Feb 11,2021 01:02

పెన్షనర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఇపిఎఫ్‌ 95 పెన్షనర్స్‌ సంఘం జిల్లా నాయకులు వివిఎస్‌ఎన్‌.వర్మ

ప్రజాశక్తి-ములగాడ
ఇపిఎఫ్‌ 95 పెన్షనర్లకు అనుకూలంగా ఈ నెల 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి వారికి న్యాయం చేయాలని ఇపిఎఫ్‌ 95 పెన్షనర్స్‌ సంఘం జిల్లా నాయకులు వివిఎస్‌ఎన్‌.వర్మ అన్నారు. బుధవారం మల్కాపురం సిఐటియు కార్యాలయంలో ఇపిఎఫ్‌ 95 పెన్షనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ పెన్షనర్లు అనేకమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల అనారోగ్యంతో చనిపోతున్నారని తెలిపారు. కనీస పెన్షన్‌ రూ.9వేలు డిమాండ్‌ చేస్తే, బిజెపి ప్రభుత్వం రూ.3వేలు ఇస్తానని చెప్పి నేటికీ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి జె.కోటేశ్వరరావు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ సరికాదని, ఆ కార్మికులు చేసే పోరాటానికి పెన్షనర్ల మద్దతు ఉంటుందని చెప్పారు. కె.నూకరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సి.హెచ్‌.తిమ్మారావు, ఎస్‌.సూర్యారావు పాల్గొన్నారు.