Nov 29,2020 12:12
తొలి ఏడాది విభన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లను, వీల్‌ ఛైర్లను అందిస్తున్న సోషల్‌ రెస్పాన్సిబిల్టీ నాయకులు

కార్మిక యూనియన్‌ అంటే కేవలం కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేసేదనుకుంటాం. అది మాత్రమే కాదు.. ఈ సమాజం కోసం తన వంతుగా ఆపన్నుల్నీ ఆదుకోవడం. అది బాధ్యత అనుకోవడమే కాదు.. ఆచరణలోనూ చూపుతోంది 'ట్రేడ్‌ యూనియన్‌ సోషల్‌ రెస్పాన్సిబిల్టీ' (టియుఎస్‌ఆర్‌) కార్యక్రమం.


'కోరమాండల్‌ ఫెర్టిలైజర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఎఫ్‌ఇయు)' ను 1969లో కార్మికుల హక్కుల్ని సాధించుకోవడం కోసం స్థాపించారు. కేవలం కార్మికుల హక్కుల సాధనకే కాకుండా విశాఖ నగరం నుంచి ఇతర రాష్ట్రాల్లోని అవసరార్థుల్ని గుర్తించి, వారికి అండగా నిలవాలని ఆ యూనియన్‌ అనుకుంది. మచ్చుకు కర్నూల ్‌లో వరదలొచ్చినప్పుడు, ఒడిశాలో తుపాను భీభత్సమప్పుడు కోరమండల్‌ కార్మికులు తమ వంతు ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోలేదు. ఆ ప్రాంత ప్రజావ సరాలను తీర్చేందుకు నడుం బిగించారు. అందుకోసం కార్మికులంతా బృందంగా ఏర్పడి, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అలా బాధితులకు సాయం అందించడం తమ బాధ్యతగా భావించింది సిఎఫ్‌ఇయు. అందులో భాగంగానే... బియ్యం, పప్పు, ఉప్పు, కప్పుకునే దుప్పట్ల నుంచి వేసుకునే బట్టల్ని సైతం సేకరించి, అందించింది. సహాయ చర్యల్ని చేయడంలో ముందుండి, వారికి అండగా నిలిచింది. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే.. ఇలాంటివి ఎన్నో చేపట్టింది సిఎఫ్‌ఇయు.
 

పరులకోసం పాటు పడుతూ..
ప్రకృతి విపత్తుల సమయంలోనో, ఆపన్నులు తారసపడినప్పుడో చేసే సేవా కార్యక్రమాలే కాదు.. అభాగ్యు లకూ, అనాథలకూ తమవంతు సాయాన్ని ప్రారంభించాలని సిఎఫ్‌ఇయు భావించింది. అలా కార్మికులంతా పరుల కోసం పాటుపడాలనేది వారి నిత్యజీవితంలో భాగమైంది. కార్మిక యూనియన్‌ చరిత్రలోనే ఎక్కడా వినిపించని, 'ట్రేడ్‌ యూనియన్‌ సోషల్‌ రెస్పాన్సిబిల్టీ' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిఎఫ్‌ఇయు ప్రపంచ కార్మికుల దినోత్సవం 1 మే, 2013లో పురుడు పోసుకుంది. సాధారణంగా ప్రభుత్వం లేదా యాజమాన్యం ఏర్పాటుచేసిన సామాజిక బాధ్యతల్ని కొన్ని పరిశ్రమల్లో 'కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిల్టీ' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. కానీ ఎటువంటి చట్టాలూ వర్తించని ట్రేడ్‌ యూనియన్‌ కేవలం కార్మికుల చొరవతో.. సామాజిక బాధ్యతతో, ఈ కార్యక్రమానికి పునాది వేసింది. అందుకోసం కోరమాండల్‌ ఫెర్టిలైజర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌లో ఉన్న ప్రతి కార్మికుడికి నెలకు 10 రూపాయల్ని తమవంతుగా ఇవ్వాలని నియమం పెట్టుకున్నారు. అలా ప్రారంభంలో పది రూపాయలతో ప్రారంభించిన వారు ప్రస్తుతం 50 రూపాయల్ని అందజేస్తున్నారు.
 

కొందరు వ్యక్తులే... ఒక మహాశక్తిగా..
సోషల్‌ రెస్పాన్సిబిల్టీ కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకెళ్లేందుకు టియుఎస్‌ఆర్‌ కోసం యూనియన్‌ కార్యవర్గ సభ్యులతో పాటు ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసింది. విశాఖ నగర నలుమూలల నుంచి ఎటువంటి అవసరార్థులు ఉన్నారో... వారి అవసరాల్ని తెలుసుకుని వారికి సాయం చేయడానికి ఓ మార్గం వేసుకుంది. అందులో భాగంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న అన్ని సెక్షన్లకార్మికుల్ని ఒక దగ్గరకు చేర్చింది. విశాఖ నగరం నలుమూలల నివసిస్తున్న కార్మికులను ఎంపిక చేసుకొంది. ఔత్సాహకులనూ ఈ కమిటీలో చేర్చుకుంది. వారిలో సేవ చేసేందేకు ఆసక్తి, చొరవ కనబర్చిన వారితో కలిపి, ఓ కమిటీ వేసింది. ఆ విధంగా నగరంలో కార్మికుల స్థితిగతుల్ని, ఎక్కడ వారి అవసరాలు ఉన్నాయో తెలుసుకుని రూపాయి, రూపాయని సమకూర్చి మరీ అండగా నిలిచింది.
 

అనాథలకు, దివ్యాంగులకు అండగా..
తొలి ఏడాది 'సోషల్‌ రెస్పాన్సిబిల్టీ' కార్యక్రమంలో భాగంగా మొదటిసారి విభన్న ప్రతిభావంతులకు 'ట్రై సైకిళ్లను, వీల్‌ చైర్లను అందించింది. అనాథ ఆశ్రమంలోని పిల్లలకు బంగారు భవిష్యత్తుని నిర్మించడం కోసం వారికి చదువుని అందించాలనుకుంది. అంతేకాదు, అంధ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని భావించింది. వారి కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపి సాఫ్ట్‌వేర్‌ను డిజైన్‌ చేయించి అందించింది. బధిర (డెఫ్‌ అండ్‌ డమ్‌) బాలికలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసి, వారిని నిలబెట్టింది. ఆ కార్యక్రమంలోనే సిఎఫ్‌ఇయు అనాథ ఆశ్రమానికి వేల రూపాయల్ని భవన నిర్మాణ సామాగ్రి రూపంలో అందించింది. ఇలా ప్రతి ఏడాది తమ వంతుగా సాయాన్ని అందిస్తూనే వస్తోంది. అనాథ పిల్లల్ని, బధిరుల్ని ఆదుకోవడమే కాకుండా.. నిరుపేద పిల్లలు చదుకోలేని వారిని గుర్తించి, వారికి స్కాలర్‌షిప్‌ల్ని అందజేసింది. అలా అంతా కలిసికట్టుగా అందరికీ తోడ్పడింది.

లాక్‌డౌన్‌లో కడుపు నింపి..
ఎంతటి కష్టం వచ్చినా... ఏ సమయంలోనైనా మేమున్నామని లాక్‌డౌన్‌లో నిరూపించింది. అవసరార్థులు ఏమూలైన్నా... తమ సాయం చేరేలా ప్రణాళికా బద్ధంగా అడుగులేస్తోంది. కరోనా మహమ్మారికి బలైన ఎందర్నో ఆదుకొంది. లాక్‌డౌన్‌ సమయంలో ఈ కార్యక్రమం ద్వారా 500 కేజీల బియ్యాన్ని, పప్పుల్ని, ఉప్పుల్ని నిరుపేదలకు పంపిణీ చేసింది. రక్తదానం ప్రాణంతో సమానంగా భావించింది. అందుకోసం ప్రతి ఏటా మేడే రోజున రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కేవలం కార్మికులే కాకుండా, యాజమాన్యం, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు. అంతేకాదు కరోనా కాలంలోనూ కార్మికులంతా ముందుకొచ్చి, రక్తదానం చేశారు. అలా గత ఎనిమిదేళ్లుగా కార్మికులు ఈ కార్యక్రమం ద్వారా 1415 యూనిట్ల రక్తదానాన్ని చేశారు.


ఐదు దశాబ్దాలుగా సిఎఫ్‌ఇయు ఎనిమిదేళ్ల టియుఎస్‌ఆర్‌ పేరుతో చేపట్టిన అపురూపమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగిస్తోంది. అందుకు ముందుకొచ్చిన ఎందరో కార్మికులకు, దీనిని ముందుకు నడిపిస్తోన్న సంఘ నాయకులకే దక్కుతుంది. ఈ స్ఫూర్తిని అందరం అన్నిచోట్లా అందుకోవాల్సిందే. అనుసరించాల్సిన విషయమే.