Nov 23,2020 13:21

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగంలో ఉన్న దాదాపు 20 కోట్ల మంది కార్మికులు ఈనెల 26వ తేదీన సార్వత్రిక సమ్మెలో పాల్గనబోతున్నారు. పది కేంద్ర కార్మిక సంఘాలు, డజన్ల సంఖ్యలో ఉన్న స్వంతంత్ర ఫెడరేషన్లు ఉమ్మడిగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు తప్పు మిగిలిన కార్మిక సంఘాలన్నీ సమ్మెకు పిలుపునిచ్చాయి.

కార్మిక సంఘాలతో సమన్వయం చేసుకుంటూ ఈనెల 26,27 తేదీల్లో దేశవ్యాపితంగా ఆందోళనలకు దాదాపు 300కు పైగా రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీకి అనుకొని ఉన్న రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది రైతులు నిరసన తెలపడానికి ఢిల్లీకి చేరుకుంటున్నారు.

స్టీలు, పోర్టులు, బగ్గు, టెలికమ్‌, ఇంజనీరింగ్‌, రవాణా, రక్షణ ఉత్పత్తులు లాంటి ఉత్పాదక రంగ సంస్థలతోపాటు సేవల రంగానికి చెందిన బ్యాంకులు, బీమా సంస్థ
లకు చెందిన ఉద్యోగులు, కార్మికులంతా ఈనెల 26వ తేదీన సమ్మెలో పాల్గనబోతున్నారు. ప్రభుత్వ స్కీమ్‌ వర్కర్లయిన ఆశా వర్కర్లు, మధ్యాహం బోజనం వంటలక్కలు, ఎఎన్‌ఎమ్‌లతోపాటు మహిళా ఉద్యోగులంతా సమ్మెలో పాల్గనబోతున్నారు.

ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రైతులు ఈనెల 26వ తేదీన మొదలు పెట్టి మరుసటి రోజు కూడా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల ముందు, రాష్ట్ర శాసనసభల ముందు ధర్నా కార్యాక్రమాలను నిర్వహిస్తారు. పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ బంద్‌ను పాటిస్తారు.

కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు?
పారిశ్రామిక రంగంలో ఉన్న కార్మికులు, సేవల రంగంలో ఉన్న ఉద్యోగులు కనీస వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేయాలని, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, ప్రభుత్వం రంగ సంస్థలను ప్రయివేట్‌ వ్యక్తులకు అమ్మవద్దని ఆందోళనలు చేశారు, ధర్నాలు చేశారు. ప్రభుత్వంలోని పెద్దలకు ఎన్నో వినతిపత్రాలు సమర్పించారు. కానీ సంపద సృష్టికర్తలైన ఈ కార్మికులను మోడీ ప్రభుత్వం చిన్న చూపే చూస్తోంది. వారి డిమాండ్ల్లలో ఒక్క దాన్ని కూడా నెరవేర్చ లేదు. కార్మికుల పట్ల ఈ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ 2015, 2016, 2019, జనవరి 2020లో కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గన్నారు.

అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతున్నా మోడీ ప్రభుత్వం ప్రస్తుతం రక్షణగా ఉన్న కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో లేబర్‌ కోడ్‌లను ప్రవేశపెట్టింది. ఈ కోడ్‌ల కారణంగా కార్మికులపైన పని భారం పెరుగుతుంది. సరైన వేతనాలను తీసుకునే పరిస్థితి ఉండదు. నిర్ధిష్ట కాలానికే కార్మికులను నియమించుకునేలా, ప్రొవిడెంట్‌ ఫండ్‌ కట్టకుండా యజమాన్యం తప్పించుకునేలా, కార్మికుల ఆరోగ్య భీమా సౌకర్యాలు సన్నగిల్లేలా ఈ కోడ్‌లు పని చేస్తాయి. ముఖ్యంగా కార్మికుల హక్కుల రక్షణకు చాలా కీలకమైన కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును లాగేసుకుంటున్నారు.

క్లుప్తంగా చెప్పాలంటే కార్మికులను తీవ్రంగా దోపిడి చేసుకునేందుకు యాజమాన్యాలకు పూర్తి అవకాశాన్ని కట్టబెడుతున్నారు. ఇటీవల ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా ఈ పరిస్థితి మరింత ముదిరింది. చేసుకునేందుకు ఉద్యోగాల్లేక చాలా తక్కువ జీతాలకే కార్మికులు ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో మొద్దుబారిన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ డిమాండ్లు సాధించుకునేందుకు కార్మిక వర్గం సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ డిమాండ్లు ఏవంటే..కనీస వేతనం 21 వేల రూపాయలకు పెంచాలి, నెలకు పది వేల రూపాయల పెన్షన్‌, అవసరమున్న కుటుంబాలకు నెలకు పది కేజీల ఆహార ధాన్యాలు, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలి, పన్ను కట్టని కుటుంబాలకు నెలకు 7,500 రూపాయల నగదు బదిలీ, లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించాలి, మూడు వ్యవసాయ రంగ చట్టాలను ఉపసంహరించాలి, నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించాలి, జీడిపిలో ఐదు శాతం విద్యకు కేటాయించాలి, అందరికీ వైద్యం, అందుకోసం జిడిపిలో ఆరు శాతం కేటాయించాలి, నూతన విద్యుత్‌ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించాలి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను నిలిపివేయాలి.

రైతుల డిమాండ్లు ఏంటి?
తాము పండించిన పంటలకు అయిన ఖర్చు కంటే 50 శాతం అదనంగా కనీస మద్దతు ధరలను ప్రకటించాలని దేశంలోని రైతులు గత కొన్నేళ్లుగా అడుగుతున్నారు. ఈ విధంగా కనీస మద్దతు ధరలు ప్రకటించాలని 16 ఏళ్ల క్రితం స్వామినాథ్‌ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

రైతుల్లో 50 శాతం మంది అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారని, వారి అప్పులన్నీ మాఫి చేయాలని కూడా రైతులు అడుగుతున్నారు. ఈ రెండు చర్యలు తక్షణమే తీసుకొని తిరిగి వ్యవసాయాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరమయింది. లేకుంటే ఇప్పటికే మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా మరింత మంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉత్పన్నమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

వివిధ రూపాల్లో సుదర్ఘీంగా రైతులు చేసిన పోరాటాల కారణంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కంటితుడుపు చర్యలను తీసుకుంది. రైతులు పెట్టిన ఖర్చుకు 50 శాతం అదనంగా కనీస మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పింది. పెట్టిన ఖర్చుల్లో కొన్ని అంశాలను మినహాయించి తక్కువ మొత్తాన్ని ఖర్చుగా చూపించింది. ఈ విధంగానే రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల పంట సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సహాయం రైతులందరికీ చేరడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలేవి రైతుల ప్రాధమిక సమస్యలను పరిష్కరించలేదు.

ఈ ఏడాది కరోనా మహమ్మారి కష్టకాలాన్ని అనుకూలంగా మార్చుకొని కేంద్ర ప్రభుత్వం రైతులకు అత్యంత నష్టదాయకమైన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలను ఆమోదించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కనీసం పార్లమెంట్‌లో చర్చ కూడా చేయలేదు. ప్రతిపక్ష సభ్యులను పార్లమెంట్‌ నుంచి బయటకి పంపేసి చట్టాలను ఆమోదించుకుంది.

కనీస మద్దతు ధరకు ఏమాత్రం భరోసా ఇవ్వకపోవడమే కాక కార్పొరేట్‌ శక్తుల దోపిడికి ఉపయోగపడే ఈ మూడు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టాల కారణంగా లాభాపేక్షతో రగిలిపోయే ఈ కార్పొరేట్‌ శక్తులు ఏ పంటలు పండించాలి, ఎంత మొత్తం పంట కొనాలి, ఏ రేటుకు కొనాలి, ఎంత మొత్తంలో నిల్వ చేయాలి, ఏ రేటుకు అమ్మాలి అనే అన్ని విషయాలను నిర్ణయిస్తాయి. దీంతో దేశవ్యాప్తంగా రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. వరుసగా ఆందోళనల్లో పాల్గన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది రైతులు ఆందోళనల్లో పాల్గన్నారని అఖిల భారత కిసాన్‌ సభ నాయకులు హనన్‌ మొల్లా తెలిపారు.

ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, అప్పులను రద్దు చేయాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ రైతులు ఈనెల 26,27 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించబోతున్నారు.

కార్మికులు, కర్షకులు ఒకే రోజు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు?
భారత ఆర్ధిక వ్యవస్థకు మూల స్తంభాలైన కార్మికులు, కర్షకుల సమస్యలకు మూల కారణం కేంద్రంలోని మోడీ సర్కార్‌. వీరి సమస్యలను అసలు పట్టించుకోలేదు. భారత్‌లో కార్మికులు, కర్షకులకు మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయి. కార్మికులుగా పనిచేసే వారిలో చాలామందికి ఇప్పటికీ గ్రామాల్లోని తమ భూములతో సంబంధాలు కల్గిఉన్నారు. వ్యవసాయరంగంలో నిరుద్యోగం కారణంగా చాలామంది గ్రామాలను వదిలేసి పట్టణాల్లోకి వెళ్లి కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఆ కారణంగా కార్మికులు, కర్షకులకు విడదీయలేని బంధం ఉంది. ప్రారంభంలో ఎవరికి వారే ఆందోళనలు చేసేవారు. కానీ రానురాను మొండిగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు మెడలు వంచాలంటే కలిసి పోరాటం చేయక తప్పదని రెండు వర్గాలు గ్రహించాయి. అందులో భాగంగానే ఒకే సమయంలో పోరాటాలు చేసేందుకు కార్యాచరణను ప్రకటించాయి. ఈసారి అన్ని కార్మికసంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ, రైతు సంఘాల సమన్వయ కమిటీ కలిసి కూర్చొని పూర్తిస్తాయిలో సమన్వయం చేసుకొని ఈనెల 26,27 తేదీల్లో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ ఐక్యత రానున్ను రోజుల్లో దేశంలోనే ప్రధాన శక్తిగా అవతరించనుంది.

కార్మికులు, కర్షకులు కేవలం వాళ్ల డిమాండ్ల కోసమే పోరాడుతున్నారా?
లేదు. మత ప్రాతిపాదికగా దేశాన్ని విభజించేందుకు మోడీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అయిన హిందూ రాజ్య భావనను ముందుకు తెస్తోంది. అందులోభాగంగా అమలు చేస్తున్న జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, ఎన్‌ఆర్‌సి, సిఎఎ అమలుకు వ్యతేరకంగా కూడా కార్మికులు, కర్షకులు గళం విప్పుతున్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చేలా మోడీ ప్రభుత్వం చేస్తున్న చర్యల పట్ల కూడా వీరు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను ధ్వంసం చేస్తూ తామ ఇష్టానుసారంగా చట్టాలను ఆమోదించుకునే మోడీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, విద్యకు ఐదు శాతం, ఆరోగ్యానికి ఆరు శాతం జిడిపిలో నిధులు కేటాయించాలనే డిమాండ్లకు కూడా వీరు మద్దతినిస్తున్నారు.

జనవరి 26,27 తరువాత ఏం జరగుతుంది?
కార్మికులు, కర్షకులు కలిసి నిర్ధుష్ట కార్యాచరణను ప్రకటిస్తారు. కానీ ఇప్పటికే కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి పోరాటాలను మరింత ముందుకు తీసుకుపోవాలని, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని మరింత ముందుకు సాగాలని నిర్ణయించాయి. దీంతో రానున్న కాలంలో మరిన్ని పోరాటాలను మనం చూడబోతున్నాం.