీనికి గురించి తెలిసిందని, దర్యాప్తు చేస్తామని మంత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఈ అపహరణకు సంబంధించిన విషయాన్ని తొలుత పునీత్‌ సింగ్‌ చాంధోక్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు. ఇందులో తనను తాను ఇండియన్‌ వరల్డ్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌గా అభివర్ణించుకున్నారు. అందులో కాబూల్‌కు చెందిన భారతీయుడు.. మంగళవారం ఉదయం అపహరణకు గురయ్యాడని పేర్కొని ఉంది. అయితే కొన్ని మీడియా నివేదికలు ఆ కుటుంబం ఢిల్లీలో ఉంటున్నట్లు చెబుతున్నాయి. ఆఫ్ఘాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్న నాటి నుండి అక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. దీంతో ముందుగానే అనేక మంది భారతీయులను, ఆఫ్ఘానీయులను భారత్‌ తరలించిన సంగతి విదితమే.