Sep 18,2021 18:23

మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నకుమార్‌

ప్రజాశక్తి - గుంటూరు : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మౌలానా జునైద్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 59 చోట్ల న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నకుమార్‌ తెలిపారు. శుక్రవారం వెనిగండ్ల పంచాయతీ కార్యాలయంలో, గుంటూరు నల్లచెరువు 14వ లైన్‌లో, రైలుపేట గొలుసు నాంచారమ్మ అండ్‌ కొండలరావు మున్సిపల్‌ బాలికల హైస్కూల్లో, తాడికొండ బాలికల హైస్కూల్లో, జిల్లా కారాగారంలో వర్చ్యువల్‌ పద్ధతిలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ చట్టం, 1987 లోని సెక్షన్‌ 12 ద్వారా ఎవరెవరు ఉచిత న్యాయ సహాయానికి అర్హులో, అనర్హులో వివరించారు. షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలకు చెందిన వారు, మహిళలు, చిన్నపిల్లలు, మానవ అక్రమ రవాణా బాధితులు, పారిశ్రామిక కార్మికులు, బుద్ధిమాంద్యం గలవాళ్ళు, చెవిటి, మూగ, అంధులు, ప్రకృతి వైపరీత్య బాధితులు, సంవత్సర ఆదాయం రూ.3లక్షల్లోపు ఉంటుందో అలాంటివారు ఉచిత న్యాయ సహాయానికి అర్హులని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ గుంటూరుకు రాతపూర్వకంగా గాని మెయిల్‌ ద్వారా గాని అర్జీ చేసుకున్నట్లైతే ఉచిత న్యాయసాయమందిస్తామని చెప్పారు. ఆర్థిక నేరాల్లో ముద్దాయిలు, కోర్టు ధిక్కార కేసుల్లో, తప్పుడు కేసుల్లో, ఫోర్జరీ కేసుల్లో ముద్దాయిలు, ప్రొటెక్షన్‌ అఫ్‌ సివిల్‌ రైట్స్‌, ఇమ్మొరల్‌ ట్రాఫికింగ్‌ ప్రివెన్షస్‌ ఆక్ట్‌లో ముద్దాయిలు, పరువు నష్టం కేసుల్లో ఫిర్యాదిదారుడు, ముద్దాయిలు ఉచిత న్యాయ సహయానికి అనర్హులని వివరించారు.