Oct 14,2021 06:44

జమ్మూకాశ్మీర్‌లో గత వారం రోజులలో తీవ్రవాదులు ఏడుగురు సాధారణ పౌరులను కాల్చిచంపారు. ప్రతిఘటన దళం (రెసిస్టెంట్‌ ఫ్రంట్‌) పేరుతో ఈ హత్యాకాండను కొనసాగిస్తున్నారు. హత్యలకు గురైన వారిలో మైనారిటీలైన హిందువులు, సిక్కులతో పాటు మెజారిటీ మతానికి చెందిన ముస్లీంలు కూడా ఉన్నారు. ప్రజలను మతపరంగా విభజించి, తమ మతోన్మాద రాజకీయాలను ముందుకు తీసుకుపోవటానికి ప్రధాని మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఆటనే టెర్రరిస్టులు కూడా ఆడుతున్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయటం ద్వారా ముస్లీంలను అణచివేయటానికి, హిందువుల ప్రయోజనాలను కాపాడటానికి తాను ప్రయత్నం చేస్తున్నట్లు దేశ ప్రజలకు చూయించటానికి, ఆ విధంగా హిందువులను తన వెనుక సమీకరించుకోవటానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. టెర్రరిస్టులు కూడా ఇదే ఎత్తుగడను అనుసరిస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌కు, ముస్లీంలకు వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం, అధికారులకు, కేంద్ర ప్రభుత్వాన్ని బలపరుస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు టెర్రరిస్టులు ప్రచారం చేసుకొంటున్నారు. జమ్మూకాశ్మీర్‌ ప్రజల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరితమైన విధానాలు ప్రజలు ప్రభుత్వానికి దూరం కావటానికి, తీవ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తరించుకోవటానికి దోహదం చేస్తున్నాయి.

ఈ హత్యలు జరిగిన తర్వాత మైనారిటీ కమ్యూనిటీకి చెందిన కొందరు శ్రీనగర్‌ నుండి జమ్మూకు వలస పోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. రక్షణ కల్పిస్తామని, భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ వారిని ఆపటానికి అధికారులు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారికి విశ్వాసం కలగటం లేదు. కొద్దిరోజుల క్రితం వరకు జమ్మూకాశ్మీర్‌ లోని పరిస్థితులను గురించి ప్రభుత్వం, సంఫ్‌ు పరివార్‌ చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని ఈ పరిణామాలు వెల్లడి చేస్తున్నాయి. ఆర్టికల్‌ 370, 35 ఎ రద్దుతోనే జమ్మూకాశ్మీర్‌లో వేర్పాటువాదం అంతమౌతుందని, రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. వీటిని రద్దు చేసిన తర్వాత తీవ్రవాద కార్యకలాపాలు తగ్గాయని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. కాని కాశ్మీర్‌లో నెలకొన్నది శ్మశాన శాంతి అని, ఆర్టికల్‌ 370, 35ఎ రద్దుతో ప్రజలలో గూడుకట్టుకున్న అసంతృప్తి ఎప్పుడైనా బద్దలు కావచ్చునని చెబుతున్న మాటలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

దేశ విభజన సందర్భంగా మైనారిటీ మతస్తులు వున్న జమ్మూకాశ్మీర్‌ ప్రాంతం భారతదేశంలో భాగంగా మారుతున్నందుకు ప్రతిగా ఆర్టికల్‌ 370, 35ఎ రూపంలో వారికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇచ్చారు. ఆ రక్షణలను ఉపసంహరించుకోవటాన్ని ఆ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. కాశ్మీర్‌లో మాత్రమే కాక జమ్మూ ప్రాంతంలో కూడా ఈ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించటం, ప్రజాస్వామిక హక్కులను హరించటం, ఇంటర్‌నెట్‌, పత్రికల లాంటి సమాచార సాధనాలు సక్రమంగా పని చేయకుండా నిరోధించటం తదితరాల ద్వారా ప్రజల అసంతృప్తి బద్దలవకుండా ప్రభుత్వం తాత్కాలికంగా అణచివేసింది. రాజకీయ పార్టీలను కనీసమైన కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి కూడా అనుమతించలేదు. రాజకీయ పార్టీల నాయకులను గృహ నిర్బంధంలో ఉంచింది. ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ వేర్పాటువాదులకు సానుభూతిగా ఉంటున్నారని అనుమానించిన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. పైగా దేశ ప్రజలకు, ప్రపంచానికి అంతా బాగానే ఉన్నట్లు చూపటానికి ప్రయత్నం చేసింది.

చరిత్రను తుడిచివేయటానికి ప్రయత్నాలు
దేశంలో ముస్లీంలు, మొఘలుల చరిత్రను తుడిచిపెట్టటానికి ప్రయత్నం చేస్తున్నట్లే జమ్మూకాశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, షేక్‌ అబ్దుల్లాల కృషిని తుడిచిపెట్టటం కోసం సంబంధిత చారిత్రక అంశాలను, పేర్లను మార్చటానికి బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. షేక్‌ అబ్దుల్లా పేరుతో ఉన్న నిర్మాణాల పేర్లను మార్చటానికి ప్రయత్నం చేయటం అటువంటి వాటిలో ముఖ్యమైనది.

గ్రామాలు, మునిసిపల్‌ వార్డులలో ఉన్న పాఠశాలలకు సైన్యం, సిఆర్‌పిఎఫ్‌లో ఉండి ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లు పెట్టాలని జులై 29వ తేదీన జమ్మూ డివిజనల్‌ కమిషనర్‌ జారీ చేసిన ఆదేశం సైన్యం చేతుల్లో అనేక విధాలుగా బాధలు అనుభవిస్తున్న ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకతను పెంచింది. తమను అవమానాల పాలు చేయటంలో ఇది మరొక అంశంగా ప్రజలు భావిస్తున్నారు. రక్షణ దళాల మానవ హక్కుల ఉల్లంఘన, అత్యాచార ఆరోపణలు, నకిలీ ఎన్‌కౌంటర్లు, కొందరిని అదృశ్యం చేయటం, పసిమొగ్గలను సైతం హత్య చేయటం, పెల్లెట్‌ గన్స్‌ ఉపయోగించి బాలలతో సహా అనేకమందిని గుడ్డివారిగా చేయటం జరుగుతున్నది. గ్రామాలలో సైతం బంకర్లు, సైనిక క్యాంపులు, సెక్యూరిటీ చెకప్స్‌, ఐ.డి ప్రూఫ్‌లు...వంటివి లెక్కలేనన్ని ఉండటంతో జమ్మూకాశ్మీర్‌ బహిరంగ జైలుగా మారింది. నిరంతరం భయంతో బతకాల్సి వస్తున్నది. అందువలన తమను అవమానించటానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది మరొకటని స్థానికప్రజలు భావిస్తున్నారు.

వివక్షకు వ్యతిరేకంగా జమ్మూలో తీవ్రమౌతున్న అసంతృప్తి
జమ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంత అధికారులు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల పట్ల జమ్మూ లోని అన్ని తరగతుల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2019, ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూప్రాంతంపై వివక్ష తొలగి అభివృద్ధి జరుగుతుందని భావించిన వారు కూడా ఆశాభంగం చెందారు. చిన్న వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, న్యాయవాదులు, టూరిజం రంగానికి చెందినవారు...తదితరులందరూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 22వ తేదీన జమ్మూ బంద్‌ నిర్వహించారు. రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌ 100 స్టోర్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించటమే బంద్‌కు పురికొల్పిన తక్షణ కారణం.

కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే విద్యుత్‌, నీటి ఛార్జీలు కొన్ని రెట్లు పెరగటంతో స్థానిక ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. నిర్మాణానికి అవసరమైన ఇసుక, రాయి, సిమెంటు ధరలు పెరిగాయి. జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేశారు. నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది. ప్రజలలో వ్యతిరేకత రావటంతో 2020లో స్థిరాస్తులపై పన్నులను పెంచలేకపోయారు. మోడీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత గత రెండు సంవత్సరాలలో స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారులంతా నాశనం అయ్యారని, భారతదేశంలోని బడా వ్యాపారులు ఇక్కడి ప్రతి వాణిజ్య రంగాన్ని చేజిక్కించుకొంటున్నారని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిలయన్స్‌ స్టోర్స్‌ ఏర్పాటు చేస్తే 50 వేల మంది నిరుద్యోగులుగా మారతారని చెబుతున్నారు. నూతన పారిశ్రామిక విధానం కింద కేంద్రపాలిత ప్రాంత అధికారులు తమ డిపార్ట్‌మెంట్ల అవసరాల కోసం సేకరిస్తున్న సరుకులలో స్థానికంగా ఉన్న చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వటంలో విఫలమైనారని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారక ముందు, 2016 పారిశ్రామిక విధానం ప్రకారం కొనుగోలు ధరల ప్రాధాన్యత ప్రాతిపదికన సూక్ష్మ, చిన్న పరిశ్రమలు రక్షణ పొందేవని పారిశ్రామికవేత్తలు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దుతో అన్ని అంశాలూ హఠాత్తుగా మారిపోయాయని చెప్పారు. ప్రభుత్వం తమకు కొంతకాలం మద్దతు ఇవ్వాలని, లేకపోతే జమ్మూ ప్రాంతం లోని అననుకూల పరిస్థితులు, ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉండటంతో తాము ఇతరులతో పోటీలో నిలబడలేమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జమ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారగానే జమ్మూలో ఉన్న జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌, రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరి కమిషన్‌ తదితరాలను రద్దుచేశారు. వాటన్నింటినీ పునరుద్ధరించాలని జమ్మూలోని ప్రజలు కోరుతున్నారు. స్థిరాస్తిని రిజిస్టర్‌ చేసే అధికారాన్ని న్యాయవాదుల నుండి రెవిన్యూ అధికారులకు బదిలీ చేయటాన్ని న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఈ అధికారాన్ని తిరిగి న్యాయవాదులకే ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మోటారు వాహనాల రిజిస్ట్రేషన్‌పై పన్ను పెంచటంతో కొత్తగా వాహనాలు కొనుక్కొంటున్న వారు, పాత వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నవారు ఎక్కువ పన్నులను చెల్లించాల్సి వస్తున్నది. ట్రాక్టర్‌ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, వ్యవసాయ ఉపకరణాల ధరలు పెరగటం రైతులకు భారంగా పరిణమించింది.

ఈ విధంగా జమ్మూకాశ్మీర్‌ లోని అన్ని ప్రాంతాల ప్రజల పరిస్థితులు దిగజారడంతో వారిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ అసంతృప్తిని తీవ్రవాదులు వినియోగించుకొంటున్నారు. జమ్మూకాశ్మీర్‌ లోని రాజకీయ పార్టీలు, వివిధ తరగతుల ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవటం, ఆర్టికల్‌ 370, 35 ఎ లను పునరుద్ధరించటం ద్వారానే జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదాన్ని అరికట్టటం, జాతీయ సమైక్యతను కాపాడుకోవటం సాధ్యమౌతుంది.
ఎ. కోటిరెడ్డి