Nov 22,2020 20:37

పాంపే: దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం అగ్నిపర్వతపు లావాలో చిక్కుకుపోయి శిలలా మారిన ఇద్దరు వ్యక్తుల శవాలు తాజాగా బయటపడ్డాయి. ఇటలీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు వీటిని వెలికితీశారు. వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు శనివారం తెలిపారు. క్రీ.పూ.79లో పాంపేలోని ప్రాచీన రోమన్‌ సిటీకి దగ్గరలోని మౌంట్‌ వెసువిస్‌ అగ్నిపర్వతం బద్దలై దాని పరసిర ఊర్లను ముంచెత్తింది. లావా నుండి తప్పించుకోవడం ప్రజల వల్ల కాలేదు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే లావాతో కప్పబడిపోయిన శవాలు మాత్రం చెక్కుచెదరకుండా మిగిలిపోయాయి. 2017లో ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. మూడు గుర్రాల శిలలు బయటపడ్డాయి. తాజాగా ఈ నెలలో ఇద్దరు వ్యక్తుల శవ శిలలను కనుగొన్నారు. లావా నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించిన ధనికుడు అతడి సేవకుడి శవాలుగా గుర్తించారు. ఓ వ్యక్తికి 18-25 సంవత్సరాలు, మరోవ్యక్తికి 30-40 ఏళ్ల వయస్సు ఉంటాయని అంచనా వేస్తున్నారు. లావా నుండి తప్పించుకోవటానికి సురక్షితమైన ప్రాంతం కోసం అన్వేషిస్తూ భూగర్భప్రాంతంలోకి వచ్చి ఉంటారని, అక్కడే వారు బ‌ల‌య్యార‌ని తెలిపారు.