Feb 01,2021 22:19

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కాకుల్ని కొట్టి, గద్దలకు వేసే బడ్జెట్‌లా ఉందని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు సోమవారం ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరం బడ్జెట్‌లో కేంద్రం కార్పొరేట్‌ ట్యాక్స్‌ రూ.6.81 లక్షల కోట్లు జమ అవుతుందని ప్రకటించినా, రూ.4.46 లక్షల కోట్లు మాత్రమే వసూలు చేసిందని, రూ.2.5 లక్షల కోట్లు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చిందని తెలిపారు. అదే సమయంలో ప్రజల నుండి ఎక్సైజ్‌ డ్యూటీ రూ.2.67 లక్షల కోట్లు వస్తుందని చూపిందని, దాన్ని రూ.3.61 లక్షల కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నారు. కార్పొరేట్ల నుండి పన్నుల రాబడి తగ్గిందని, భారాలు మోపి ప్రజల నుండి రాబడి పెంచిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఎక్సైజ్‌ డ్యూటీ రూ.3.35 లక్షల కోట్లు జమ అవుతున్నట్లు ప్రకటించి అగ్రిసెస్‌ పేరుతో లీటర్‌ పెట్రోలుపై రూ.2.50, డీజిల్‌పై రూ.4 భారాలు మోపిందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల మీద భారాలు భారీ స్థాయిలో మోపడానికి సిద్ధమైందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో మన రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపారని, పూర్తి నిరాశకు గురి చేశారని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌, రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, పనికి ఆహార పథకం, 150 రోజులు లాంటి వాటి ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల కోసం రూపొందించినదిగా ఉందని తెలిపారు. కడప ఉక్కు, పోలవరం ప్రాజెక్టు ప్రస్తావనలు లేవని, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుతో అసలే ఉపాధి కోల్పోయిన వారు మరిన్ని భారాలకు గురవుతారని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల నత్తనడకకు కారణమవుతుందని తెలిపారు. రాష్ట్రాభివఅద్ధికి తగిన కేటాయింపులు లేకపోగా, ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీల ప్రస్తావనే లేదని, కొత్త ప్రాజెక్టులు లేకపోగా, పెండింగులో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు లేవని పేర్కొన్నారు. కరోనా వల్ల కుదేలైన ప్రజలకు అనేక దేశాల్లో నగదు బదిలీ చేసినా మన బడ్జెట్‌లో నగదు బదిలీ ప్రస్తావనే లేదని తెలిపారు. స్వయంసమఅద్ధి పేరుతో దేశ సంపదను, ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మే ప్రయివేటీకరణ ప్రతిపాదనలు చేశారని పేర్కొన్నారు. రక్షణ, ఇంధన, ఎయిర్‌ ఫోర్స్‌, రైల్వే వగైరా రంగాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తుందని తెలిపారు. ఎల్‌ఐసిలో కూడా 74 శాతం ఎఫ్‌డిఐకి అనుమతించిందని, మధ్యతరగతి ఉద్యోగులకు ఆదాయ పన్నులో ఎటువంటి ఊరటా లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్‌ సభ్యులు నిలదీయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరుతోందని తెలిపారు.