Feb 02,2021 22:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ సంపదను దేశీయ, విదేశీ కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు అనువుగా కేంద్ర బడ్జెట్‌ ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మంగళవారం నాడిక్కడ సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్‌) నుంచి వర్చవల్‌లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఏచూరి మాట్లాడారు. ఒకవైపు కరోనా, మరొక వైపు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రజలకు ఉపశమన చర్యలు చేపట్టంలో విఫలమైందని విమర్శించారు. 'వి' ఆకారపు రికవరీ జరుగుతోందని ప్రభుత్వం చెబుతోందని, కానీ పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగానూ మారే 'కె' ఆకారపు రికవరీ జరుగుతోందని అన్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు భారీ స్థాయిలో కేటాయింపులు చేశారని, కానీ ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా రాకపోతే ఆ కేటాయింపులు అమలు కావని, ఇది ఎన్నికల జిమ్మిక్కేనని స్పష్టం చేశారు.


'ఆత్మ నిర్భర భారత్‌ బడ్జెట్‌ అని, దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ దేశీయ, విదేశీ కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ఈ బడ్జెట్‌ మార్గం ఇచ్చింది' అని విమర్శించారు. అన్ని రంగాల్లో భారీ స్థాయిలో ప్రైవేటీకరణ ప్రకటించారని, రూ.1.75 లక్షల కోట్లు లక్ష్యంగా ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఖనిజ వనరులు, ప్రత్యేక సరుకు రవాణా మార్గాలు వంటివాటిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రకటించారని, విదేశీ పెట్టుబడులను అనుమతించారని విమర్శించారు. ఇన్సురెన్స్‌ రంగంలోకి ఎఫ్‌డిఐలను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారని, అలాగే కొన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేసి విదేశీ బ్యాంకులకు అమ్మేసేందుకు ప్రతిపాదించారని తెలిపారు. దేశ ప్రజలు పొదుపు చేసే సొమ్మును విదేశీ పెట్టుబడిదారులు దోచుకుంటారని తెలిపారు.


కేటాయింపులు తగ్గింపు
దేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో కేటాయింపులు తగ్గించారని తెలిపారు. తీవ్రమైన చలిలో లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నారని, కానీ వారికి కూడా ఉపశమనం దక్కలేదని అన్నారు. ఎరువులు సబ్సీడి, ఆహార సబ్సీడి తగ్గించడం వలన ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు. పెట్రోల్‌, డిజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల సబ్సీడి తగ్గించారని తెలిపారు. నిరుద్యోగం గుర్తించి ప్రస్తావన లేదని, ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. కానీ అటువంటి ప్రకటనలు ఏమీ లేకపోగా, ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు 42 శాతం తగ్గించారని విమర్శించారు.


సమాఖ్య విధానానికి తూట్లు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచి డిమాండ్‌ను పెంచాల్సి ఉన్నా అందుకు సంబంధించిన చర్యలేవి బడ్జెట్‌లో లేవన్నారు. గత బడ్జెట్‌లో కంటే వ్యయాన్ని తగ్గించారని తెలిపారు. ఈ బడ్జెట్‌ వచ్చే ఏడాదికి అత్యంత దుర్భర స్థితిని సఅష్టిస్తుందని తెలిపారు. ఒకపక్క ప్రజల సంపద పడిపోతుంటే, 100 మంది బిలినీయర్ల సంపద 13 లక్షల కోట్లు పెరిగిందని అన్నారు. బడ్జెట్‌లో సెస్‌ను పెంచిందని, అలాగే వ్యవసాయ సెస్‌ తీసుకొచ్చిందని అన్నారు. ఎక్సైజ్‌ డ్యూటీలను తగ్గించడంతో రాష్ట్రాల వాటాలను తగ్గించారని, సెస్‌ పెంచటంతో కేంద్రానికి ఆదాయం వస్తుందని తెలిపారు. రాష్ట్రాలకు ఇవ్వల్సిన జిఎస్‌టి పరిహారం రూ.20 వేల కోట్లకు పైగా తగ్గించారని అన్నారు. దీనివల్ల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతాయని పేర్కొన్నారు. ఇది ముమ్మాటి సమాఖ్య విధానాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు కేంద్రాన్ని అడుక్కునే స్థాయికి తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, పార్లమెంట్‌ వెలుపల కూడా ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేసేందుకు తమ కఅషిని కొనసాగిస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.