Nov 23,2020 19:58

విజయవాడ మొగల్రాజుపురంలోని సిద్ధార్థనగర్‌కు చెందిన వేముల సాయి అక్షర (16) తల్లిదండ్రులు బుజ్జి, సుజనశ్రీ. సిద్ధార్థా విపిఎస్‌ పబ్లిక్‌ స్కూల్లో ఎల్‌కెజి చదువుతున్నప్పుడు స్కూల్లో చిల్డ్రన్స్‌ డే సందర్భంగా 'దేవుళ్లు అందరూ ఒక్కరే' నాటికలో నటించింది. ఆ సందేశాత్మక ప్రదర్శనను చూసి ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు ఎంతో మెచ్చుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ క్రీడలు, క్విజ్‌, వ్యాసరచన, విలువిద్య, సంగీతం, నాట్యం .. ఇలా పలు అంశాలపై దృష్టి పెట్టి గొప్ప ప్రతిభను చాటుతోంది అక్షర.
ఆరవ తరగతి చదువుతున్నప్పుడు చదువుతో పాటు ఏకాగ్రత పెంచుకోవడానికి ఆర్చరీ (విలు విద్య) క్రీడను ఎంచుకుంది. 'ఓల్గా ఆర్చరీ' అకాడమీలో చేరింది. ఓ రోజు యూట్యూబ్‌లో ఓ బాలుడు అనర్గళంగా నెంబర్లు చెప్పడం చూసి తాను కూడా అలా సాధన చేయాలనుకుంది. రోజూ అకాడమీకి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు 2 రూట్‌ నెంబర్లను వేగంగా వల్లె వేసే సాధన మొదలు పెట్టింది. విలువిద్య సాధనకు 'అక్షర బలం సరిపోవటం లేదు' అని ఎవరో అనటంతో  పట్టు వదలకుండా పోషకాహారం తీసుకొని కసరత్తులు చేసింది. ఆరు నెలల తర్వాత మళ్లీ అకాడమీకి వెళ్లింది. ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఆటకు వెళుతూ 2 రూట్స్‌ కొత్త నెంబర్లను నెమరువేసుకుంటూ... జంట సాధన చేసింది. 2017 అక్టోబరులో వర్చువల్‌ విధానంలో నిర్వహించిన ప్రదర్శనలో రూట్‌ 2 విలువను 500 డెసిమల్స్‌ వరకు 39 సెకన్లలో చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తరువాత కూడా సాధన కొనసాగించి.. 60.08 నిమిషాల్లో 6,002 డెసిమల్స్‌తో ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించింది. ఈ నెల 15న నిర్వహించిన ప్రదర్శనలో 6,020 డెసిమల్స్‌ను 5.12 :98 నిమిషాల్లో చెప్పి ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది.
ఆటల్లోనూ, వైజ్ఞానిక అంశాల్లోనూ ...
అండర్‌-14లో సిబిఎస్సీఈ - 2018 ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన విలు విద్య పోటీల్లో తృతీయ బహుమతి పొందింది. అదే రోజు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ - 2018లో చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీల్లో పాల్గంది. దూరప్రయాణం చేసి వచ్చి మరీ పోటీల్లో పాల్గంది. జాతీయస్థాయిలో ఎక్కడ విలువిద్య పోటీలు నిర్వహించినా పాల్గని, బహుమతులు పొందింది. ఆటల్లోనే కాదు; తరగతిలో చెప్పే ప్రతి సబ్జెక్టు పాఠాలను శ్రద్ధగా చదివి క్లాస్‌ ఫస్ట్‌ ర్యాంకులో నిలుస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహించిన ఇంటర్నేషనల్‌ యంగ్‌ ఇన్నోవేటర్స్‌ - 2019లో అక్షర ప్రదర్శించిన 'స్మార్ట్‌ హెల్మెట్‌ ప్రాజెక్టు'కు గుర్తింపు వచ్చింది. ఎస్‌జీఎఫ్‌ 65వ అంతర్‌ జిల్లాల ఫీల్డ్‌ (విలువిద్య) ఆర్చరీ అండ్‌-17 బాలబాలికల పోటీలు 2019లో ఆడి బహుమతి సాధించి జాతీయస్థాయికి ఎంపికైంది. ఇన్‌స్పైర్‌ మానక్‌-2020 రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 40 మంది ప్రతిభావంతుల్లో ఒక్కరిగా ప్రశంసలు పొందింది. అదే రోజు తన అన్నయ్య పెళ్లి. ఆ సందడిలో మునిగిపోయింది. పోటీలకు ఎంపికైనట్లు తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులను అందర్నీ ఒప్పించి వెళ్లింది. అక్కడ 'డిడక్షన్‌ ఆఫ్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ ప్రాజెక్టు' గురించి పవర్‌ పాయింట్‌లో ప్రదర్శించి రూ.10 వేల బహుమతిని దక్కించుకుంది. ఈ విజయాలు అన్నింటి వెనకా అక్షరకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది.
పుస్తక పఠనం ఇష్టం
చిన్నప్పటి నుంచి కొంచెం సమయం దొరికితే చాలు సైన్స్‌, కథల పుస్తకాలు చదవడం అలవరుచుకుంది అక్షర. ఆదివారం వస్తే చాలు, బుక్‌షాపులకు వెళ్లి కొత్త పుస్తకాలు తెచ్చుకొని వాటిలోని విషయాలను, కథలను తల్లిదండ్రులకు చదివి వినిపిస్తుంది. ఇంట్లో అక్షరకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం కోసం తల్లిదండ్రులు టీవీని తొలగించారు. ఫోన్‌ని అవసరం మేరకే వాడడం అలవర్చుకున్నారు. స్కూల్లో జరిగిన ప్రతి విషయాన్ని అక్షర చెబుతుంటే ఓపిగ్గా వింటారు. తల్లి సుజనశ్రీ ఎప్పుడూ స్నేహితురాలిలా వెన్నంటే ఉంటుంది.
నాయకత్వ లక్షణాలతో ...
అక్షర తరగతి గదిలో లీడర్‌గా ఉండి అందరినీ కలుపుకొని పోయి మాట్లాడటాన్ని రోటరీ క్లబ్‌ సభ్యులు గుర్తించారు. వారి చొరవతో పద్నాలుగో ఏటే రోటరీ ఇంటారాక్ట్‌ క్లబ్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది. ఆ వయసులోనే రూ.50 వేలు విరాళాలను సేకరించి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే జామెంట్రీ బాక్సులను అందజేసింది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, బహిరంగ సభలు, సమావేశాల్లో ఉపన్యాసాలు ఇవ్వడం చేసింది.
లాక్‌డౌన్‌లో తరగతుల నిర్వహణ

అన్నింటా మేటి... అక్షర


కరోనా సెలవుల్లో యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా 70 మంది పిల్లలకు 9వ తరగతి పాఠాలను చెప్పింది. వారికి పరీక్షలు కూడా నిర్వహించి, సర్టిఫికెట్లు, బహుమతులు ఇచ్చింది. ఇప్పుడు పాఠశాలలు తెరుచుకోవడంతో ఆ ఛానల్‌ ద్వారా విజ్ఞాన విషయాలను, కథలను వినిపిస్తుంది. పెద్దయ్యాక ఏదేనీ వాణిజ్య సంస్థకు సీఈఓగా ఉండాలనేది అక్షర లక్ష్యం. ఆ దిశగా సాగటానికి ఇప్పటినుంచే అన్ని రకాల శక్తిసామర్ధ్యాలనూ అలవర్చుకుంటోంది. ఆల్‌ ది బెస్ట్‌ అక్షరా ...
- పద్మావతి