Nov 22,2020 11:39

      ఆ రోజు ..
      హైదరాబాదు, విష్ణుపురంలో ఉన్న కోవిడ్‌ సెంటర్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు డాక్టరు మురళీధర్‌. మరి కొంతమంది డాక్టర్లూ, నర్సులూ పరీక్షల కోసం వచ్చిన వారి దగ్గర నుంచి శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. అందరూ పీ.పీ.ఈ సూట్లు ధరించి, తగిన జాగ్రత్తలలో ఉన్నారు.
      రెండురోజుల కిందటి పరీక్షల తాలూకూ ..
      నెగటివ్‌ రిజల్ట్‌ వచ్చినవారికి నర్సులే ఇచ్చి పంపేస్తున్నారు. 'పాజిటివ్‌' రిపోర్ట్‌ వస్తే మాత్రం సెంటరు ఇన్‌ఛార్జ్‌ డాక్టరు దగ్గరకు పంపుతున్నారు.
      అలా వెళ్ళినవాడే సాంబశివ.
      తన పేరు చెప్పి పరిచయం చేసుకున్నాడు. వయసు ముప్పై ఏళ్ల లోపే. అతని కళ్లు లంకణాలు చేసినవాడిలా నీరసంగా ఉన్నాయి. ముఖానికి మాస్క్‌ వేసుకుని ఉండడంతో అతని భయం కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది.
      పేరును బట్టి అతని రిపోర్టు బయటకి తీసి మరొకసారి చదివాడు మురళి. సాంబశివ, అసిస్టెంటు ఇంజనీరు, పంజాగుట్ట.      ఇంకొకసారి అతని ముఖంలోకి పరిశీలనగా చూసి 'ఇంతకుముందు మిర్యాలగూడలో పనిచేసిన జూనియర్‌ ఇంజనీరు సాంబశివేనా?' అడిగాడు మురళి.
     ఆ మాటకి అతని కళ్ళలో విస్మయం. ఆ డాక్టరు ఎవరన్నదీ అతనికి తెలీకపోయినా.. అతనికి తను తెలుసన్న సంగతి సంతోషాన్నిచ్చింది.
    'అవునండీ! ఇంతకుముందు మిర్యాలగూడలో పనిచేశాను. హైదరాబాదుకి బదిలీ మీద వచ్చాను. ఆఫీసు పంజాగుట్టలోనే అయినా.. ఈ పక్క కాలనీలో ఉంటున్నాను' చెప్పాడు ఆత్రంగా.
     'నేనేనోరు! అప్పట్లో ఆ ఏరియా హాస్పిటల్లో పనిచేసిన మురళీధర్ని' పరిచయం చేసుకున్నాడు డాక్టర్‌.
     'ఓ మీరా సార్‌? అప్పుడపుడూ 'ఫీవరు' వస్తుంటే.. ఓసారి అనుమానం నివృత్తి చేసుకోవాలని వచ్చాను సార్‌! లక్కీగా మీరే ఉన్నారు' అని చెప్పాడు సాంబశివ.
     అతని కళ్ళలో ఉన్న ఇదివరకటి నిస్తేజం ఇప్పుడు లేదు. తనకు కావలసినవాళ్ళు ఉన్నారన్న నిశ్చింత.
     'నీ అనుమానం నిజమేనోరు! కరోనా 'పాజిటివ్‌' వచ్చింది.' అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు అన్న డాక్టర్‌ వైపు సాంబశివ దెబ్బతిన్న పక్షిలా చూశాడు.
     'ఇక్కడ క్వారంటైన్లో బెడ్స్‌కి ఇబ్బంది. సివియర్‌గా లేదుగా.. హోం క్వారంటైన్లో ఉండు. ఇంట్లో సెపరేటుగా గదిలో ఉంటూ మంచి బలవర్థకమైన ఆహారం తీసుకో. రెగ్యులర్‌గా మందులు వాడు.. త్వరగా నయమైపోతుంది. క్యారంటైన్‌ కిట్లు కూడా మేమే అందజేస్తాం. ఇల్లు ఎక్కడో చెబితే, మా టీంని పంపించి ముందుగా ఇళ్లు శానిటైజు చేయిస్తాం!' అని చెప్పాడు డాక్టర్‌.
ఆ మాటకి సాంబశివరావు డీలా పడ్డాడు.
     'ఇంట్లో ఎవరూ లేరు సార్‌! మొన్ననే పదిరోజుల క్రిందట మా ఆవిడను పుట్టింట్లో వదిలేసి వచ్చా' అన్నాడు సాంబమూర్తి.  అవునా! అయితే ఫోన్‌ చేసి రమ్మని చెప్పు అన్నాడు మురళి.
     'బస్సులు ఇదివరకటిలా తిరగడం లేదు. ఇలాంటి సమయంలో ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఆమె రావాలంటే కుదరదు. మీరు రిపోర్టులు ఇప్పిస్తే.. నేనే అక్కడకు వెళతా! అన్నాడు సాంబశివ.
      'ఇలాంటి సమయంలో ఆంధ్రాలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వెళ్లడం అంత మంచిది కాదనిపిస్తుంది' అన్నాడు మురళి. ఇక్కడ నాకేదైనా అయితే నన్ను చూసేవాళ్ళెవరూ లేరు. అక్కడైతే అత్తగారే కాదు.. మా వాళ్ళు కూడా దగ్గరలోనే ఉంటారు.'
      పై ఆఫీసర్లతో మాట్లాడి పేషెంటు వాళ్ల పరిధి దాటి వెళ్ళడానికి పర్మిషను తీసుకున్నాడు మురళి. మాస్కులూ, గ్లౌజులతో పాటు క్వారంటైన్‌ కిట్టు అందజేసింది నర్సు. మందులను ఎలా వాడాలో కూడా వివరించింది.
      చివరిగా 'ఇంతకుమించి మరే మందులూ ఉండవు సార్‌! మీకు వీలైతే పొద్దుటా, సాయంత్రం ఆవిరి పట్టండి. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే.. త్వరలోనే కోలుకుంటారు. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌!' అంటూ ధైర్యం చెప్పింది నర్సు.
       అన్ని సందేహాలూ తీర్చుకుని.. కష్టకాలంలో ఆదుకున్న డాక్టరు మురళీకి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాడు సాంబశివ.
                                                                   ***
        ఇంటికి చేరుకొని ..
        ముందుగా ఆఫీసరుగారికి ఫోన్‌ చేశాడు.
        'అయ్యో! అలాగా ఫర్వాలేదు. విషయం చెప్పావుగా లీవు లెటర్తో పని లేదులే.. తగ్గిన తరువాతే రా! జీతానికేం ఇబ్బందిలేదు. అలాగే వెళ్లి మీ ఊర్లోనే చూపించుకో!' అని చెప్పాడు.
         తరువాత కాల్‌ భార్యకి చేశాడు.
         భర్త నుంచి ఫోన్‌కాల్‌ అందుకున్న అవనిక 'అయ్యో! మరి ఎలా వస్తారు?' అడిగింది కంగారుగా. విషయం విన్న ఆమెకి కాళ్ళూ, చేతులూ ఆడటంలేదు.
         అదే ఫోన్‌ అందుకుని మామగారు 'కంగారుపడకండి బాబూ! జాగ్రత్తగా రండి. మేడ మీద ఉన్న గదిలో అచ్చంగా మీరే ఉందురుగానీ అని భరోసా ఇచ్చారు.
         'అదే .. తెలీడం లేదు మామయ్యా! రైళ్ళు నమ్మకం లేదు. ఇప్పటికిప్పుడు రిజర్వేషను దొరకదు. బస్సులు కూడా తక్కువగానే నడుస్తున్నాయి. మా ఫ్రెండు ఒకతన్ని కారు అడగాలనుకుంటున్నాను' చెప్పాడు సాంబశివరావు.
'సరే! ఎలా వచ్చినా జాగ్రత్తగా రండి!' చెప్పింది అవనిక.
         ఆ తరువాత కాల్‌ పరాంకుశానికి కారు కోసం చేశాడు.
         ఎన్నిసార్లు చేసినా 'అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా' అనే వచ్చింది. అలాంటి సమయంలో మెసేజ్‌ పెట్టినా ఉపయోగం ఉండదు.
         స్నానం చేసి వచ్చి, బ్యాగ్‌ సర్దేసుకుని మళ్లీ ఫోన్‌ చేశాడు.. అదే సమాధానం.
         రోజులో సగం అప్పటికే గడిచిపోయింది. ఇక ఆలశ్యం చెయ్యదలుచుకోలేదు.
         వెంటనే బైక్‌ తీశాడు.
         ఎన్నిసార్లు వెళ్లి రాలేదు. కాకపోతే, ఇప్పుడు కాస్త నీరసం అంతే.
         క్వారంటైను కిట్‌ తెరిచి, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్టు వేసుకున్నాడు. కాస్త సత్తువ వచ్చినట్లు అనిపించి, ఉత్సాహం తెచ్చుకున్నాడు.
          కాలనీ రోడ్ల మీద అలవోకగా.. వాయువేగంగా సాగిపోతుంది రాజదూత్‌.
                                                             ***
          హైదరాబాదు దాటి, పరుగులు పెడుతుంది బండి.
          గంటకు పదినిమిషాలు ఆగుతూ చాలా దూరం వచ్చేశాడు.
          సూర్యాపేట, కోదాడ దాటుతూ కీసర బ్రిడ్జ్‌ మీదుగా విజయవాడ చేరుకుంటే చాలా దూరం తరిగినట్లే.
          ఇప్పుడు విజయవాడ తగలకుండానే లూపు లైను వచ్చేయడంతో దూరం.. మరింత దగ్గర అయ్యింది.
          అక్కడ నుండి రెండు గంటల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు.
          అలాంటి ఆలోచనలో ఉండగానే .. వెనుక నుండి ఓ లారీ శరవేగంతో దూసుకొస్తుండడం సైడు అద్దంలో కనబడింది. ఒక్క నిముషం ఏమీ తోచలేదు.
          వెంటనే, అప్రమత్తమై రోడ్డు దిగిపోయాడు.
          పరిసరాలతో తనకేం సంబంధం లేనట్లు అదే పోకన పోయింది లారీ పెద్దగా శబ్దం చేస్తూ.
ఆగిపోయిన గుండె తిరిగి కొట్టుకున్నట్లైంది. 'తను గమనించుకోకపోతే, పరిస్థితి ఏమిటి? ఊహించుకోవడానికే భయమేసింది. లేచిన వేళ మంచిదైంది అనుకుంటూనే.. అంత మంచిదే అయితే, మెడికల్‌ రిపోర్టు ఇలా రావాలా? బతుకుని అల్లకల్లోలం చేసేలా?' అని కూడా అనుకున్నాడు.
         కాస్త ప్రాణం చిక్కబట్టిన తరువాత.. మళ్ళీ ప్రయాణం సాగింది.
         అప్పటికి సూర్యుడు పశ్చిమానికి దిగిపోతున్నాడు.
         గోధూళి వేళ.. కను చీకటి కమ్ముకుంది. హైవేల దగ్గర లైట్లు ఉన్నాయి. మిగిలిన చోటే, ఎదురొచ్చే వాహనాల వెలుగులు తప్ప.
         అయినా అదే వేగంతో దూసుకుపోతున్నాడు. తన బతుకు భయంలానే చీకటీ ముంచుకొస్తుంది.
         ఇప్పుడు సాంబశివకి ఉన్నది ఒకటే కోరిక.
         ఇంకా చెప్పాలంటే ఆశ. 'తను బతకాలి. మందులు వాడి, రోగాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలి. కుటుంబంతో హాయిగా ఉండాలి.          మనిషి సంకల్పం ముందు ఏదైనా బలాదూరే అంటారు. ఎంతోమందిలా తనూ 'నెగిటివ్‌' రిపోర్టుతో తిరిగి రావాలి.    అంతకంతకూ ఊపిరి పోసుకోవాలి!' అనుకుంటున్నాడు.
         ఆశ మనిషిని ముందుకు తీసుకు వెళుతుంది.
         అలాగే, వెళుతున్నాడు కూడా. చీకటిని చీల్చుకుంటూ వెలుతురు కోసం.
         విజయవాడ దాటి ఏలూరు రోడ్డు మీదకు వచ్చేశాడు.
         ఇక ఎంతో దూరం లేదు గమ్యం. ఎదురువరసలో ఉన్న కార్లు పరుగు పందేలు వేసుకున్నట్లు తనను దాటి వెళ్ళిపోతున్నాయి.
          ఇంతలో.. ఎదురుగా ఓ కారు కూడా అలానే.. వేగంగా దూసుకొస్తుంది. అలా దూసుకొచ్చి.. చూస్తుండగానే .. రోడ్డు మీద ఉన్న డివైడర్ను గుద్దేసింది. ఆ వేగం ధాటికి, అది అమాంతం ఎగిరి, రోడ్డు మీద రెండు పల్టీలు కొట్టింది. చివరి పల్టీలో ఎదురుగా దూసుకొస్తుంటే.. రెప్పపాటులో దాన్ని గమనించిన సాంబశివ పక్కనున్న పొదల్లోకి బండిని పోనిచ్చాడు.
          కారులో ఉన్న వాళ్ల మాటేమోగానీ.. సాంబశివ మాత్రం సేఫ్‌ అయ్యాడు.
          'కరోనా భయం వెంటాడినా.. ఏమైనా బతకాలన్న ఆలోచనే ఇప్పుడు తనను రక్షించింది!' అనుకున్నాడు.
          ఎలాగైతేనేం .. ఎక్కడతేనేం .. సాంబశివ కరోనా లెక్కల్లో చేరకుండా బయటపడ్డాడు.

పి.ఎల్‌.ఎన్‌. మంగారత్నం
9701426788