Sep 13,2021 15:58

కాబూల్‌ : కాబూల్‌ విమానాశ్రయంలో తొలిసారి అంతర్జాతీయ విమానం ల్యాండ్‌ అయ్యింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనపరచుకున్నాక అమెరికా, విదేశీ దళాలు ఆగస్టు 30న ఆ దేశం నుంచి పూర్తిగా వైదొలిన సంగతి తెలిసిందే. అనంతరం కాబూల్‌ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే అక్కడ సెప్టెంబర్‌ 3 నుంచి స్థానిక విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌ నుంచి తొలి పాకిస్తాన్‌ అంతర్జాతీయ ఎయిర్‌వేస్‌ (పీఐఏ) విమానం కాబూల్‌లో దిగింది. అయితే విమానంలో ఒక్క విదేశీ ప్రయాణికుడైనా లేడని ఏఎఫ్‌పీ జర్నలిస్ట్‌ తెలిపారు. కేవలం పదిమంది సిబ్బందితో ఆ విమానం కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యిందని చెప్పారు. ఈ విమానంలో వరల్డ్‌ బ్యాంక్‌ వంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన సిబ్బంది, వారి బంధువులు సుమారు వందమంది వరకు ఇస్లామాబాద్‌ చేరేందుకు వేచి ఉన్నట్లు కాబూల్‌ విమానాశ్రయ సిబ్బంది వెల్లడించారు.