Nov 26,2020 19:39

అతడు ఆటను ఓ అద్భుతంగా మార్చేశాడు. రెప్పపాటు కాలంలో ఎన్నో మహాద్భుతాలను ఆవిష్కరించాడు. ఒక ఆటకే కాదు; ఆవేశానికీ, ఆశయానికీ, ముక్కుసూటితనానికీ ప్రతీకగా నిలిచాడు. ఖండఖండాంతరాల్లో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతడు డియెగో అర్మాండో మారడోనా ఫ్రాంకో. ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్‌ ఆటగాడు. 1960 అక్టోబరు 30న పుట్టి- 2020 నవంబరు 25న ఆట ముగించాడు.

మారడోనా ... ఈ నాలుగక్షరాల పేరు ఫుట్‌బాల్‌ క్రీడలో ఒక సంచలనం. అభిమానుల గుండెల్లో మార్మోగే జయజయ నినాదం. ప్రపంచంలోని దాదాపు రెండొందల దేశాల్లో ప్రఖ్యాతి చెందిన ఆట ఫుట్‌బాల్‌. సాకర్‌ ట్రోఫీ మొదలైందంటే- ఆ ఉద్వేగ సంరంభం అనంతం. అలాంటి ఆటను ఒక ఉత్సవంగా, ఒక ఉత్సాహంగా, కనులు మిరుమిట్లు గొలిపే ఓ మాయాజాలపు మహాద్భుతంగా మార్చినవాడు మారడోనా. తొలి ఆటలోనే అనూహ్యంగా మెరిసి అందరి దృష్టిలో పడ్డాడు కానీ, మామూలుగా అయితే చాలా సాదాసీదా బాలుడు. ఎనిమిదేళ్ల వయసు నుంచీ బంతితో చెలిమి మొదలెట్టాడు. 1976లో పదహారేళ్ల వయసులో అధికారిక టోర్నీలో పాల్గొన్నాడు. ''ఇంత చిన్నగా ఉన్నాడేంటి? అసలు జట్టు సభ్యుడేనా?'' అని సందేహించిన రిఫరీలకు తనదైన ఆటతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆరోజు అద్భుతమైన ప్రదర్శన తరువాత ''నేనీరోజు ఆకాశాన్ని అందుకున్నాను'' అని వ్యాఖ్యానించాడు. జీవితంలో జయాపజయాలు ఎన్ని ఎదురైనా అభిమానుల హృదయాల్లో మాత్రం ఆకాశమంతటి స్థానాన్ని ఎప్పుడూ కోల్పోలేదు.

ఆటే .. అతడి సమాధానం!
ఐదడుగుల ఐదంగుళాల శరీరం. ఇతర ఆటగాళ్ల మధ్య కంటికి కనబడని ఆకారం. అసలు ఆకారంతో సంబంధం ఏముంది? ఆటతో కదా సమాధానం. అదే చేశాడు మారడోనా. మొదటి ఆటతోనే మెరుపులా మెరిశాడు. తాను ఏ మూలన ఉన్నా స్టేడియం కళ్లన్నీ తననే వెతుక్కునేలా చేశాడు. అతడి ఆటొక విన్యాసం. కదలిక మహాద్భుతం. ప్రత్యర్థుల అంచనాలను పటాపంచలు చేసి, బంతిని అవలీలగా బంధిస్తాడు. లక్ష్యాన్ని గురిచూసి, క్షణాల్లో బంతిని అక్కడికి చేరుస్తాడు. అప్పుడు అతడి ముఖాన మెరిసే నవ్వు ఒక సమ్మోహనం. అతడు చేసే విజయసంజ్ఞ ఒక విస్ఫోటనం. స్టేడియం అలలు అలలుగా ఉప్పొంగుతుంది. ఉత్సాహ ఉద్వేగ తరంగమై విజృంభిస్తుంది. ''అతడొచ్చాడు. ఆటను మార్చేశాడు..'' అనుకున్నారు అందరూ. వారి ఆశను, ఆకాంక్షను, అంచనాను అక్షరం పొల్లుపోకుండా నిలబెట్టాడు అతడు. 1979 ఫిఫా వరల్డ్‌ కప్‌ సాధించటంలో అతడే కీలకమయ్యాడు. వరుసగా ఎన్నో విజయాలు సాధించాడు. ఏ క్లబ్‌ తరుఫున ఆడినా, అది ఏ స్థాయి ఆటైనా కేవలం అతడి కోసమే వేలాదిమంది అభిమానులు వచ్చేవారు. అర్జెంటీనా సహా అనేక లాటిన్‌ అమెరికా దేశాల గోడలు అతడి బొమ్మలతో నిండిపోయేవి. ఎంతోమంది అతడిని గుండెల్లోనే కాదు; శరీరమ్మీద పచ్చబొట్టుగానూ దాచుకున్నారు. తమ చిన్నారులకు అతడి పేరు పెట్టుకొని అభిమానాన్ని చాటుకున్నారు.

అతడొక ప్రతిఘటనా పతాకం
ఇంత అభిమానమూ అతడి ఆటకేనా అంటే- సమాధానం పూర్తిగా 'కాదూ' కాదు, 'అవునూ' కాదు. అతడు ఆడే ఆట అచ్చం అతడి తత్వంలా ఉంటుంది. అది సంపన్న దేశాల దోపిడీకి గురయ్యే చిన్న దేశాల తిరుగుబాటులా ఉంటుంది. నిర్భయంగా, నిర్మొహమాటంగా, నిశ్చింతగా తల ఎగరేయటంలా ఉంటుంది. బలిసిన సామ్రాజ్యవాదంలా ఎగిరొస్తున్న బంతిని ఎదురెళ్లి ఎడమ కాలితో తన్నటంలా ఉంటుంది. అతడి మాటా అంతే! ఆటా అంతే! దాచుకోవటానికి ఏం లేదు.. అంతా బహిరంగమే! నంగినంగిగా మాట్లాడ్డం, వొంగి వొంగి నడవటం లేదు. అంతా పోట్లాడ్డమే! ఆ నైజం వల్లనే యువతకు అతడు హీరో. ఆ కారణం వల్లనే కొన్ని దేశాలకు, అక్కడి మీడియాకు అసహనం, భయం! అయితే- ఏం చేస్తారు? అతడు వివాదాస్పదుడంటూ కోకొల్లలుగా రాస్తారు. అతడికెంత భార్యలు, ఎంతెంతమంది పిల్లలు, ఏఏ మ్యాచుల్లో ఏఏ రకపు అతిక్రమణలు జరిగాయి వంటివి కల్పించి ప్రచారం చేస్తారు. కానీ, అవేవీ అతడి అభిమానులను కొంతమాత్రంగానైనా ప్రభావితం చేయలేదు. ఈనెలలోనే బ్రెయిన్‌ సర్జరీ చేయించుకున్నప్పుడు అతడి క్షేమం కోసం లక్షలాదిమంది పరితపించారు. ఆసుపత్రి దారులన్నీ అతడి ఫొటోలతో నింపేశారు. అతడు చనిపోయాడని తెలిసి ఎన్ని హృదయాలు తల్లడిల్లిపోయాయో! ఎంత దు:ఖం కట్టలు తెగి ప్రవహించిందో!

చేతిపై చే గువేరా టాట్ట్టూ
ఒక మనిషిని అంచనా వేయాలంటే- అతడు ఏ ప్రాంతానికి, ఏ కాలానికి, ఏఏ సందర్భాలకు చెందినవాడో పరిగణనలోకి తీసుకోవాలి. మారడోనాను అలాగే చూడాలి. అతడొక కార్మిక కుటుంబానికి చెందినవాడు. ఏడుగురు సంతానంలో ఒకడు. కార్మికవాడలో స్వేచ్ఛగా పెరిగినవాడు. అణచివేతకు గురవుతూ, దాని పట్ల అణువణువూ అసహ్యతను పెంచుకున్నవాడు. అందుకే అతడికి చే గువేరా అంటే ప్రాణమంత ఇష్టం. తన భుజాన పచ్చబొట్టుగా దాచుకునేంత అభిమానం. అమెరికా దురన్యాయాలను ధిక్కరించే క్యూబా అంటే ప్రేమ. ఆనాటి అధ్యక్షుడు ఫిడేల్‌ కాస్ట్రో పట్ల పెద్ద హీరో వర్షిప్‌. ''కాస్ట్రో నాకు తండ్రిలాంటివారు. నా ప్రాణదాత. నాకు నా దేశంలో ఆరోగ్య రక్షణ దొరకనప్పుడు- అమ్మలా నాన్నలా ఆదుకొంది క్యూబా. ప్రేమపూరిత వైద్యం అందించి నన్ను మళ్లీ ప్రపంచం ముందు నిలబెట్టింది.'' అని సందర్భం వచ్చిన ప్రతిసారీ చెప్పేవాడు. ఒకానొక సందర్భంలో డ్రగ్స్‌కు బానిసై చావు అంచుల దాకా వెళ్లాడు. అప్పుడు క్యూబా ప్రత్యేక ఆదరణ అతడిని మళ్లీ మామూలు మనిషిని చేసింది. కాస్ట్రో ముఖచిత్రాన్ని కూడా అతడు తన వొంటిపై టాట్టూగా వేయించుకున్నాడు. నాలుగేళ్ల క్రితం కాస్ట్రో కన్నుమూసిన రోజునే (నవంబరు 25) ... తానూ ఇప్పుడు వెళ్లిపోయాడు. కమ్యూనిస్టులకు అనుకూలంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడ్డానికి ఎప్పుడూ వెనకంజ వేయలేదు. భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు అప్పటి బెంగాలు ముఖ్యమంత్రి జ్యోతిబసును కలుసుకున్నాడు. 2012లో కేరళ వచ్చినప్పుడు ఆ సంగతులు గుర్తు చేసుకున్నాడు. తన తిరుగుబాటు నైజానికి ఎర్రజెండాను జోడించుకోవటం, సదా వామపక్ష శక్తులకు మద్దతునివ్వటం ఒక సూత్రంగా జీవితాంతం పాటించాడు.


అతడి జీవితం భూమ్యాకాశాలంత వైవిధ్యభరితం. ఆటలో ఆకాశమంత ఎదిగాడు. కోట్లాదిమంది అభిమానుల ప్రేమా పొందాడు. మత్తుమందులకు బానిసయ్యాడు. చావుదాకా వెళ్లి వెనక్కొచ్చాడు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డాడు. బోలెడు విమర్శలు ఎదుర్కొన్నాడు. మళ్లీ బరిలోకి వచ్చాడు. విజయాలు సాధించాడు. చనిపోయేవరకూ అర్జెంటీనా ఫుట్‌బాల్‌ కోచ్‌గా ఉన్నాడు. ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఎగుడు దిగుళ్లు ఎన్నున్నా బతికినన్నాళ్లూ తాను తనలాగే బతికాడు- ధిక్కార పతాకంలాగ, ఆకాశాన్ని ముద్దాడి నవ్విన ఆటగాడిలాగ..! అతడు మూడు తరాలకు ప్రత్యక్ష ఉత్తేజం. ముందు తరాలకు ఉత్సాహాన్నిచ్చే ఉదాహరణం.
                                                                                                        * సత్యాజీ