Nov 09,2020 10:48

     ఐదో తరగతి చదివే శరత్‌ బడి నుండి రాగానే పుస్తకాల సంచి బల్ల మీద పెట్టి నీరసంగా పెరట్లోకి వెళ్ళబోయాడు.
వాడిని అలా చూసిన వాళ్ళమ్మ 'నానీ! ఏమైంది అలా వున్నావు?' అని అడిగింది.
'ఎలా వున్నాను?' అని ఎదురు ప్రశ్న వేస్తూ శరత్‌ పెరట్లో ఉన్న వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చాడు.
శరత్‌ను చూడగానే తాతయ్య కూడా 'నానీ ఏమైంది అలా వున్నావు?' అని అడిగాడు.
శరత్‌ చాలా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ 'ఎలా వున్నాను?' అంటూ తన ముఖంలోకి పరిశీలనగా చూస్తున్న తాతయ్యతో 'ఏం తాతయ్యా! ఎందుకలా చూస్తున్నావ్‌... నా ముఖంలో ఏమైనా కోతులాడుతున్నాయా?' అన్నాడు.
'అవును కోతులాడుతున్నాయి.. శరత్‌ నీవు అబద్ధం చెబుతున్నావు. ఏమైంది? బడిలో ఏదైనా గొడవ జరిగిందా?'
శరత్‌ మౌనంగా తల అడ్డంగా ఊపాడు.
'మరెందుకు నీ ముఖమలా వుంది?'
తన మనసులో జరుగుతున్న ఆలోచనలు వీళ్ళకు తన ముఖంలో ఎలా కనిపిస్తున్నాయని శరత్‌కు చాలా ఆశ్చర్యంగా ఉంది.
'మీ మాస్టారు ఎవరైనా కోప్పడ్డారా?.. కొట్టారా?''
శరత్‌ కాదని తల ఊపాడు.
'మరెందుకు నీ ముఖమలా వుంది? బడిలో ఏమో జరిగింది నిజం చెప్పు. ఎవరితోనైనా గొడవపడ్డావా?'
'తాతయ్యా! మనసులో ఏం వున్నా అది మొఖంలో కనబడుతుందా?'
'అంతా కనబడుతుంది.. నీవు రోజులా లేవు. నీ ముఖంలో దిగులు, అపరాధ భావన కనబడుతోంది. ఏదో విషయం దాచిపెట్టి, అబద్ధం చెప్తున్నావు!'
శరత్‌ కాసేపు మౌనంగా వూర్కొని 'అవును తాతయ్యా! నేనొక తప్పు చేశాను. నా లెక్కల టెక్స్ట్‌బుక్‌ కనపడకపోతే, నిన్న మా స్నేహితురాలు శాంతిది తీసుకొచ్చాను. దాంట్లో ఒక పేజీ చెల్లాయి శ్రావణి చించేసింది. దాన్ని ఆ పుస్తకంలోనే పెట్టి ఏమీ తెలియనట్టు మట్టసంగా శాంతికి ఇచ్చేశాను. అప్పట్నుంచి శాంతి అది చూసుకొని, ఏం అడుగుతుందోనని భయపడి పోతున్నాను!' అన్నాడు.
తాతయ్య చిన్నగా నవ్వి 'అది తప్పని నీకు తెలిసింది. కాబట్టి దాన్ని దాచిపెట్టడం మరో తప్పు. ఒకవేళ శాంతి నిన్ను అడిగిందనుకో నాకేం తెలియదని అబద్ధం చెప్పవచ్చు, అంతకుముందే చినిగి వుందనీ బుకాయించవచ్చు. ఆ పేజీ నీవే చింపేసి, నా మీద వేస్తావా? అనీ దబాయించవచ్చు. అది ఇంకా పెద్ద తప్పులవుతాయి. నీవు మంచిపిల్లవాడివి కాదు అని అందరిలో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ పేజీ నీ దగ్గరే చినిగిందని.. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీకు మాత్రం తెలుసు కదా! అది చాలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నీ మనసు బాధపడటానికి!'
'ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు తాతయ్యా?'
'నిజాయితీ అనేది చాలా సమస్యలకు పరిష్కారం. నీ సమస్యకు అది మంచి ఔషధం. రేపు నీవు శాంతికి జరిగింది జరిగినట్టు చెప్పు. ఏం జరుగుతుందో చూడు. ఒకవేళ శాంతి బాగా గొడవ పెట్టుకున్నదనుకో.. వెంటనే, మా తాతయ్యకు చెప్పి నీకు కొత్త పుస్తకం కొనిపెడతాననీ, ఆ పుస్తకం తీసుకొని ఇంటికి రా అంతే! '
దాంతో శరత్‌ మనసు చాలా తేలికైంది. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టింది.
మరునాడు శరత్‌ బడి నుండి ఇంటికి రాగానే పుస్తకాల సంచి బల్ల మీద గిరాటేశాడు. 'నానీ ఏం రా ఈ రోజు అంత హుషారుగా ఉన్నావు?' అని తల్లి అంటున్నా వినిపించుకోకుండా తాతయ్య కోసం పెరట్లోకి పరుగుతీశాడు.
శరత్‌ను చూడగానే 'చూశావా! ఈ రోజు నీ ముఖం ఎలా వెలిగిపోతుందో ... సరేగానీ శాంతి ఏమందో ముందు చెప్పు' కుతూహలంగా అడిగాడు తాతయ్య.
'అచ్చం నీవు చెప్పినట్టే చెప్పాను. శాంతి ఏమందో తెలుసా తాతయ్యా!.. తను అలా అంటుందని నేను అసలు ఊహించనే లేదు.'
'ఏమన్నదో చెప్పు'
'నేను చెప్పింది వినగానే.. అలాగా నేను చూసుకోలేదే.. అని పుస్తకం తీసి చూసి, ''ఓస్‌ ఇంతేనా! ఫరవాలేదులే మా నాన్నకు చెబితే అక్షరాలూ పోకుండా కనపడేటట్టు అతికించి ఇస్తాడు. మా ఇంట్లో మా తమ్ముడూ అప్పుడప్పుడు నా పుస్తకాలు ఇలాగే చించేస్తుంటాడు'' అన్నది. నాకెంత సంతోషమయ్యిందో మాటల్లో చెప్పలేను.'
'చూశావా! అదీ నిజాయితీలో వుండే గొప్పదనం. ఇప్పుడు నీ ముఖం ఇలా వెలిగిపోవడానికి కారణం అదే!' అంటూ నవ్వి మనవడిని దగ్గరికి తీసుకొని, ముద్దు పెట్టుకున్నాడు తాతయ్య.

- దాసరి వెంకట రమణ
90005 72573