
పిల్లలూ, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను మన కళ్ల ముందు చూపిస్తున్న టెలివిజన్ పుట్టిన రోజు ఈరోజే! దాని విశేషాలు తెలుసుకుందామా? టెలివిజన్ (దూరదర్శన్) అనేది సుదూర ప్రాంతాలకు ధ్వనితో పాటు చిత్రాన్ని కూడా ప్రసరింపజేసే ఒక సాధనం. దీనిని జాన్ లోగీ బెయిర్డ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో అతడు అనారోగ్యంతో మంచం పట్టాడు. దీంతో చదువు ఆగిపోయింది. 1922లో కోలుకున్నాక టెలివిజన్ ఆవిష్కారంపై దృష్టి పెట్టాడు. ఓ ఇరుకు గదిని ప్రయోగశాలగా మార్చుకున్నాడు. ఎలక్ట్రిక్ మోటారు, చిన్న అట్టముక్క, కటకాలు, తీగలు, వైర్లెస్ టెలిగ్రాఫ్, టార్చ్, బ్యాటరీ, జిగురు ఉపయోగించి ఓ పరికరం తయారు చేశాడు. రెండేళ్ళ నిరంతర కృషి ఫలితంగా 1922 నవంబర్ 21న కొన్ని ఆకారాలను మూడు మీటర్ల దూరం వరకూ ప్రసారం చేశాడు. అది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కాలంలో రిసీవర్లో కనబడే ప్రతిబింబం మరీ స్పష్టంగా ఉండాలని, ప్రసార దూరం పెంచాలని బెయిర్డ్ ప్రయోగాలు చేశాడు. ఆయన కృషికి గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి 1996 నుంచి నవంబరు 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటించింది.