Nov 22,2020 21:07

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని వింద్యాచల్‌ రీజియన్‌లో 23 గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. 'జల్‌ జీవన్‌' పథకంలో భాగంగా మీర్జాపూర్‌, సోన్‌భద్ర జిల్లాల్లో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేసిన అనంతరం మోడీ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా నేటికి వింద్యాచల్‌ రీజియన్‌లో అభివృద్ధి లేకపోవడం విచారకరమన్నారు. సరిపడా వనరులు ఉన్నా ఈ ప్రాంతం ఇంకా కరువు, కొరతతో అల్లాడుతూనే ఉందన్నారు. అందువల్ల అనేకమంది ప్రజలు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వలస పోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విలేజ్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ కమిటీ సభ్యులతో సంభాషించారు. ఈ తాగునీటి సరఫరా ప్రాజెక్టుల ద్వారా రెండు జిల్లాల్లోని 2,995 గ్రామాల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. 'జల్‌ జీవన్‌' పథకంలో భాగంగా రూ.5,555.38 కోట్ల అంచనాతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టులను 24 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యుపి సిఎం యోగి ఆదిత్యనాధ్‌ తదితరులు పాల్గన్నారు.