
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : జిల్లాలోని పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, అధికారులు ఆదివారం ప్రారంభించారు. మంగళగిరి కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, చైర్మన్ డి.శివపార్వతి, డిసిఎంఎస్ చైర్మన్ హెనీక్రిస్టినా ప్రారంభించారు. తుపానుతో దెబ్బతిన్న ధాన్యాన్ని ఇక్కడ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. చిలకలూరిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కేంద్రాన్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.డేవిడ్రాజు ప్రారంభించారు. ధాన్యంలో మట్టి, రాళ్లు, ఇసుక మొదలగునవి ఒక శాతానికి లోబడి ఉంటేనే అనుమతిస్తారని చెప్పారు. తహశీల్దార్ జి.సుజాత, ఎఒ టి.శ్రీలత పాల్గొన్నారు. ఈపూరు పిఎసిఎస్ కార్యాలయంలో కేంద్రాన్ని తహశీల్దార్ వి.కోటేశ్వరరావు ప్రారంభించారు. పంటను అమ్మాలనుకున్న రైతులు ముందుగానే పేర్లు నమోదు చేసుకుని అనంతరం కిలో ధాన్యాన్ని తెచ్చి తేమ శాతాన్ని పరీక్షించుకోవాలని చెప్పారు. తేమశాతం 17 మించకుండా చూసుకోవాలని పిఎసిఎస్ అధ్యక్షులు బి.వెంకట రాధాకృష్ణ చెప్పారు. క్వింటా 'ఎ' గ్రేడు ధాన్యానికి రూ.1880, కామన్ రకానికి రూ.1868గా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మాచర్ల్ల మార్కెట్ యార్డు ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైసిపి యువజన విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. 75 కిలోల సాధారణ రకం రూ1,406, గ్రేడ్ 'ఎ' రకం రూ.1,416 ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పారు. యార్డు చైర్మన్ గురుబ్రహ్మం, తహశీల్ధార్ చినవెంకయ్య, కమిషనర్ గిరికుమార్, ఎంపిడిఒ సురేష్ విజరుకుమార్ పాల్గొన్నారు. సత్తెనపల్లి మార్కెట్ యార్డులో కేంద్రాన్ని చైర్మన్ రాయపాటి పురుషోత్తం ప్రారంభించారు. బాపట్ల మండలంలోని పడమర బాపట్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో చైర్మన్ గవిని కృష్ణమూర్తి ప్రారంభించారు. మాచర్ల మండలం తాళ్లపల్లిలో కేంద్రాన్ని తమశీల్దార్ చినవెంకయ్య, మాజీ జెడ్పిటిసి గోపిరెడ్డి ప్రారంభించారు. నాదెండ్ల మండలంలోని సాతులూరులో కేంద్రాన్ని తహశీల్దార్ కె.సాంబశివరావు ప్రారంభించారు.రేపల్లె మార్కెట్ యార్డులో కేంద్రాన్ని యార్డు చైర్మన్ గడ్డం కోటేశ్వరమ్మ ప్రారంభించారు.