
ముంబయి: ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ఇషాంత్ శర్మ దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ అని సీనియర్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. బుధవారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్ టూర్ ఒక సవాల్‌తో కూడుకున్నదని, ఆసియా ఖండ పిచ్‌లతో పోలిస్తే అక్కడి పిచ్‌లు భిన్నంగా ఉంటాయని, రెండు టెస్ట్‌లకు టాప్‌క్లాస్ ఆటగాళ్ళు దూరం టీమిండియాపై భారీ ప్రభావాన్ని చూపవచ్చన్నాడు. ఆసీస్ పిచ్‌లపై బౌన్సర్లు వేసే అనుభవజ్ఞుడైన పేసర్ భారత్‌కు అవసరమని, వన్డే, టి20లతో పోలిస్తే ఇక్కట టెస్ట్ మ్యాచ్‌లు భిన్నంగా జరుగుతాయన్నాడు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి అనంతరం భారతజట్టు ఆడుతున్న తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఇదేనని, ఈ క్రమంలో రోహిత్, ఇషాంత్ టెస్ట్ సిరీస్‌కు తొలినుంచే అందుబాటులో ఉండాలని ఇర్ఫాన్ అన్నాడు. రోహిత్, ఇషాంత్‌లకు క్వారంటైన్ నిబంధనలను సడలించాలని ఆసీస్ క్రికెట్ బోర్డుతో బిసిసిఐ సంప్రదింపులు చేస్తోంది.