Nov 29,2020 23:42

డాక్టర్‌ ఎన్‌.ప్రభావతి, సూపరింటెండెంట్‌, గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌).

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభావతి తెలిపారు. ఆస్పత్రిలో గతంకంటే ఇప్పుడు ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని, కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించి వారిని క్షేమంగా ఇంటికి పంపించడంలో వైద్యులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారని చెప్పారు. ప్రజాశక్తి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు.
జిజిహెచ్‌లో పెరిగిన సౌకర్యాలు?
ఆక్సిజెన్‌ సిలిండర్‌, పైప్‌లైన్‌ సామర్థ్యం 20కేయల్‌కు పెంచారు. దీనివల్ల గతంలో ఐసియు వార్డుల్లో కేవలం 45 పడకల సామర్థ్యం నుంచి 100 పడకలకు పెంచారు. ఒకేసారి 100 మందికి ఆక్సిజెన్‌ అందించే అవకాశం ఉంది. ఇందువల్ల కరోనా పేషంట్లు త్వరగా కోలుకుంటున్నారు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సదుపాయం పూర్తిగా వినియోగిస్తున్నారు. సి.టి.స్కాన్‌ మిషన్‌తో కరోనా బాధితులకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. నూతనంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్‌ ఆస్పత్రిలో రేడియేషన్‌ చికిత్స జరుగుతోంది. క్యాన్సర్‌ నిర్థారణ, చికిత్స కోసం రూ.30 కోట్లతో సమకూర్చిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
కరోనా బాధితులకు అందిస్తున్న సదుపాయాలు?
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని విధాలా చికిత్సలతోపాటు ఉచిత భోజనం అందిస్తున్నాం.
రోగులతో పాటు వారి సహాయకులకూ తగిన భోజనం, వసతి కల్పిస్తున్నారా?
ఇందుకోసం రెండు భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. రోగుల సహాయకులకి భోజనం పెట్టేందుకు జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించి భవన నిర్మాణం పురోగతిలో ఉంది. రోగుల సహాయకుల వసతి కోసం గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ ఎంపి లాడ్స్‌ నిధుల నుంచి కేటాయించారు. భవన నిర్మాణం జరుగుతోంది.
జిజిహెచ్‌కు ఎన్ని జిల్లాల నుండి రోగుల తాకిడి ఎక్కువగా ఉంది?
కోస్తా జిల్లాల నుండి ఎక్కువగా వస్తుంటారు. గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన రోడ్డు ప్రమాద కేసులు ఎక్కువగా వస్తాయి. మిగతా కేసులు కూడా ఎక్కువగా ఆయా జిల్లాల నుంచి గుంటూరుకు రిఫర్‌ చేస్తుంటారు. ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుందని అందరికీ నమ్మకం కలిగింది. ఈ నమ్మకానికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు.
ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఇంకా ఏ ప్రతిపాదనలు పంపారు?
ప్రస్తుతం ఒక్కటే సి.టి. స్కాన్‌ మిషన్‌ ఉంది. దీనిపై వత్తిడి అధికంగా ఉంది. అందువల్ల మరో మిషన్‌ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను కోరాం.
కామెర్లు వ్యాధికి ఎలాంటి చికిత్సలు చేస్తున్నారు?
కేంద్ర ప్రభుత్వం ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్‌.హెచ్‌.వి.సి.బి ద్వారా కామెర్లు లక్షణాలు కనిపించినప్పటి నుంచి పూర్తిగా నయం అయ్యే వరకు ఉచితంగా మందులు ఇస్తున్నాము. కామెర్ల వ్యాధి వల్ల లివర్‌, ఇతర అవయవాలు పాడవ్వకుండ తగిన చర్యలు తీసుకుంటున్నాం.
మీ ప్రాధాన్యాలు ఏమిటి?
వివిధ జిల్లాల నుంచి వస్తున్న అత్యవసర రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రొఫెసర్‌లు, వైద్యులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ రోగులను సురక్షితంగా ఇంటికి పంపాలన్నదే నా ముందున్న తొలి ప్రాధాన్యం.