Jan 14,2021 13:32

కైకలూరు (కృష్ణా) : కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పందెం కోళ్లు కాలుదువ్వాయి. ఓ వైపు పోలీసులు కోడిపందేలపై నిఘా ఉంచినా మరోవైపు పందెం రాయుళ్లు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోయారు. దీంతో నియోజకవర్గంలో కోడి పందేలతోపాటు గుండాట, పేకాట కూడా విచ్చలవిడిగా జరుగుతోంది. పెద్దపండుగ వేళ పందేనికి సై అంటూ అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో యథేచ్చగా రెండవ రోజు కూడా బరులను మొదలుపెట్టారు. గుండాట, పేకాట, సహా జూద క్రీడలు సైతం జోరందుకున్నాయి. వెయ్యి రూపాయలతో ప్రారంభం అయిన కోడి పందెం లక్షల రూపాయలను చేరుతోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో ఈ ఏడు బరులు లేకపోవడంతో పక్కనే సరిహద్దుగా ఉన్న కఅష్ణా జిల్లా శివారు కైకలురు లో జోరుగా కోడి పందేలు కొనసాగుతున్నాయి. అటు ప్రభుత్వ ఆదేశాలు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలను నిర్వహిస్తున్నారు.
       నియోజకవర్గంలో కైకలూరు, భుజబలపట్నం, ఆలాపాడు, కోల్లెటికోట, శృంగవరప్పాడు, అచవరం, వరాహ పట్టణం, మండవల్లి మండలంలో భైరవ పట్టణం, చావాలిపాడు, చింతపాడు, ముదెనెపల్లి మండలంలో గొకినంపాడు, వడాలీ, అన్నవరం, పెదపాలపర్రు, కలిదిండి మండలం లో కలిదిండి, కోరుకొల్లు, తాడినాడా, పొతుమర్రు గ్రామాలలో నిర్వహిస్తోన్న కోడిపందేలలో పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. దీంతో కోడిపుంజులతో బరులన్నీ కోలాహలంగా మారిపోయాయి. పందేల బరుల దగ్గర పోలీసులు కూడా కనుచూపుమేరలో కనపడకపోవడంతో పందెంరాయుళ్లు రెచ్చిపోయారు.