Nov 30,2020 21:59

కృష్ణరాజు కుటుంబాన్ని పరామర్శిస్తున్న నాయకులు

చల్లపల్లి : వర్షాలకు వరి పంట దెబ్బతినడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న పాగోలు గ్రామానికి చెందిన కౌలు రైతు గద్వాల కృష్ణరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు వాకా రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన నంద్యాల యేసు ప్రభు, వెంకటేశ్వరరావు, సీఐటీయూ నాయకులు అన్నం గగారిన్‌, వైసీపీ నాయకులు రాజులపాటి కల్యాణి, మాజీ సర్పంచ్‌ పైడి పాముల వెంకటేశ్వరరావుతో కలిసి కష్ణారాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వాకా రామచంద్ర రావు మాట్లాడుతూ కష్టించి పండించిన పంట నీటి పాలు అవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, తనయుడు మండలి వెంకట్రామ్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పంట నష్టం వివరాలు తెలుసుకోవడంతో పాటు వారికి మనో ధైర్యాన్ని కల్పించారు. గద్వాల కష్ణ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం చల్లపల్లి తహశీల్దార్‌కు ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఈపూరి రాంబాబు, మునిపల్లి శ్రీనివాసరావు, కుంభ రామకష్ణ పాల్గొన్నారు.