Oct 24,2020 18:40

కె శ్రీనివాస్‌
9346611455

 

'సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం బావా!' అంటూ మొన్న బుధవారం నాడు హడావిడిగా కదులుతున్న బస్సువైపు పరుగెత్తాడతను. అదిగో వెళ్తున్నప్పటి ఆ కాస్త వెలుగైనా ఇప్పుడు తన ముఖంలో లేదు. బస్సు దిగుతూ ఎప్పటిలానే సంచి చేతపట్టుకొని, నీరసాన నడిచొస్తున్న అతన్ని నేనే ఆపి పలకరించాను.
అతను బీసీ కాలనీలో ఉంటాడు. ఆకుపచ్చ జెండా కట్టే అతని ఎర్ర అలుకు కొట్టం బస్టాప్‌ నుంచి ఇంకా కొన్ని ఫర్లాంగుల దూరముంటుంది. పొలాలకు గొడుగు పట్టినట్టు అప్పటికే దట్టంగా నల్లమబ్బేసి ఉంది. 'చేతిలో గొడుగేదయ్యా ఎప్పుడూ వెంట ఉంచుకుంటావుగా?' అని నేను అడగగానే. 'ఆ నల్లగొడుగు మీద నమ్మకం పోయింది బావా! కోర్టు మెట్లు దిగొస్తూనే విసిరి అవతలపారేశాను' అన్నాడు ఆఖరి బీడి వెలిగించుకొని, కాగితం కట్ట అవతల పారేస్తూ.
'గొడుగెందుకు పారేశావ్‌?' అని నవ్వుతూ నేనడుగుతుంటే. మొదటి పొగ పీలుస్తూ అతనన్నాడు 'అది కంతలుపడింది బావా! దాన్ని నిలబెట్టే పుల్లలూ తప్పారు. కొన్ని వంగిపోయారు. వానైనా, ఎండైనా అది రక్షణ ఇవ్వదని తేలిపోయింది. ఎన్నని బాగు చేయిస్తాం? ఎంతని యాష్టపడతాం? అందుకే వదిలేశా!' అన్నాడు బొటనవేలి గోరుతో నుసి రాల్చుతూ.
'సర్లే ఇంతకూ వెళ్ళిన పనేమైంది? ఇన్నేళ్ళ సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత ఇవాళ ముఖ్యమైన తీర్పొస్తుందని, నీకు న్యాయం జరిగి తీరుతుందని అనే వాడివిగా?' అని అతన్నడిగాను ఏమీ తెలీనట్టు.
'న్యాయదీపం మసకబారుతోంది బావా! పొగచూరి నల్లబారిన లాంతరద్దాన్ని ముగ్గుపొడేసి రుద్ది తుడిచినట్టు తుడవాలి' అన్నాడు.
బతుకమ్మ పూల సందడి మొదలవటంతో సరిగ్గా అదేసమయంలో కొందరు ఆడపిల్లలు బోణమెత్తుకొని గుడివైపు వెళుతున్నారు. అతను వాళ్ళవైపు చూస్తూ 'బతుకమ్మ బోణమంటే అన్నిపూలూ కలిసిమెలిసి ఉంటారు బావా! అన్ని పూలకూ సమగౌరవం ఉంటుంది! కానీ దేశం నడినెత్తిన ఒక కానరాని బోణం ఊరేగుతోంది. ఆ బోణంలో ఒకరకం పువ్వు మిగతా పూలను తక్కువ చేస్తోంది. తనొక్కదానితోనే బోణం కావాలనుకుంటోంది!' అని ఏదో నిగూఢార్థంలో మాట్లాడు తున్నాడు. ఆ మాటలకు అసలు అర్థమెంటో నాకు తెలుసు. తన నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నేను యత్నిస్తుండగా..
'గొడ్లొచ్చుంటారు బావా! పోయి వాటికి మేతేసి, కుడితి పెట్టి.. సందెకసువు తీసి, రెండుచెంబులు నీళ్ళు బోసుకుని వొస్తా.. అరుగు మీద కూర్చొని, మాట్లాడు కుందాం!' అంటూ అక్కడి నుంచి కదులుతుండగానే వాన లపలపమని పడేసరికి నేను టీహోటల్లోకి, అతను తన ఇంటివైపు పరుగెత్తాడు.
వానను చూస్తూనే.. టీ తాగబుద్ధయ్యేసరికి ఒక టీ తీసుకొని తాగుతూ అతని ఆలోచనలోపడ్డాను.

ఇతనికో పేరుంది. కానీ ముందుగా ఎవరు పిలిచారో 'పిచ్చోడ'ని అదే ఇంకా కొనసాగుతోంది. ఊళ్ళో తాత వయసు వాళ్ళ నుండి మనవల దాకా అదే పేరున పిలుస్తారు. నెత్తిన తెల్లటోపీ, బారు గడ్డం, కళ్ళకు సుర్మా, గళ్ళ లుంగీ, సిల్కు ఫైజమా, మెడలో రుమాలు..' ఇవి అతని నిర్ధారణ గుర్తులు.
పక్క ఊరిలో బంధువులున్నారు అయినా ఇతన్ని చూసిపోయేందుకూ ఒక్కరూ ఆ పొలిమేర దాటిరారు. వాళ్లకితనిపై ద్వేషమేం లేదు. ఇతనే వాళ్ళందరినీ వొద్దనుకున్నాడు.. వదిలేశాడు. వద్దనుకొని విడిచి వెళ్లిన వాళ్లెవరూ బంధువులు కాదనేవాడు. నవాబు నుండి కూలోడు దాకా అన్నీ అనుభవించాడు. దిగులు మచ్చగా బతికాడు. అభద్రతా ఊపిరై ఊగిసలాడాడు. గాలి మురుగుకాలికి గంధం అద్దేటోడు.
ఇతని తల్లీతండ్రి చనిపోయారు. భార్యాబిడ్డల సంగతి ఎవరికీ తెలీదు. మసీదులో అజా ఇచ్చేందుకు వీళ్ళ తాత ఈ ఊరొచ్చాడని చెబుతారు. ఆ వారసత్వమే ఇతనూ కొనసాగిస్తున్నాడు.
గత రెండున్నర దశాబ్దాలకుపైగా ఫైళ్ళు ఫైళ్ళలో ఏవో పత్రికా కథనాలు, ఫొటోలు, వీడియో క్యాసెట్లుండే సంచి భుజానికి తగిలించుకొని, తిరుగుతున్నాడు. ఎవరన్నా మాట్లాడిస్తే మాట్లాడతాడు. అందరికీ భయపడుతుంటాడు. ఫైళ్ళలోకి చూస్తూ 'గెలుస్తాను. నేనే గెలుస్తాను!' అంటూ తనలోతానే గొణుక్కుంటుంటాడు. అందుకే కాబోలు ఊరోళ్ళు ఇతన్ని పిచ్చోడనేది.
'ఎందుకట్లా ఎవరికీ వినపడనట్టు నీలో నువ్వే గొణుక్కుంటావు?' అని నేను ప్రశ్నిస్తే. 'నేను గెలుస్తానని ఎవరూ భరోసా ఇవ్వట్లేదు బావా! నాకు నేనైనా భరోసా ఇచ్చుకోకపోతే పోరాటం సాగించలేను. గుండెపగిలి చస్తానేమోనని నన్ను నేను ఓదార్చుకుంటాను. నాకు నేను ధైర్యం చెప్పుకుంటున్న విషయం ఎవరికి తెలిసినా నన్ను మరింత నిర్భంధిస్తారేమోనని భయంతో అలా నాకు నేను గుసగుసగా చెప్పుకుంటాను!' అని అనేవాడు.

ఏడింటి అజా ఇచ్చినంక వొస్తడేమో.. ఎనిమిదింటికి వస్తాడేమో అనుకుంట తొమ్మిదింటి వార్తల టైం దాకా అతనికోసం అరుగుకాడ ఎదురుచూసినం, నేనూ ఇంకొందరం. అతను రాలేదు కానీ వాకిట్లో ఎవడో పేపర్‌ గిరాటేసినట్టు.. అతను చనిపోయాడన్న వార్త తెల్లారి పొద్దున్నే ఊరందరికీ చేరింది.
పాచి మొఖాలు తోమీతోమకుండానే ఒకరొకరుగా అందరమూ అతని కొట్టం వైపు పరుగుతీశాం. 'పండుకున్నోడు పండుకున్నట్టే పోయాడ'ని ఎవరో అంటున్నారు. లాల్చీ తొడగని అతని ఒంటిపై అతిపెద్ద గాయం, మరో రెండుమూడు చిన్న చిన్నగాయాలు ఉన్నారు. అవీ ప్రమాదమైనవి అనుకుంటే ప్రమాదమైనవి.. కావనుకుంటే కావు. ఒంటిమీద ఇంకా అనేకచోట్ల అనేక గీసుకుపోయిన, ఒరుసుకుపోయిన, కమిలిపోయిన, కుమిలిపోయిన మచ్చల ఆనవాళ్ళున్నారు.
దాదాపు ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం దెబ్బ కొట్టబడటం వల్లే పిచ్చోడయ్యాడు. న్యాయాన్ని పలవరిస్తూ దోషులకు శిక్ష కోరుతూ కళ్ళకు ఆశను పూసుకున్నాడు. కానీ గాలిపటం తిరగబడ్డట్టు తన నమ్మకం కూలిపోవటంతో ఇలా ఆశ విడిచాడు.
ఏదో గొడవ.. చోటు వివాదం ఇతన్నీ స్థితికి తెచ్చింది. 'నా స్థలంలో నువ్వు నిర్మించాలనుకోవటం ఏమిట'ని అడ్దుకున్నందుకు బలవంతులు అతని విశ్వాస నిర్మాణాన్నే కూల్చేశారు. బలహీనుడు ఆక్రోశించాడు. 'అన్యాయమ'ని ఎలుగెత్తాడు.. మొరపెట్టుకున్నాడు..
ఫిర్యాదు చేశాడు. న్యాయం అడిగాడు. శిథిల ఆనవాళ్లను తలుచుకుంటుండేవాడు. కూల్చబడిన ఒకో ఇటుక నమ్మ కంగా తిరిగి లేస్తుందనుకున్నాడు. కానీ ఈ మధ్యే 'ఆ చోటుపై ఆశలొదులుకో!' అన్నారు. 'నీకు వేరే స్థలమిస్తాం!' అన్నారు.
ఆ రోజున ఇంతే దుఃఖంతో అతనన్నాడు.. 'కళ్ళకు గంతలు కట్టుకొని కోర్టు పట్నంలో ఎక్కడో ఉంది బావా! ఇక్కడ నాకు జరిగిన అన్యాయం తన కళ్ళకు కనిపించదు. నా ఆక్రందన తనకు వినిపించదు. ఊరంతటికీ అజా వినిపించినట్టు కొల్లగొట్టబడింది స్థలం మాత్రమే కాదని తెలియజెప్పేందుకు ప్రపంచానికి వినపడే మైక్‌ కావాలి!' అని.
తన కళ్ళల్లో అప్పుడు కూల్చిన చేతుల చిత్రాలున్నా, అవేవీ సాక్ష్యంగా నిలువలేకపోయారు. పత్రిక కథనాలు, వీడియోలు తెగిపోయే దారాలే తప్ప, అభియోగస్తులను దోషులని ఋజువుపరిచే ఏ ఒక్క ఆధారమూ లేదని.. దోషులెవరూ లేరని తేల్చాక తనే మునిగిపోయాడు. అందరూ నిర్దోషులే అయినచోట అతనే బాధితుడు, విస్తాపితుడు. తనే కూల్చుకున్నోడు. తనే చంపబడ్డోడు.. ఉద్దేశ్యపూర్వకంగా కాదు యాక్సిడెంటల్‌గా.. అతని పేరు బాబరి.