Jan 26,2021 00:47

అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడిలో మాట్లాడుతున్న అయోధ్యరామ్‌

ప్రజాశక్తి-ఉక్కునగరం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు ఇన్సెంటివ్‌ చెల్లింపుపై సోమవారం కార్మిక సంఘాల నేతలు, యాజమాన్య ప్రతినిధులు చర్చలు జరిపారు. ముందుగా కార్మికులకు ఇన్సెంటివ్‌ చెల్లించాలని కోరుతూ అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడికి అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రయత్నించాయి. పోలీసులు మోహరించి కార్మికులను బిల్డింగ్‌ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తర్వాత యాజమాన్యానికి, కార్మికులకు మధ్య చర్చలు జరపడానికి పోలీసులు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్‌ పర్సనల్‌ కేసీ.దాస్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాలాజీతో అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు భేటీ అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ తరపున ఈడి మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారంలోని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, దీన్ని గమనించి కార్మిక సంఘాలు సహకరించాలని కోరారు. అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఉత్పత్తి సాధించినప్పుడు ఇన్సెంటివ్‌ పొందడం కార్మికుల హక్కు అని ఫిబ్రవరి లోపల ఎట్టిపరిస్థితుల్లోనూ చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. కనీసం అడ్వాన్స్‌ రూపంలోనైనా కొంత మొత్తాన్ని కార్మికుల అకౌంట్లోకి బదిలీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు జె.అయోధ్యరాం, గంధం వెంకట్రావు (ఐఎన్‌టియుసి), కెఎస్‌ఎన్‌ (ఏఐటీయూసీ), రాధాకృష్ణ (బిఎంఎస్‌), మస్తానప్ప (వైఎస్‌ఆర్‌టియుసి), అప్పారావు (హెచ్‌ఎంఎస్‌), సురేష్‌బాబు (సిఎఫ్‌టియు), సన్యాసిరావు (ఎఐసిటియు), కామేష్‌ (యూస్‌) తదితరులు పాల్గొన్నారు