Nov 27,2020 10:07

మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాటేస్తోంది. వ్యవసాయ హక్కు, విద్యుత్‌ హక్కు, విద్యా, వైద్య హక్కుపై దాడి చేసిన మోడీ ఇప్పుడు నూతన మోటారు వాహన చట్టం తెచ్చి రాష్ట్రంలో మరో హక్కును మింగేస్తున్నారు. మోటారు వాహన చట్టానికి సవరణలు చేయడంతో సొంత వాహనాలు నడుపుకొని బతుకుతున్నవారు, రెండు ట్రక్కులు కొనుక్కొని అద్దెకు తిప్పి జీవించే వారు నష్టపోనున్నారు. స్థానికంగా స్పేర్‌ పార్టులు తయారు చేసే కంపెనీలు దెబ్బ తిని మూత పడడంతో ఉపాధి దెబ్బ తింటుంది. దేశ, విదేశీ ఆటోమొబైల్‌ కార్పొరేట్‌ కంపెనీలకు దేశం లోని రవాణా వ్యాపారం మొత్తాన్ని కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. ఇంతవరకు చట్టబద్దత లేకుండా తిరుగుతున్న ఓలా, ఊబర్‌ వంటి వాహన కంపెనీలకు చట్టబద్దత కల్పించారు. మోడీ అందుకోసం చట్టంలో ఎగ్రిగేటర్‌ విధానాన్ని ప్రవేశ పెట్టారు. వ్యక్తిగతంగా వాహనాలు అద్దెకు నడుపుకొని దేశంలో లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. భవిష్యత్‌లో ఓలా, ఊబర్‌ వంటి కంపెనీలతో పోటీ పడలేక నష్టపోయి ఉపాధి కోల్పోయిన వారి జీవితాలు దుర్భరంగా మారతాయి. 'అమ్మ పెట్టదు. అడుక్కు తిననివ్వదు' చందంగా ప్రభుత్వం ఉపాధి చూపదు. కష్టపడి బతుకుతున్న వారిని బడా కంపెనీలకు బలి చేస్తోంది.
 

ఇకపై షో రూంలోనే సర్వీసింగ్‌
వాహనాలు ఇకపై షో రూంలోనే సర్వీసింగ్‌ చేయించాలి. బయట వర్కు షాపుల్లో చేయడానికి వీల్లేదు. షో రూంలో భారీ వడ్డింపు ఉంటుంది గనుక బయట మెకానిక్‌ షాపుల్లో సర్వీసింగ్‌, రిపేర్‌ చేయించుకుంటారు. బడా కార్పొరేట్‌ కంపెనీల లాభం కోసం చిన్న, చిన్న వర్కు షాపులు పెట్టుకొని బతుకుతున్న వారి కడుపు కొట్టారు మోడీ. లక్షల మంది స్వయం ఉపాధిని దెబ్బ తీసి, వాహనదారులపై భారీ భారం వేశారు. ఇకపై ప్రభుత్వం ఆమోదించిన బ్రాండెడ్‌ కంపెనీల స్పేర్‌ పార్టులు మాత్రమే వాడాలి. స్థానికంగా తయారు చేసిన విడిభాగాలు వాడడం నేరం అవుతుంది. అలా వాడితే కనీస జరిమానా ఐదు వేల రూపాయలు విధించేలా చట్ట సవరణ చేశారు. దీంతో వాహనదారునిపై భారం పడడమే కాకుండా, స్థానికంగా తయారు చేస్తున్న స్పేర్‌ పార్టుల కంపెనీలు మూతపడతాయి. వీటిలో పని చేసేవారు ఉపాధి కోల్పోతారు. ఇదంతా కేవలం బడా కంపెనీల కోసమే.
 

భారీ జరిమానా విధింపు
మోడీ చట్ట సవరణలో భారీ జరిమానాల విధింపు మరొక ప్రమాదకరమైన అంశం. వాస్తవానికి ఒక వ్యక్తి నెల ఆదాయంలో 20 శాతానికి మించి జరిమానా విధించకూడదు. అయితే అంతకు మించి జరిమానాలు విధించే అవకాశం మోడీ ప్రభుత్వం కల్పించింది. ఈ బాధలన్నీ భరించలేక సొంత వాహనం కంటే ఓలా, ఊబర్‌ కంపెనీల వాహనాల్లో ప్రయాణం చేయడమే మంచిదన్న స్థితికి జనం వచ్చేలా వాహన చట్టం తీసుకొచ్చారు. మోడీ, అతని అనుంగు మిత్రులైన కార్పొరేట్‌ కంపెనీల కుట్ర ఇది. ఆర్‌టిసిల పై మోడీ మోటారు వాహన చట్టం ముప్పేట దాడి చేస్తున్నది. ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్‌ పేరుతో ఆర్‌టిసి నడుపుతున్న స్టేజ్‌ కేరియర్‌, ప్రైవేట్‌ బస్సు యజమానులు నడుపుతున్న కాంట్రాక్టు కేరియర్‌ రెండింటిని కలిపి ఒకటే చేశారు. ప్రైవేట్‌ యజమానులు చట్టవిరుద్ధంగా స్టేజ్‌ కేరియర్లుగా నడుపుతున్న బస్సులకు మోడీ చట్ట బద్దత కల్పించారు. ఇక ఆర్‌టిసి రూట్లలో ప్రైవేట్‌ బస్సులు ఇష్టారాజ్యంగా తిరిగి ఆర్‌టిసి ఆదాయాన్ని కాజేస్తాయి. ఆర్‌టిసి ఆర్థికంగా నష్టపోతుంది.
లాస్ట్‌ మైలేజ్‌ కనెక్టివిటీ పేరుతో ఆర్‌టిసి బస్సులకు బదులు, ప్రైవేట్‌ బస్సులు నడుపుకునేలా చట్టానికి మరో సవరణ చేశారు. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఇలా ప్రతీ డిపోను లాస్ట్‌ మైలేజ్‌ కనెక్టివిటీ పాయింట్‌ చేసి ప్రైవేట్‌ బస్సులు నడిపేందుకు వేసే ఎత్తుగడ ఇది. ఆ పేరున ప్రభుత్వం ఏరియా రూట్లను ప్రైవేట్‌ ఆపరేటర్లకు అప్పగిస్తుంది. దీంతో ఆర్‌టిసి తిరిగే రూట్లు తగ్గి ఆదాయానికి భారీగా గండి పడనుంది. ఇంత వరకు ఆర్‌టిసి బస్సులకు వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ లేదు. ఎందుకంటే ఆర్‌టిసి లో ప్రమాదాలు చాలా తక్కువ. ప్రమాదం జరిగితే ఆ నష్టపరిహారం ఆర్‌టిసి చెల్లిస్తుంది. ప్రమాదాలకు ఆర్‌టిసి చెల్లించే నష్టపరిహారం చాలా తక్కువ. అదే ఇన్సూరెన్స్‌ చేస్తే చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. నూతన వాహన చట్ట సవరణతో ఆర్‌టిసి లో ఇన్సూరెన్స్‌ గ్యారెంటీ చేసి, పెను భారం మోపారు. ఫలితంగా ఆర్‌టిసి నష్టపోతుంది. నష్టపోయిందని ఆర్‌టిసి ని అమ్మకానికి పెడతారు. అప్పుడు ప్రైవేట్‌ ఆపరేటర్లు ప్రజలను ఇష్టానుసారం దోచేస్తారు. మోడీ చట్టంతో ప్రజలపై జరగబోయే దాడి ఇదే.
 

'ఒకే దేశం-ఒకే పర్మిట్‌' మోసపూరితం
'ఒకే దేశం-ఒకే పన్ను' పేరుతో జిఎస్‌టి ప్రవేశ పెట్టి రాష్ట్రాల ఆర్థిక వనరులను మోడీ ప్రభుత్వం లాగేసుకుంటోంది. 'ఒకే దేశం-ఒకే పర్మిట్‌' పేరుతో పర్మిట్లు తీసుకొని దేశంలో ఎక్కడికైనా వాహనాలు తిప్పుకోవచ్చు. ఫీజు తక్కువ వున్న రాష్ట్రాల్లో పర్మిట్‌ తీసుకోవడంతో ఇతర రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతాయి. మరోవైపు కేంద్రం పర్మిషన్‌ ఇచ్చే రూట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పర్మిట్లు చెల్లుబాటు కాని విధంగా చట్టం తెచ్చింది. మోడీ తీసుకొచ్చిన వాహన చట్టం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. ఆర్‌టిసి నష్టపోతుంది. అద్దెలకు కార్లు, ట్రక్కులు, ఆటోలు నడుపుకొని బతుకుతున్నవారు, స్పేర్‌ పార్టులు తయారు చేసే కంపెనీలు, మెకానిక్‌ షాపులు, సర్వీసింగ్‌ సెంటర్లు, ఆటో విడి భాగాల దుకాణాలు నడుపుకొని జీవిస్తున్నవారు వీధిన పడనున్నారు. బడా రవాణా కంపెనీల కోసం రాష్ట్రానికీ, ప్రజలకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని వైసిపి ప్రభుత్వం ఎదిరించడం లేదు సరికదా ఆ చట్టం అమలుకు సిద్ధపడింది. వాహన చట్టంపై చంద్రబాబు నోరు విప్పడం లేదు. తమ రాజకీయ లబ్ధి కోసం వైసిపి, టిడిపి పోటీ పడి మోడీ తప్పుడు విధానాలను బలపరుస్తున్నాయి. ప్రజల బాగోగులను పట్టించుకోవడం మానేస్తున్నాయి. ప్రజలే మోడీ చేసిన నూతన వాహన చట్టం రద్దయ్యే వరకు పోరాడాలి.
            - ఎం. కృష్ణమూర్తి (వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర ్గసభ్యులు, సెల్‌ 9490098808)