Nov 22,2020 06:52

''యువకులంతా ముందుకు రండీ.... యువతులంతా ముందుకు రండీ... నడుం వంగిన నాయకులంతా వెనుక వుండండి. అయితే, డింగరీ... జనం కోరేది మనం సేయడమా... మనం చేసేది జనం చూడటమా...'' అంటాడు మాంత్రికుడు. 'మన కన్నే, మన చెవే, మన మాటే మన జనం... జనమంతా నేనే... జనం కోరతాం... మీరు చేయండి'... అంటాడు డింగరీ. ఇది 'పాతాళభైరవి' సినిమాలోని సంభాషణ. అంటే... మేధావులు చేసేది, రాసేదే... జనం చూడాలా? చదవాలా? జనం కోరేది, చూసేదే మేధావులు చెయ్యాలా? అనేది ఒక చర్చ. రాముడు భీముడు, మంచిరోజులు వచ్చాయి, తోడికోడళ్లు వంటి అభ్యుదయ భావాలను పంచిన సినిమాలు ఇప్పుడెందుకు తీయడంలేదు? బాహుబలి, సరైనోడు లాంటి సినిమాలే ఇప్పుడెందుకు తీస్తున్నారు. నాటి సామాజిక వ్యవస్థ, సాంస్కృతిక విధానం ఒకదానికొకటి బాసటగా నిలిచాయి. ఒకదానికొకటి పరస్పర ప్రేరకాలుగా నిలిచాయి. మా 'అందరికోసం ఒక్కడు నిలిచి/ ఒక్కడి కోసం అందరు కలిసి/ సహకారమే మన వైఖరి అయితే/ ఉపకారమే మన ఊపిరి అయితే/ పేద గొప్ప భేదం పోయి అందరూ/ నీది నాదను వాదం మరచి వుందురు/ ఆ రోజెంతో దూరంలేదు' అన్న భావన వెల్లివిరిసింది. జనం కోసం పనిచేసేవారు, రాసేవారూ ఇప్పుడూ వున్నారు. కానీ, సాంస్కృతిక భావనలో మార్పు వచ్చింది. జాతీయోద్యమ భావన నుంచి దూరం జరిగింది. నీది, నాది అనే వాదం పెరిగింది.


సమాజం మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం, సమానత్వ భావాన్ని పెంపొందించడం కోసం మేధావులు కృషి చేయాలి. అలాకాకుండా ప్రజలను అస్తిత్వ ఉద్యమాల వైపు నడిపించడం సరికాదు. సంఘపరివార్‌ శక్తులు, పెట్టుబడిదారులతో కలిసి తమతమ ప్రయోజనాల కోసం కులం, మతం, వర్గం, ప్రాంతం వంటి మూఢనమ్మకాలను, అస్తిత్వభావాలను, ఆర్థిక అసమానతలను పెంచి పోషించారు. నేను ఎక్కువ, నువ్వు తక్కువ అనే ఆధిపత్య భావ జాలం నష్టదాయకం. ఆధిపత్యం యొక్క పరిధి ఇప్పుడు రాజకీయ రంగానికి మించి విస్తరించింది, ఇక్కడ అది సామాజిక, సాంస్కృతిక రంగాలను కూడా స్వాధీనం చేసుకుంది. 'అందరికోసం ఒక్కడు నిలిచి/ ఒక్కడి కోసం అందరు కలిసి' నడవాలి అన్నమాట పక్కకు పోయి, ఒక్కడి కోసమే అందరూ పనిచేయాలని అడుగుతున్నారు. నిర్బంధం చేస్తున్నారు. మూఢనమ్మకాలు, పేదరికం ఒకవైపు జోడుగుర్రాల్లా పరుగెడుతుంటే, కార్పొరేట్లు మాత్రం ఏడాదికేడాది సంపదను పోగేసుకుంటున్నారు. 'భవిష్యత్తులో మానవజాతి నశించిపోవడమంటూ జరిగితే అది అణుబాంబు వల్లనో, అంటురోగాల వల్లకాదు, నైతిక విలువల పతనం వల్ల మాత్రమే' అంటాడు ఐన్‌ స్టీన్‌. ఆ నైతికవిలువలను పరివార్‌ శక్తులు దిగజార్చుతున్నాయి. అస్తిత్వ ఉద్యమాలవైపు, మూఢనమ్మకాలవైపు ప్రోత్సహిస్తున్నాయి. వీటి నుండి విడివడి సమాజం సాంస్కృతిక పురోగమన బాట పట్టాలి.


ఏ సామాజిక, రాజకీయోద్యమమైనా విజయవంతం కావాలంటే, దానికి సమాంతరంగా సాంస్కృతికోద్యమం నడవాలి. మనం చేసిందే ప్రజలు చేయాలంటే, వారి ఆలోచనలను, వారి భావాలను ప్రభావితం చేయాలి. ఆ జనంతో కలిసిపోవాలి. వారి భౌతిక, ఆర్థిక అవసరాలను అర్థం చేసుకుంటూ, వారి ఆలోచనలను, భావాలను ప్రభావితం చేయగలగాలి. చైతన్యవంతమైన ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించాలి. ప్రత్యామ్నాయ సంస్కృతి కూడా రూపుదిద్దుకోవాలి. ఈ రెండు వ్యవస్థలూ ఒకదానికొకటి తోడుగా, ఒకదానిలో ఒకటి అనుసంధానమవుతూ... సమాంతరంగా కలిసి పయనించాలి. ప్రజల రోజువారీ అవసరాలైన తిండి, బట్ట, గూడు, కోసం వారు సాగించే పోరాటం, పడే ఆరాటం సాంస్కృతిక రంగంలోనూ ప్రతిబింబించాలి. రోజువారీ జీవితంతో నిమిత్తంలేని కళ, సాంస్కృతిక రూపాలు నిరుపయోగం. ప్రజాజీవితాన్ని ప్రభావితం చేయడానికి, సమాజాన్ని ముందుకు నడపడానికి, ప్రజలను కదిలించే కళారూపాలు రావాలి. సాంస్కృతికోద్యమం ప్రజల జీవన పోరాటంతో విడదీయలేనిది. ఆ రెండూ సమాంతరంగా సాగాలి.