Apr 13,2021 08:52
  • ఎపిఎండిసిని అడ్డుపెట్టుకొని ఖనిజం కొల్లగొట్టే యత్నం
  • గిరిజనుల జీవనోపాధికి గండి

ప్రజాశక్తి- విశాఖపట్నం ప్రతినిధి : విశాఖ ఏజెన్సీ ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలోని కాల్సైట్‌ ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎండిసి)ను అడ్డంపెట్టుకొని అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ నిమ్మలపాడుకు చెందిన రెండు చోట్ల 81.8 ఎకరాల్లోని కాల్సైట్‌ గనులు తవ్వేందుకు ఈ టెండర్లను ఎపిఎండిసి ఆహ్వానించింది. 21.8 ఎకరాలు, 60 ఎకరాలకు వేర్వేరుగా టెండర్లను పిలిచింది. అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యేకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ఎపిఎండిసి ప్రయత్నిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే గిరిజన భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్న సహకార సొసైటీలకు అవకాశం లేకుండా, గిరిజనులు వ్యక్తిగతంగా పాల్గొనేలా టెండర్లను పిలిచిందని అంటున్నారు. అభయ గిరిజన మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్‌ లేబర్‌ కాంట్రాక్టు కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆదేశంతో ఎపిఎండిసి ఈ టెండర్ల ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది. ఎపిఎండిసి ఖనిజ తవ్వకాలకు టెండర్‌ పిలిచిన భూమిని గిరిజనులు ఎంతోకాలంగా సాగు చేస్తున్నారు. వారి ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఎపిఎండిసి ఖనిజ తవ్వకాలకు టెండర్లను పిలవడం వివాదస్పదమైంది. కాల్సైట్‌ తవ్వకాలు చేపడితే నిమ్మలపాడు, కరకవలస, రాళ్లగరువు, సప్పనిగెడ్డ, వాలసి గిరిజనుల జీవనోపాధి దెబ్బతింటుందని అనంతగిరి సిపిఎం మాజీ ఎంపిటిసి డి.గంగరాజు తెలిపారు. షెడ్యూల్‌ ప్రాంతంలో పీసా, అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామసభకు పూర్తి అధికారాలు ఉన్నాయి. గ్రామసభ అనుమతిలేకుండా మైనింగ్‌ తవ్వకాలు, టూరిజం ప్రాజెక్టులు వంటివి చేపట్టకూడదని చట్టాలు చెబుతున్నాయి. కానీ, కాల్సైట్‌ ఖనిజం తవ్వకాలకు పిలిచిన టెండర్లలో కనీస నిబంధనలు ఎపిఎండిసి పాటించలేదు. నిమ్మలపాడు వద్ద కాల్సైట్‌ ఖనిజముందని గుర్తించినప్పటి నుంచీ అనేక మంది కళ్లు దీనిపై పడ్డాయి. ఈ ఖనిజాన్ని తవ్వుకుపోవడానికి 1975 నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చట్టాలు అందుకు ఆటంకంగా ఉండడంతో ఎపిఎండిసిని ముందుపెట్టి ఖనిజం కాజేసి లాభాలు పోగేసుకుందామని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టెండర్లను విశ్రాంత ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ తప్పుబట్టారు. షెడ్యూల్‌ ప్రాంతంలో గిరిజనులకు కల్పించబడిన హక్కులను కాదని మైనింగ్‌ తవ్వకాలకు టెండర్లు పిలవడం చట్టాలను ఉల్లంఘించడమేనని 'ప్రజాశక్తికి'తో అన్నారు. కాల్సైట్‌ ప్రాంతంలోని గిరిజన రైతుల సమ్మతిలేకుండా, గ్రామసభ అనుమతి లేకుండా టెండర్లు పిలవడం చట్టాన్ని ఉల్లంఘిం చడమే అవుతుందని 'సమతా' ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి పేర్కొన్నారు. గిరిజనులు ఏర్పాటు చేసుకున్న సొసైటీలకు ఖనిజ తవ్వకాలకు అనుమతివ్వాలి తప్ప, ప్రయివేటు వ్యక్తులకు కాదన్నారు. కాల్సైట్‌ తవ్వకాలకు ఎపిఎండిసి వేసిన ఈ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. షెడ్యూల్‌ ప్రాంతంలో గ్రామసభలు అనుమతిలేకుండా టెండర్లను ఆహ్వానించడం గిరిజన హక్కులు, చట్టాలను కాలరాయడమే అవుతుందని అన్నారు.
గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు దుర్మరణం