Jul 30,2021 07:07

బీజింగ్‌: ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాద జాబితాలో ఉన్న తూర్పు తర్కిస్థాన్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ( ఇటిఐఎం) తో సంబంధాలు తెంచుకోవాలని, ఉగ్రవాదం అణచివేతకు కఠిన చర్యలు తీసుకోవాలని బుధవారం తుంజియాన్‌ను సందర్శించిన తాలిబాన్ల ప్రతినిధి బృందానికి చైనా స్పష్టంగా తేల్చి చెప్పింది. చైనా విశ్వాసం చూరగొనాలంటే ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ తేల్చి చెప్పారు. చైనాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూ భాగాన్ని ఉపయోగించుకోవడానికి ఎన్నడూ అనుమతించ బోమని తాలిబాన్ల ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది. ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి, తాలిబాన్లకు మధ్య శాంతి చర్చల్లో దీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిష్టంబ óనను తొలగించడంలో చైనా మధ్యవర్తిత్వాన్ని ఇరుపక్షాలు కోరుతున్నాయి.
సమర్థవంతమైన మధ్యవర్తిగా చైనా పాత్ర పెరుగుతున్నదనడానికి ఇదొక సంకేతమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాలిబాన్ల బృందం ఈ నెల 8న మాస్కోను సందర్శించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ముఖ్యమైన మిలిటరీ, రాజకీయ శక్తిగా ఉన్న తాలిబాన్లు, శాంతి చర్చల ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించనున్నారు. మత విధానాల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. అమెరికా సేనల ఉపసంహరణ తరువాత ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి తిరిగి వచ్చిన తాలిబాన్లు తమ మొదటి పర్యటనను రష్యా, చైనాలను ఎంచుకోవడం గమనార్హం.
బహిష్కృత దేశంగా ఆఫ్ఘనిస్తాన్‌ ? అమెరికా ఆందోళన
తాలిబాన్లు బలవంతంగా ఆఫ్ఘనిస్తాన్‌ను తన నియంత్రణలోకి తీసుకుంటే అది అంతర్జాతీయ బహిష్కృత దేశంగా మారిపోతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీ సందర్శించిన ఆయన జైశంకర్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజల హక్కులను గౌరవించని, తమ వారిపైనే అత్యాచారాలకు పాల్పడే దేశంగా ఆఫ్ఘనిస్తాన్‌ మారిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదయోగ్యం పొందాలంటే తాలిబాన్లు తమ వైఖరి మార్చుకోవాలని అన్నారు.
శాంతి స్థాపనకు భారత్‌ మద్దతు
ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి స్థాపనకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందని కేంద్రం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో శాశ్వత రాజకీయ పరిష్కారానికి నిర్వహించే అన్ని శాంతి ప్రక్రియలకు భారత్‌ సంపూర్ణ సహకారమందిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. సార్వభౌమ, ప్రజాస్వామ్య, శాంతియుత ఆఫ్ఘనిస్తాన్‌కు మద్దతు ఇవ్వడంలో భారత్‌కు సిర్థమైన విధానం ఉందని మంత్రి తెలిపారు.