Oct 27,2021 06:45

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మూడు రోజుల పర్యటన జమ్మూ కాశ్మీర్‌లో పెరుగుతున్న రక్తపాతాన్ని ఆపడానికి గానీ, కాశ్మీరీ ప్రజల భద్రతకు గానీ ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయింది. భారీగా భద్రతా బలగాల మోహరింపు, అరెస్టులు, నిర్బంధాల నడుమ అమిత్‌షా చేపట్టిన పర్యటన బిజెపి మతతత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సాగింది. ఆర్టికల్‌ 370, 35 (ఎ) రద్దు, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించిన తరువాత మొదటి సారి ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి ఉగ్రవాదుల హింస, మిలిటరీ దాడులతో నలిగిపోతున్న కాశ్మీరీయులకు సాంత్వన చేకూర్చే ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా విఫలమైన ఉక్కు పిడికిలి వ్యూహాన్ని మరింత గట్టిగా పునరుద్ఘాటించారు.కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్ర హోదాను, ప్రత్యేక స్వయంప్రతిపత్తిని తొలగించి రెండు సంవత్సరాలైంది. ఈ కాలంలో జమ్మూ కాశ్మీర్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెద్ద బందిఖానాగా మార్చేసింది. ప్రశ్నించేవారిని జైళ్లలో కుక్కడం, రాజకీయ పార్టీల నాయకులను నెలల తరబడి గృహనిర్బంధంలో ఉంచడం, ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేయడం వంటి క్రూరమైన అణచివేత చర్యలకు పాల్పడింది. కాశ్మీరియత్‌ను ఒక పథకం ప్రకారం నాశనం చేసింది. తద్వారా కాశ్మీర్‌ లోయలో మెజార్టీగా ఉన్న ముస్లింలను పరాయీకరణవైపు నెట్టింది. ఇవన్నీ కాశ్మీర్‌లో ఉగ్రవాదం పెరగడానికి హేతువులయ్యాయి. మతం పేరుతో విభజన తీసుకొచ్చి, ముస్లింలను అణచివేసే చర్యలకు హిందూత్వ శక్తులు ఒక వైపు ప్రయత్నిస్తుంటే, మరో వైపు ఉగ్రవాద గ్రూపులు మైనార్టీలను, కాశ్మీరీ యేతరులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు తెగబడుతున్నాయి. ఇంకో వైపు ఉగ్రవాదాన్ని అణచివేసే పేరుతో కేంద్రం కాశ్మీరీ పౌరుల ప్రజాతంత్ర హక్కులను, మీడియా స్వేచ్ఛను కబళించేందుకు తెగబడింది. ఈ ముప్పేట దాడిలో అమాయక పౌరులే సమిధలుగా మారారు. 1990ల నాటి భయానక పరిస్థితిని ఇవి గుర్తుకు తెస్తున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక ఉగ్రవాద హింస గణనీయంగా తగ్గిందని హోం మంత్రి ప్రకటించడం ప్రజలతో క్రూర పరిహాసమాడడమే. ఒక్క అక్టోబరులోనే 11 మంది అమాయక పౌరులు ఊచకోతకు గురైతే హింస తగ్గిందని చెప్పడం మంత్రి తెంపరితనాన్ని తెలియజేస్తోంది. ఉగ్రవాదాన్ని మిలిటరీతో అణచివేస్తామని అమిత్‌షా ఎప్పటిలానే రొటీన్‌ డైలాగులు వినిపించారు. ప్రజల భాగస్వామ్యం, మద్దతు లేకుండా ఉగ్రవాదంపై పోరాటం విజయం సాధించిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా కానరావు. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇది మరింత కష్టతరం, క్లిష్టతరం. ఉగ్రవాదంపై పోరాడేందుకు మొట్టమొదట చేయాల్సింది స్థానికుల విశ్వాసాన్ని చూరగొనడం. దీనిలో భాగంగా రాజకీయ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలి. అమిత్‌షా ప్రకటనల్లో కాశ్మీర్‌కు ఎన్నికలు జరిపిస్తామన్న ఒక్క మాట తప్ప ప్రజల విశ్వాసం, భాగస్వామ్యం గురించి ఊసే లేదు. ఎన్నికలు జరిపిస్తామన్న హామీ కూడా కొత్తదేం కాదు. రెండేళ్ల క్రితం కాశ్మీర్‌ను ముక్కలు చేసినప్పుడు కేంద్రం ఇదే విధమైన హామీ ఇచ్చింది. అయినా ఇంతవరకు అతీగతీ లేదు. ఇప్పుడు కూడా ఎన్నికలకు నిర్దిష్ట గడువంటూ ఏమీ ప్రకటించలేదు. ఇది ప్రజలను మభ్యపుచ్చే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. కాశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో చర్చలు జరిపిన ప్రధాని మోడీ ఏడాది కావస్తున్నా కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జమ్మూ కాశ్మీర్‌ సుదీర్ఘమైన, సంక్లిష్టమైన చరిత్రను బిజెపి కాషాయ హిందూత్వ సిద్ధాంత కోణం నుంచి చూస్తున్నంత కాలం ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కాశ్మీర్‌ గాయం మానాలంటే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించడం, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి కల్పించడం, జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా విడుదలజేయడం వంటివి చేపట్టాలి. ఇందుకు బిజెపి సిద్ధపడుతుందా అన్నదే ప్రశ్న. వీటి గురించి మాట్లాడకుండా బిజెపి ఏం చెప్పినా కాశ్మీరీ ప్రజలు విశ్వసించే స్థితి లేదు. ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించకుండా, నిర్ణయాల్లో వారిని భాగస్వాములను చేయకుండా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేస్తామని చెప్పడం వంచనే అవుతుంది. కాశ్మీర్‌ మరింత అగాథంలోకి జారిపోక ముందే మోడీ ప్రభుత్వం కళ్లు తెరవాలి.