Sep 15,2021 07:53

న్యూఢిల్లీ  : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నిరీక్షిస్తున్న జేఈఈ మెయిన్‌ (నాలుగో విడత) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టిఎ) ర్యాంకులను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. ఈ ఫలితాల్లో ఎపి, తెలంగాణ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. నలుగురు ఎపి విద్యార్థులకు, ఇద్దరు తెలంగాణ విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. ఎపి నుండి దుగ్గినేని వెంకటపనీష్‌, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్‌ నాయుడు, కర్నం లోకేశ్‌లకు, తెలంగాణ నుండి కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్యలు మొదటి ర్యాంకును సాధించినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఫలితాలను  jeemain.nta.nic.in  వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ సెప్టెంబర్‌ 11న ప్రారంభం అవ్వాల్సి ఉండగా, ఫలితాల విడుదలలో జాప్యం కారణంగా సెప్టెంబర్‌ 13కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మొదట మంగళవారం రాత్రి ఫలితాలు ప్రకటిస్తారని పేర్కొన్నప్పటికీ.. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్‌ సెషన్‌-4 పరీక్ష ఆగష్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1న జరిగింది. సెప్టెంబర్‌ 6న పరీక్ష పత్రం కీ పేపర్‌ను విడుదల చేశారు.

కాగా, ర్యాంకుల విడుదల తేదీని ఎన్‌టిఎ స్పష్టంగా చెప్పకపోవడంతో జేఈఈ మెయిన్‌ ఫలితాలను విడుదల చేయడంలో విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. గత మూడేళ్లుగా జేఈఈ మెయిన్‌ ఫలితాలను అర్ధరాత్రి, తెల్లవారు జామున విడుదల చేస్తూ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుందంటూ విద్యావేత్తలు విమర్శించారు. సిబ్బంది అనారోగ్యానికి గురికావడం కారణంగానే ఫలితాలు ఆలస్యమయ్యాయని ఎన్‌టిఎ డైరెక్టర్‌ జనరల్‌ వినీత్‌ జోషీ వెల్లడించారు.