Nov 22,2020 21:28

మాట్లాడుతున్న సీనియర్‌ క్రికెటర్‌ బాలమురళీకృష్ణ

ప్రజాశక్తి - శ్రీకాకుళం సిటీ: జిల్లాకు మంజూరైన క్రికెట్‌ స్టేడియాన్ని జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని జిల్లా సీనియర్‌ క్రికెటర్లు డిమాండ్‌ చేశారు. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలమురళీకష్ణ మాట్లాడారు. ఆమదాలవలస మండలం జోగిశాస్త్రులుపేటలో క్రికెట్‌ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం వల్ల క్రీడాకారులు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. ఆమదాలవలసకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగిశాస్త్రులపేటలో భూమిని రాష్ట్ర ప్రభుత్వం 30 ఏళ్ల లీజుకు కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేశారు. కొందరు ప్రజాప్రతినిధుల స్వార్థపూరిత రాజకీయాల వల్లే క్రికెట్‌ స్టేడియం ఆమదాలవలసకు తరలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా బాల బాలికల క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుల పనితీరుపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు. జిల్లాకు మూడు మైదానాలు మంజూరైనట్లు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో తిరుపతి, కడప, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే మూడు స్టేడియాలను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. ఎస్‌.జోగినాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మించడం వల్ల భవిష్యత్‌లో రాష్ట్రస్థాయి, రంజీ పోటీలు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శిష్టు రమేష్‌, రఫీ, ఇందిరా ప్రసాద్‌, షైలానీ, ప్రవీణ్‌, మధు, ప్రసాద్‌, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.