Dec 03,2021 21:05

వ్యాక్సిన్‌ తప్పనిసరి చేస్తాం : చాన్సలర్‌
బెర్లిన్‌ :
జర్మనీలో కరోనా మరోసారి తన ప్రతాపం చూపుతోంది. దేశంలో గత 24 గంటల్లో 73, 209 కొత్త కేసులు, 388 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో అందోళనకర పరిస్థితి నెలకుంది. ఈ నేపధ్యంలో దేశంలో ప్రజలకు వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయనున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోని వారిని స్టోర్లు, దుకాణాలు, క్రీడాాసాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతించరు. ఈ విషయాన్ని ఆ దేశ చాన్సలర్‌ ఎంజెలా మార్కెల్‌ తాజాగా ప్రకటించారు. కరోనా ఇన్‌ఫెక్షన్లను నిరోధించడానికి వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడాన్ని పార్లమెంట్‌ పరిశీలించనునట్లు చెప్పారు. సమాఖ్య, రాష్ట్ర నేతలతో సమావేశం తరువాత మార్కెల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా రోగులతో ఆసుపత్రులు ఒత్తిడికి గురవుతాయని ఆందోళనలను పరిష్కరించడానికి ఈ చర్య అవసరమని ఆమె తెలిపారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
'దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉంది' అని మార్కెల్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేసే చర్యను 'జాతీయ సంఘీబావ చర్య'గా ఆమె పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా మాస్క్‌లు ధరించడం, సమావేశాలపై పరిమితి విధించడం, డిసెంబరు చివరినాటికి 30 మిలియన్ల టీకాల లక్ష్యం వంటి చర్యలకూ అధికారులు అంగీకరించినట్లు తెలిపారు. టీకాల లక్ష్యం చేరుకోవడానికి వ్యాక్సిన్‌ వేయడానికి దంతవైద్యులు, ఫార్మసిస్ట్‌లను కూడా అనుమతించనున్నారు. వ్యాక్సినేషన్‌ కోసం ఆసుపత్రులు, నర్సింగ్‌ హోముల్లో అవసరమైన సిబ్బందిని నియమించుకోవడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. దేశంలో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేసే ప్రతిపాదనపై జాతీయ ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం పార్లమెంట్‌ చర్చిస్తుందని చెప్పారు. వ్యాక్సిన్‌ తప్పనిసరిచేయడం అవసరమని తాను భావిస్తున్నట్లు మార్కెల్‌ చెప్పడం విశేషం. కొన్ని నెలల క్రితం వ్యాక్సిన్‌ తప్పనిసరి చేయడం ఎలాంటి ప్రభావం చూపదని తెలిపిన మార్కెల్‌ తాజాగా వ్యాక్సిన్‌ తప్పనిసరికి మద్దతు ప్రకటించడం గమనార్హం. జర్మనీలో ఇప్పటికే 68.7 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్‌ పొందారు. కనీసం 75 శాతం మందికి వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.