
వాషింగ్టన్ : తాను అధికారాన్ని చేపట్టడంలో వైట్‌హౌస్ ఇంతవరకు నిజాయితీగానే వ్యవహరిస్తోందని అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు. ''ఇప్పటివరకు యాచించలేదు. అలా జరుగుతుందని కూడా ఆశించడం లేదు.'' అని ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జనవరిలో ట్రంప్ నుండి తాను అధికారాన్ని చేపట్టినపుడు ఉన్నతాధికారులు ఎవరు వుండాలో, తన చాయిస్ ఏమిటో వంటి వివరాలు ఆయన ఆ ఇంటర్వ్యూలో వివరించారు. అధ్యక్ష ఎన్నికలు ముగిసిన మూడు వారాల తర్వాత సోమవారం నుండి అధికార బదలాయింపు క్రమాన్ని ప్రారంభించాలంటూ ట్రంప్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికి ఓటమిని అంగీకరించని ట్రంప్ ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. కాగా, కోర్టులో కీలక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాన్ని సవాలు చేయాలని చూసినా విజయవంతం కాలేదు. పెన్సిల్వేనియా, నెవడాల్లో బైడెన్ విజయాన్ని మంగళవారం, మిచిగన్‌లో సోమవారం అధికారులు ధృవీకరించారు. ఇప్పటివరకు తాను అధ్యక్షుడితో మాట్లాడలేదని బైడెన్ స్పష్టం చేశారు. అధికార బదలాయింపు క్రమం చాలా నెమ్మదిగా ప్రారంభమైనా, ప్రారంభమైంది, ఇంకా రెండు నెలలు వుంది. ఇక ఈ క్రమం వేగం పుంజుకుంటుందని ఆశిద్దాం అని ఆయన వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో కొవిడ్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌ను కలవాలని బైడెన్ భావిస్తున్నారు. వ్యాక్సిన్ పంపిణీ, ప్రజలకు అందుబాటులో వుండడం వంటి విషయాలపై వారితో చర్చించాలని చూస్తున్నారు. తాను వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తన పనితీరు మూడో ఒబామా పదవీకాలంలా వుండబోదని బైడెన్ స్పష్టం చేశారు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయని, పూర్తి భిన్నమైన ప్రపంచమని అన్నారు. ''తిరిగి అమెరికా ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించడానికి సిద్దమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.