Apr 12,2021 19:36

దక్షిణ భారత దేశంలో కర్నాటకతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఉగాది' పండుగను సంవత్సరాదిగా జరుపుకుంటారు. తెలుగు నెలల్లో మొదటిదైన చైత్రమాస మొదటి తిథి పాడ్యమితో ప్రారంభమయ్యే ఈ పండుగ నాడు చిన్నాపెద్దా అంతా ఓ ఉత్సవంలా గడుపుతారు. పచ్చని మామిడి తోరణాలు, పూల అలంకరణలతో ప్రతి లోగిలి శోభాయమానంగా ఉంటుంది. సంవత్సరమంతా షడ్రుచుల సమ్మేళనంగా జీవితం గడవాలని కోరుకుంటూ తీపి, పులుపు, వగరు, కారం, ఉప్పు, చేదుల కలయికతో ఈ రోజున తయారుచేసే 'ఉగాది పచ్చడి'కి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఆ కలయికను ఎంతోమంది రుచులతోనే సరిపెట్టేస్తే కొంతమంది ఔత్సాహికులు మాత్రం జాతులు, మతముల సమ్మేళనంగా భావిస్తారు. అయితే రానురాను 'ఉగాది' ప్రాశస్థ్యం మరుగునపడిపోయి 'పంచాగ శ్రవణం' విననిదే 'ఉగాది' పండుగ లేదు అనే ధోరణి బలంగా నాటుకుపోయేలా చేశారు కొందరు.
వివేక అజ్ఞానం
సంవత్సరమంతా తమకు ఏం జరుగుతుంది? రాబోయే రోజులు ఎలా గడుస్తాయి? అనుకున్న పనులు అవుతాయా? లేదా? అన్న సందేహాలతో 'పంచాంగ శ్రవణాన్ని' శ్రద్ధగా ఆలకిస్తారు చాలామంది. గతం నేర్పిన అనుభవాలతో వర్తమాన ప్రయాణం చేస్తూ.. ముందు తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం అవిశ్రాంత కృషి చేయాలి. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అలాకాక 'పంచాంగ శ్రవణం వింటే అంతా మంచే జరుగుతుంది. అదో గొప్ప పుణ్యకార్యం' అంటూ ఊదరకొట్టడం ఎంత అవివేకం? ఆశావాద ప్రయత్నం ఏమీ చేయకుండానే కేవలం తినికూర్చొంటే రోజులు మారిపోతాయా? ఆమాత్రం ఇంగితం లేనివాళ్లు చెప్పే కల్లబొల్లి కబుర్ల కోసం అర్రులు చాచే జ్ఞాన సముపార్జన మెండుగా గల అవివేకులు ఎంతోమంది ఈ రోజు మనకు తారసపడతారు.
జ్ఞానంతో మెలగాలి..
దేశంలో పరిస్థితులు మునుపటి కంటే దారుణంగా తయారయ్యాయి. కరోనా సాకు చెప్పి, చడీచప్పుడు కాకుండా పాలకులు ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నారు. దేశప్రజలు ఏమైపోతే నాకేంటి? నా ధర్మం కార్పొరేట్ల ఊడిగం అన్న చందంగా తయారైంది కేంద్రం నిర్వాకం. చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ వయసుతో సంబంధం లేకుండా నెలలతరబడి రోడ్డున పడిన రైతుల ఊసు పట్టించుకోవడం లేదు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 'విశాఖ ఉక్కు'ను కార్పొరేట్‌ ఇనుప పంజాకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. చేసిన వాగ్దానాలు నీటి మీద రాతలయ్యాయి. చెప్పిన ఊసులు గోడకు కొట్టిన సున్నంలా పడి ఉన్నాయి. ప్రశ్నించే గొంతులను బూటు కాళ్లతో తొక్కిపెడుతున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా నోరుమెదపని వివేక అజ్ఞానవంతులు కిమ్మనకుండా కూర్చొండిపోయారు. ఈ ధోరణికి స్వస్తి పలికే సమయం వచ్చింది. 'ఉగాది' సందర్భంగా మౌనం వీడే తరుణం ఇది. ఈ పర్వదినాన దేశ ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చి జ్ఞానంతో వర్థిల్లాలి.
          దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కూడా 'గుడి పడ్వా' పేరుతో ఈ రోజు సంవత్సరాది పండుగ జరుపుకుంటున్నారు. అయితే మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో పండుగ వాతావరణం కనిపించడం లేదు. వాతావరణ ప్రతికూలతల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. రబీ పంట పూర్తిగా నష్టపోయింది. లాక్‌డౌన్‌ వల్ల పత్తి ఉత్పత్తులు మార్కెట్‌ కాకుండా బహిరంగ వేలం ప్రదేశాల్లో నిలిచిపోయాయి. 'మా దగ్గర డబ్బు లేదు. పంట పోయింది. ఈ పరిస్థితుల్లో పండుగ ఎలా జరుపుకుంటాం' అంటూ వాపోతున్నారు గ్రామీణులు. ఒక్క మహారాష్ట్రలోనే కాదు, దేశం యావత్తు ఇదే పరిస్థితి.
                                             ఆరోగ్యమస్తు
'ఉగాది' ఎప్పుడూ వేసవి ఆరంభంలో వస్తుంది. ఎండలు మండే వేళ ఎటువంటి ఆరోగ్యసూత్రాలు పాటించాలో చెప్పకనే చెబుతుంది. చర్మ సంరక్షణతో పాటు శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో మొదలుపెట్టమని హెచ్చరిస్తుంది. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా తీసుకోవాల్సిన పానీయాల ఆవశ్యకత తెలియజేస్తుంది. ప్రాంతాలు వేరైనా ఆ రోజు ప్రతిఒక్కరూ చేసుకునే రకరకాల పిండివంటల్లో పై ఆరోగ్యసూత్రాలు తప్పకుండా ఉంటాయి.

ugadi 3