Nov 30,2020 21:29

ఫొటో : తహశీల్దారు కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న సిఐటియు నాయకులు

ఫొటో : తహశీల్దారు కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న సిఐటియు నాయకులు
జీతాలు అడిగితే ఉద్యోగం హుష్‌..
- పారిశుధ్య కార్మికులకు పంచాయతీ కార్యదర్శి బెదిరింపులు
- ఖండించిన సిఐటియు
ప్రజాశక్తి-ఉదయగిరి : పారిశుధ్య కార్మికులు 8 నెలల వేతన బకాయిలను అడిగితే పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడం సరికాదని సిఐటియు గౌరవ అధ్యక్షులు కాకు.వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణంలో కార్మికుల 8 నెలల వేతనాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన పారిశుధ్య కార్మికులు వేతనాలు అడిగితే వారిని బెదిరించడం సరికాదని ఆయన మండిపడ్డారు. డిసెంబర్‌ 21న సమ్మె చేపడతామని ముందుగా తెలియపరిచిన వేతనాలు చెల్లిస్తామని నమ్మబలికి పత్రికలలో వేతనాలు చెల్లించాలని ప్రకటనలు చేసి ఇంతవరకు చెల్లించకపోవడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. వేతనాలు అడిగితే ఇప్పుడు అడిగే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడం కార్యదర్శికి సిగ్గుచేటని ఆయన అన్నారు.
నెల జీతం ప్రభుత్వ ఉద్యోగులకు రాకపోతే అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అలాంటిది పారిశుధ్య కార్మికులు గత ఎనిమిది నెలలుగా వేతనాలు లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. అలాంటి వారికి వేతనాలు ఇచ్చి ఆదుకోవడం చేయక వారిని బెదిరింపులకు గురి చేయడం సరికాదని ఆయన దుయ్యబట్టారు. పారిశుధ్య కార్మికులపై నిరంకుశ ధోరణి వీధి వెంటనే వారికి రావలసిన వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు గడ్డం నాగేశ్వరరావు, గ్రామ పంచాయతీ మండల అధ్యక్షులు గడ్డం అలేఖ్య, రమణయ్య, రామయ్య, వెంకటయ్య, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.