
అనకాపల్లి : బౌలువాడలో క్వారీ నిర్వహించి తమ ఆరోగ్యాలతో ఆటలాడొద్దని ఆ పంచాయతీ ప్రజలు తేల్చిచెప్పారు. పంచాయతీలో వెంకటేశ్వర స్టోన్ క్రషర్ నిర్వహణపై శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. స్థానికుల అభిప్రాయం మేరకే క్వారీలకు అనుమతులు ఇస్తామని ఆయన వారికి తెలిపారు. పర్యావరణ శాఖకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు పర్యటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరిన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. క్వారీ క్రషర్ వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, తాగు, సాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని, ఇళ్లు బీటలు వారుతున్నాయని, గాలి కాలుష్యం ఏర్పడుతోందని తెలిపారు. యజమాన్యం స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించకపోవడం శోచ నీయమన్నారు. క్వారీ స్టోన్ క్రషర్లకు అనుమతులు ఇవ్వొద్దని, ఇప్పటికే ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల అభిప్రాయాలను సంబంధిత శాఖా మంత్రికి, అధికారులకు తెలియజేసి వారి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటానని జెసి తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ శాఖ ఎడి, మైన్స్ ఎడి, తహశీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.