Nov 25,2020 06:47

దేశంలోని అపారమైన సహజ వనరులను, ఖనిజాలను యథేచ్ఛగా లూటీ చేసేందుకు కార్పొరేట్లకు లైసెన్సు ఇచ్చిన మోడీ ప్రభుత్వం తాజాగా బ్యాంకు పెట్టుబడిని కూడా ఈ రాబందుల చేతుల్లో పెట్టేందుకు సిద్ధపడింది. ఆర్‌బిఐ మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌ వంటి నిపుణుల హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ ఆర్‌బిఐ వర్కింగ్‌ గ్రూపు తెచ్చిన ప్రతిపాదనలు బ్యాంకింగ్‌ వ్యవస్థను నాశనం చేసేవిగా ఉన్నాయి. బ్యాంకుల ఏర్పాటుకు బడా పారిశ్రామిక సంస్థలకు ఇంతవరకు అనుమతి లేదు. మోడీ ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేట్లకు పూర్తి స్వేచ్ఛను ప్రసాదించింది. నాన్‌ ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ సంస్థలన్నీ ఇప్పుడు బ్యాంకులుగా అవతరించనున్నాయి. ఇందుకనుగుణంగా బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం (1949)ను సవరించాలని మోడీ ప్రభుత్వం చూస్తున్నది. యస్‌ బ్యాంకు, లక్ష్మీ విలాస్‌ బ్యాంకుల బాగోతం కళ్లెదుట ఉన్న, ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో బ్యాంకుల యాజమాన్యాన్ని పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడం దారుణం. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య దేశద్రోహం కన్నా తీవ్రమైన నేరం.

నయా ఉదారవాద విధానాల పేరుతో ఇంతవరకు నవరత్నాలుగా ప్రసిద్ధిగాంచిన పరిశ్రమలను ప్రైవేట్‌ పరం చేసినా, బ్యాంకింగ్‌, బీమా రంగాలు చాలా వరకు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. వీటిని కూడా ప్రైవేట్‌ పరం గావించేందుకు మోడీ 2.0 ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నది. బ్యాంకులు, బీమా, ఇతర ఫైనాన్స్‌ రంగాల ప్రైవేటీకరణకు అడ్డుగా ఉన్న రఘురామ్‌ రాజన్‌, ఉర్జీత్‌ పటేల్‌ను ఒక పథకం ప్రకారం తప్పించింది. తనకు నమ్మిన బంటులా ఉన్న శక్తికాంత్‌ దాస్‌ను ఆర్‌బిఐ గవర్నరుగా తీసుకొచ్చి తన ఎజెండాకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకుంది. కార్పొరేట్లకు భారీగా లాభాలు సంపాదించి పెట్టడం కోసం ప్రజల కష్టార్జితాన్ని పణంగా పెడుతున్నది. మోడీ ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్లకు పన్ను మినహాయింపు, క్షమాభిక్ష, ఇతరత్రా రూపాల్లో లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చింది. విమానాశ్రయాలను, రైల్వేలను, ఓడరేవులు, టెలికామ్‌ వంటి కీలకమైన వ్యూహాత్మక రంగాలను ఒకదాని తరువాత ఒకటి కట్టబెడుతున్నది. పారిశ్రామిక, సేవా రంగాల్లో కార్పొరేట్ల గుత్తాధిపత్యం కలిగి వుండడమో లేదా సింహ భాగం దక్కించుకోవడమో జరుగుతోంది. మోడీకి దగ్గరగా ఉన్న పెట్టుబడిదారుల వద్ద సంపద పెద్దయెత్తున పోగుపడే విధానాలను ఒక వైపు అనుసరిస్తూ, మరో వైపు ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటూ మోసపుచ్చుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.2.10 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయించగా, అందులో రూ.90 వేల కోట్లు దాకా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రాబట్టాలని చూస్తున్నది.

మోడీ ప్రభుత్వ మతిమాలిన చర్యల వల్ల బ్యాంకింగ్‌ రంగం మరింతగా బలహీనపడుతుంది. బ్యాంకుల జాతీయీకరణకు ముందున్న అరాచక పరిస్థితికి దేశాన్ని నెడుతుంది. అంబానీకి అధిక లాభాలు సంపాదించిపెట్టడం కోసం ప్రభుత్వ రంగంలోని టెలికమ్యూనికేషన్స్‌ విభాగాన్ని మోడీ ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేస్తున్నదీ చూస్తున్నాము. అదానీ ఎయిర్‌లైన్స్‌ కోసం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను ఎలా దెబ్బతీసిందీ చూశాము. లక్ష్మీ విలాస్‌ బ్యాంకుపై మారటోరియం విధించిన గంట లోపే ఆ బ్యాంకును సింగపూర్‌కు చెందిన డిబిఎస్‌ బ్యాంక్‌కు అప్పగించేస్తున్నట్లు ప్రకటించింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌విబి) నష్టాలకు కారణమైన జెట్‌ ఎయిర్‌వేస్‌, కోక్స్‌ అండ్‌ కింగ్‌, కాఫీ డే, నీరవ్‌ మోడీ, రిలయెన్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వంటి రుణ ఎగవేతదారుల పారు బకాయిలపై చర్య తీసుకోవడానికి బదులు, ఎల్‌విబి ని విదేశీ బ్యాంకుకు అప్పగించడమే పరిష్కారమన్నట్లుగా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. ఈ విధానం దేశ ఆర్థిక స్వావలంబనను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తుంది. ఈ దేశాన్ని, దేశ స్వాతంత్య్రాన్ని ప్రేమించేవారంతా ప్రతిఘటించాల్సిన విధానం ఇది.