
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : భూమిని నమ్ముకొని శ్రమించి పంటలు పండిస్తున్న వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు రాష్ట్రంలో లక్షల్లో ఉండగా ఈ మారు ఖరీఫ్, రబీ కలుపుకొని ఇప్పటి వరకు కేవలం 50 వేల లోపు రైతులకే బ్యాంకులు రుణాలిచ్చాయి. కౌలు రైతులకు మేలు చేసేందుకంటూ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంట సాగుదారు హక్కు చట్టం కింద జారీ చేసిన సిసిఆర్‌సిలపై అప్పులు పొందిన వారు 41 వేల మంది మాత్రమే! ప్రతి ఏటా వార్షిక రుణ ప్రణాళికలో ప్రతిపాదించిన పంట రుణ లక్ష్యాల్లో పది శాతానికి తక్కువ కాకుండా కౌలు రైతులకు ఇవ్వాలని కొన్నేళ్లుగా చెబుతున్నారు. 2020-21 బ్యాంకుల రుణ ప్రణాళికలో ఆ ఆనవాయితీకి గండి కొట్టారు. ఖరీఫ్, రబీ కలుపుకొని మొత్తంగా రూ.94,629 కోట్ల పంట రుణాలివ్వాలనుకోగా వాటిలో పది శాతం అంటే సుమారు రూ.9,500 కోట్లు కౌలు రైతులకు కేటాయించాలి. కానీ రూ.6,500 కోట్లు (6.86 శాతం) ప్రతిపాదించారు. ఆ మేరకన్నా అప్పులిచ్చారా అంటే అదీ లేదు. ఖరీఫ్ పూర్తయి, రబీ ముగింపుదశకొచ్చిన స్థితిలో కూడా 49,344 మందికి రూ.495.64 కోట్లిచ్చారు.
ఇాక్రాప్, డబుల్ ఫైనాన్స్ అడ్డంకులు
సిసిఆర్సి యాక్టు వచ్చి ఏడాదిన్నర దాటింది. సిసిఆర్సి కార్డుల జారీ 2019 అక్టోబర్ 2 నుంచి ప్రారంభమైంది. తొలేడాది 2.76 లక్షల కార్డులే ఇచ్చారు. ఇప్పటి వరకు 6.8 లక్షల కార్డులు జారీ కాగా కార్డుల కాలపరిమితి 11 మాసాలే కావడంతో వాటిలో చాలా మట్టుకు రెన్యువల్ కాలేదు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం 2020 ఖరీఫ్‌లో రెండున్నర లక్షల కార్డులు జారీ అయ్యాయి. స్పెషల్ డ్రైవ్ వలన ఆ మాత్రమన్నా ఇచ్చారు. కార్డులపై పంట రుణాలివ్వాల్సిన బ్యాంకులు డబుల్ ఫైనాన్స్, ఇ-క్రాప్ వంటి సాకులతో కౌలు రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. అందువల్లనే ఈ సీజన్లో 41,150 మందికే బ్యాంకులు అతికష్టం మీద అప్పులిచ్చాయి.
తడవకో మాట
సిసిఆర్‌సిలపై బ్యాంకులను ఒప్పించి కౌలు రైతులకు రుణాలిప్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగా ఆచరణలో నెరవేరలేదు. దాంతో కౌలు రైతులను, ముఖ్యంగా సిసిఆర్సి హోల్డర్లతో ప్రత్యేకంగా జెఎల్జిలను వ్యవసాయశాఖ సిబ్బంది గ్రామాల్లో ఏర్పాటు చేస్తారని, గ్రూపు సమిష్టి బాధ్యతపై బ్యాంకులు రుణాలిస్తాయని ప్రభుత్వం కొత్త పల్లవి ఎత్తుకుంది. జెఎల్‌జిలు, ఆర్ఎంజిలకు బ్యాంకులు రుణాలివ్వకపోవడం వల్లనే 2011లో రుణ అర్హత కార్డుల (ఎల్ఇసి) చట్టం వచ్చింది. దాన్ని టిడిపి సర్కారు నిర్వీర్యం చేయగా, వైసిపి ప్రభుత్వం మొత్తానికే రద్దు చేసి కొత్త చట్టం తెచ్చింది. ఇప్పుడు అది సైతం చెల్లని చట్టంగా తయారైంది.
కౌలు రైతుల రుణాలు
--------------------------------------------------------
వివరం రుణం పొందిన రుణం
కౌల్దార్ల సంఖ్య రూ.కోట్లు
--------------------------------------------------------
సిసిఆర్సి 41,150 302.44
జెఎల్‌జి+ఆర్ఎంజి 7,874 191.00
ఇతరులు 320 2.20
-------------------------------------------------------
మొత్తం 49.344 495.64
-------------------------------------------------------