Apr 14,2021 18:25

పాట్నా : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోవిడ్‌తో బాధపడుతున్న తమ తండ్రులు కళ్లెదుటే మరణించడంతో వారి పిల్లల ఆర్తనాదాలు మిన్నంటాయి. బీహార్‌, జార్ఖండ్‌ రెండు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం యాదృచ్ఛికం. కానీ, బాధితుల బాధ వర్ణనాతీతం. వైద్యుల నిర్లక్ష్యమే తమ తండ్రుల మృతికి కారణమంటూ కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం..

Former Soldier Dies Of Covid As Bihar Hospital Preps For Minister's Visit
కోవిడ్‌తో బాధపడుతున్న రిటైర్డ్‌ జవాను వినోద్‌ సింగ్‌ను కుటుంబ సభ్యులు బీహార్‌లోని నలంద మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అదే సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్‌ పాండే వస్తున్నారన్న సమాచారంతో వైద్యులు అతడిని పట్టించుకోలేదు. డాక్టర్లను పిలిచినప్పటికీ పట్టించుకోకపోవడంతో ...వినోద్‌ సింగ్‌ చనిపోయారు. తన తండ్రి పట్ల వైద్యులు చూపించిన నిర్లక్ష్యం వహించారంటూ కుమారుడు అభిమన్యు సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 'మా నాన్న కరోనా వచ్చింది. ఆసుపత్రికి తీసుకు వెళ్తే తిరస్కరించారు. దీంతో నలంద ఆసుపత్రికి తరలిచాం. ఆసుపత్రిలో చేర్చేందుకు అనుమతించినప్పటికీ..గంటన్నర పాటు ఆసుపత్రి బయటే ఉంచేశారు.. ఎలాంటి ట్రీట్‌మెంట్‌ చేయలేదు' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
వినోద్‌ సింగ్‌ ఇటీవల కరోనా బారిన పడగా..ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. తొలుత సోమవారం సాయంత్రం పాట్నాలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా...బెడ్స్‌ ఖాళీలు లేవని..చేర్చుకునేందుకు నిరాకరించారు. మరో నర్సింగ్‌ హోంకు తీసుకెళ్లగా..కొన్ని గంటల పాటు ఆసుపత్రిలో చేర్చుకన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు నలంద మెడికల్‌ కళాశాలకు తీసుకెళ్లగా...ఆరోగ్య శాఖ మంత్రి వస్తున్నారన్న హడావుడిలో వైద్యులు మునిగిపోయారని, తన తండ్రిని పట్టించుకోలేదని, ఫలితంగా ఆయన మరణించారని కుమారుడు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి స్పందిస్తూ...ప్రతి ఒక్కరికీ వైద్యమందించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. వినోద్‌ సింగ్‌ మరణంపై చింతించిన ఆయన...గత కొన్ని రోజులుగా ఆసుప్రతులకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోందని, అయినప్పటికీ మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

Former Soldier Dies Of Covid As Bihar Hospital Preps For Minister's Visit
జార్ఖండ్‌లో కూడా ఇదే తరహాలో ఘటన జరిగింది. కోవిడ్‌తో బాధపడుతున్న తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లగా...అక్కడే ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి బన్నేస్‌ గుప్తా సేవలో వైద్యులు మునిగితేలుతున్నారని ఓ కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది. అరిచినా కూడా వైద్యులు రాలేదంటూ ...వైద్యం సకాలంలో అందక తన తండ్రి చనిపోయాడంటూ కన్నీటి పర్యంతమైంది.