
మంత్రి పేర్ని నాని
కలెక్టరేట్ : జనవరి ఒకటో తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యాన్ని నేరుగా లబ్దిదారుని ఇంటి వద్దకే అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. సోమవారం వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని, ఇందుకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నట్లు చెప్పారు. పర్యావరణ హితంగా ఉండేలా పునర్వినియోగ బ్యాగును బియ్యంతో పాటు పంపిణీ చేస్తారని తెలిపారు. వాహనంలో తీసుకెళ్లే బియ్యం బస్తాలకు టాంపర్ ఫ్రూఫ్ స్ట్రిప్ సీల్‌తో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని, దీని వల్ల ఎక్కడా ఆ బియ్యం పక్కదారి పట్టే అవకాశం ఉండదని చెప్పారు.