Aug 01,2021 10:25

గత ఐదు దశాబ్దాల్లో హిమాలయ ప్రాంతంలో హిమనీ నదుల సంఖ్య పెరిగింది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా హిమనీ నదులు తీవ్రంగా ద్రవీభవిస్తున్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులు తీవ్ర పరిణామానికి సూచికగా పరిగణించాలని హిందూ కుష్‌ హిమాలయన్‌ (హెచ్‌కెహెచ్‌) సంస్థ పేర్కొంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై తొలిసారి అంచనా వేసింది. వాతావరణ మార్పుల వల్లే మంచు, వర్షపు పోకడల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. మానవాళి విచ్చలవిడిగా విడుదల చేస్తున్న హానికారక వాయువులతో హిమశిఖరాలు నిలువునా కరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల హిమానీ నదాలు తరిగిపోయి, జలవిలయానికి కారణమవుతున్నాయి.

    తాజాగా ఐస్‌లాండ్‌లో 20 ఏళ్లలో ఏకంగా 750 చదరపు కిలోమీటర్ల మేర మంచు కరిగిపోయింది. అంటే, అక్కడ ఏడు శాతం మంచునీళ్లలా మారిపోయింది. ఆ దేశ భూభాగంలో 10 శాతానికిపైగా విస్తరించి ఉన్న హిమనీనదాలు 2019లో 10,400 చదరపు కిలోమీటర్లకు కుచించుకుపోయినట్టు ఐస్‌లాండ్‌ సైంటిఫిక్‌ జర్నల్‌ జోకుల్‌ అధ్యయనంలో తేలింది. మనదేశంలోని హిమాలయాల ఉత్తర వాలులో హిమనీనదాలలోనూ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. 1980-2010 మధ్య చంద్ర-భాగా బేసిన్‌లో సంవత్సరానికి 0.1 శాతం మేర, పోయిక్‌ బేసిన్‌లో 1986-2001 మధ్య ఒక్క శాతం కంటే ఎక్కువ తగ్గినట్లు గుర్తించారు. కాగా లడఖ్‌లో మాత్రం తక్కువ స్థాయిలో ప్రభావం చూపుతున్నప్పటికీ, హిమనీనదాలు పెద్దవాటి కంటే వేగంగా తగ్గిపోతున్నాయి. 1973 నుంచి హిందూ కుష్‌ పర్వతాలలో భారీగా మార్పులు సంభవించినప్పటికీ వీటి పరిశీలనకు ఎటువంటి అధ్యయనాలూ జరగలేదు. ఖంబు ప్రాంతంలోని అధ్యయనాల ప్రకారం 1962-2005 మధ్య కాలంలో సంవత్సరానికి 0.12+ 0.05 శాతం, 1962-2011 మధ్యకాలంలో 0.27+ 0.06 శాతం మార్పులు నమోదయ్యాయి.
    అయితే 1890 నుంచి ఇప్పటి వరకూ 2,200 చదరపు కిలోమీటర్ల మంచు కరిగిపోగా.. అందులో మూడో వంతు గడచిన 20 ఏళ్లలోనే కరిగిపోవడం గమనార్హం. ఇది ఆ దేశ హిమనీనదాల్లో 18 శాతం. ఈ 20 ఏళ్లలో కరిగిన మంచు ఐస్‌లాండ్‌లోని అతిపెద్ద మంచుకొండ అయిన హాఫ్జోకల్‌కు దాదాపు సమానమని అధ్యయనం తెలిపింది. ఇక, 2014లో ఒక్జోకల్‌ను గ్లేసియర్‌ (హిమనీ నదం) హోదా నుంచి పరిశోధకులు తప్పించారు. రెండేళ్ల క్రితం ఆ హిమనీనదం పూర్తిగా కరిగిపోయింది.
     ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.2 లక్షల హిమనీ నదాలుండగా.. అందులో చాలా వరకు వేగంగా కరిగిపోతున్నాయని ఇటీవల నాసా పరిశోధనల్లో వెల్లడయ్యింది. సముద్ర మట్టాల పెరుగుదలలో వీటి నీరు ఐదో వంతు (20%) అని ఈ ఏడాది ఏప్రిల్‌లో నేచర్‌ జర్నల్‌లో ప్రచురించిన ఫలితాల్లో పేర్కొన్నారు. 2000 నుంచి 2019 మధ్య ఏటా 26,700 కోట్ల టన్నుల మంచు కరిగినట్టు నాసా టెరా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. 2000 నుంచి 2004 మధ్య ఏటా సగటున 22,700 కోట్ల టన్నుల మంచు కరిగితే.. అదే 2015 నుంచి 2019 మధ్య సగటు 29,800 కోట్లుగా తేలింది.
ఐస్‌లాండ్‌లో గ్లేసియర్స్‌కు ముప్పు పొంచి ఉందని, 2,200 నాటికి ఇవి పూర్తిగా కనుమరుగవుతాయని ఇటీవల నిపుణులు హెచ్చరించారు. '1890 నుంచి ఐస్‌లాండ్‌లో హిమానీనద-ప్రాంత వైవిధ్యాలు, వాతావరణంలోని వైవిధ్యాలకు స్పష్టమైన ప్రతిస్పందనను చూపుతాయి. దేశవ్యాప్తంగా హిమనీనదాలు కుదించుకుపోతున్నాయి. అయినప్పటికీ పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలు కొన్ని హిమనీనదాల ఉనికిని ప్రభావితం చేస్తాయి' అని అధ్యయనకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
      అయితే ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మౌంటేన్‌ డెవలప్‌మెంట్‌ (ఐసిఐyండి) ఆధ్వర్యంలో అంతకు మునుపు నిర్వహించిన ప్రాంతీయ అధ్యయనాలు అందుబాటులో లేకపోవడం వల్ల గతంలో నిర్వహించిన అనేక అధ్యయనాలను విశ్లేషించి ఓ అంచనాను రూపొందించింది. ఇప్పటివరకూ నమోదైన అంచనాలను అధ్యయనం చేసిన ఐసిఐఎండి భవిష్యత్తులో సంభవించే ప్రకృతి భయానక దృశ్యాన్ని గుర్తించింది. హిమనీ నదాల సంఖ్య పెరుగుదల ప్రధానంగా హిమనీనది విచ్ఛిన్నం కారణంగా పెద్ద నదులు చిన్న చిన్న నదులుగా విడిపోతున్నాయని గుర్తించారు. 1950 నుంచి హిమనీనదాల ప్రాంతంలో తగ్గుదల మాత్రమే గుర్తించారు. తూర్పు, మధ్య, పశ్చిమ హిమాలయాల్లో మంచుపర్వతాలు వేగంగా కుంచించుకుపోతున్నాయని అంచనా వేశారు.
      ఐసిఐఎంఓడి అంచనా ప్రకారం ప్రపంచంలో 1.5 డిగ్రీల సెల్సియస్‌, హెచ్‌కెహెచ్‌ ప్రాంతంలో మూడో వంతు హిమానీనదాలు 2100 నాటికి కనుమరుగవనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మూడింట రెండో వంతు కోల్పోయాము. 'ప్రపంచ సగటు కంటే పర్వతాలు వేగంగా వేడెక్కుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయగలిగినప్పటికీ, పర్వత ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్‌ కంటే పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. పర్వత ఉష్ణోగ్రతలు 4-6 డి.సెకి పెరిగితే ఆహారం, పర్యావరణ వ్యవస్థల్లో మార్పులు, నీటి ప్రవాహాలు, విపత్తులు వంటి భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పదని డైరెక్టర్‌ జనరల్‌ డేవిడ్‌ జేమ్స్‌ మోల్డెన్‌ వివరించారు.