Feb 12,2021 00:26

ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - చింతపల్లి
సిపిఎం, సిపిఐ మద్దతుతో చౌడుపల్లి పంచాయతీ నుంచి సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొత్తూరు కాంతమ్మ గురువారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని గెర్లిగెడ్డ, టేకులవీధి గ్రామాల ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఉపాధి కూలీలను పలకరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న కాంతమ్మను గెలిపించాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోసం సిపిఎం చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు. పాలక పక్షాలు ప్రజా సంక్షేమంలో విఫలమైన తీరును తెలియజెప్పారు. అధికార పార్టీ బలపరిచిన సర్పంచి అభ్యర్థులు గెలిస్తేనే నిధులు వస్తాయని, మిగతా పార్టీల మద్దతుదారులు గెలిస్తే నిధులు రావనే చెడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఎర్రజెండా బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే గ్రామసీమల్లో మంచి పాలన అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు సాగిన చిరంజీవి, కిల్లో సింహాచలం, సిపిఐ నాయకులు పుత్తూరు చిన్నారావు, మల్లేశ్వరరావు దొర తదితరులు పాల్గొన్నారు.