Dec 04,2021 03:09

ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి, గ్రేటర్‌ విశాఖ బ్యూరో
జవాద్‌ తుపాన్‌ జిల్లా, నగర వాసులను జడిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపాన్‌గా బలపడి నేపథ్యంలో జిల్లా వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తుపాను విశాఖ దగ్గరకొచ్చే కొద్దీ గాలులు గంటకి 80 నుంచి 90 ఇంకా తీవ్రత పెరిగితే 90 నుంచి 100 కి.మీ వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జవాద్‌ తుపాను శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర జిల్లాలు, దక్షిణ ఒడిశా దగ్గరగా వస్తున్నందున అత్యంత భారీ వర్షాలకు ఈ ప్రాంతాల్లో అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు జివిఎంసి పరిధిలో 47, గ్రామీణ 20 మండలాల్లో 42 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 50వేల మందికి సరిపడా పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. తుపాను అప్రమత్తతపై జిల్లా ప్రత్యేకాధికారి జె.శ్యామలరావు, కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, నగర పోలీస్‌ కమిషనర్‌ మనీస్‌కుమార్‌ సిన్హా, జాయింట్‌ కలెక్టర్లు వేణుగోపాల్‌రెడ్డి, అరుణ్‌బాబు, జివిఎంసి కమిషనర్‌ లక్ష్మిశాతో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
తీవ్రమైన గాలులు వీయనున్న పరిస్థితుల్లో అత్యంత అవసరమైతే గాని ఎవరూ బయటకు రావద్దని నగర మేయర్‌ హరివెంటకుమారి, జివిఎంసి కమిషనర్‌ లకీëశా నగర ప్రజలకు సూచించారు. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగులు గాలులకు విరిగే ప్రమాదం ఉన్నందున వాటి కింద ఉండొద్దని కోరారు. లోతట్టు, కొండవాలు ప్రాంతాలు వారు అవసరమైతే పునరావాస కేంద్రానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
జిల్లాలోని ఏడు రిజర్వాయర్లలో వరదనీటిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిస్థితిని బట్టి నీరు విడిచిపెట్టేలా సాగునీటిపారుదలశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రాణ నష్టం జరగకుండా మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఒక ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. నేవీ, మెరైన్‌ పోలీసు, కోస్టుగార్డు బృందాలు, రెండు హెలికాప్టర్లతో పాటు నేవీ హెలికాప్టర్లు సిద్ధం చేశారు. రహదారుల్లో కూలిన చెట్లను తొలగించేందుకు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జెసిబిలు, పవర్‌సాస్‌, కట్టర్లు, లైఫ్‌ జాకెట్లు, బోట్లు, 300 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా వుంచారు. సమాచార లోపం లేకుండా మొబైల్‌ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన టవర్లు, నెట్‌వర్క్‌లు, మొబైల్‌ డిజి సెట్‌ను అందుబాటులో వుంచారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు 148 క్రేన్లు, 24 జెసిబిలు, 50 పవర్‌సాస్‌, 1048 మందిని సిద్ధంగావుంచారు. సచివాలయ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో వుండేలా ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 140 బోట్లలో వంద పారాదీప్‌లో, 40 గంజామ్‌లో వున్నాయి.
డివిజన్‌, మండల స్థాయి కార్యాలయాల్లో తుపాను కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులు రద్ద చేశారు. మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ మల్లికార్జున వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అందించాల్సిన సేవలను వివరించారు. పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం, తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ అధికారులు మండలాల్లోవుండి అధికారులకు సూచనలు చేయనున్నారు. తుపానుతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుమారు 7,500 ఎకరాల్లో కోసిన వరి పంట పొలాల్లో వుంది. కొంతమంది రైతులు పొలాల నుంచి చేలు కళ్లాలకు తీసుకురాగా, కొంతమంది నూర్పులు చేశారు. పంట చేతికొచ్చిన సమయంలో ఈదురుగాలులు, భారీ వర్షాలు పడితే పంట మొత్తం నేలమట్టమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.