Nov 21,2020 12:40

ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విపత్తులతో పంటలు దెబ్బతిని అపార నష్టాలను చవిచూసిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి సాయానికీ 'ఇ-క్రాప్‌' షరతు గండి కొడుతోంది. సబ్సిడీ విత్తనాలు మొదలుకొని సూక్ష్మపోషక ఎరువులు, సున్నా వడ్డీ, పంటల అమ్మకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇలా అన్ని పథకాలకూ ఇ-క్రాప్‌ బుకింగ్‌ను తప్పనిసరి చేయగా, సాంకేతిక ఇబ్బందులు, రెవెన్యూ-వ్యవసాయం-పంచాయతీరాజ్‌ శాఖల మధ్య సమన్వయ లోపం, క్షేత్ర స్థాయి సిబ్బంది అలసత్వం వెరసి ఇ-క్రాప్‌లో వాటిల్లుతున్న తప్పులకు రైతులు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టాలకు ఆ సీజన్‌లోనే పరిహారం అనే ప్రభుత్వ విధానం ఆచరణలో లక్షలాది మంది అన్నదాతల దరి చేరకుండా ఇ-క్రాప్‌ మోకాలడ్డుతోంది. ముఖ్యంగా ఎలాంటి రికార్డులూ లేని వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల ఉసురు తీస్తోంది. ఈ మారు ఖరీఫ్‌లో భారీ వర్షాలు, వరదలకు విడతలవారీగా పంటలకు నష్టం జరిగింది. పంట కోతలకు ముందు సెప్టెంబర్‌- అక్టోబర్‌లలో సంభవించిన విపత్తులకు లక్షలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట నష్టం నమోదుకు నిర్వహిస్తున్న ఎన్యుమరేషన్‌లో ఇ-క్రాప్‌ సమస్యలు భారీగా బయట పడుతున్నాయి.
80 శాతమే నమోదు
ఇ-క్రాప్‌ పోర్టల్‌లో సాగు నమోదును గ్రామ సచివాలయ పరిధిలో నియమితులైన విలేజి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (వివిఎ)లు రెవెన్యూ సిబ్బంది సహకారంతో చేయాలి. సొంత భూమి కలిగిన రైతుల డేటాను రెవెన్యూ డిపార్టుమెంట్‌కు చెందిన వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా ఇ-క్రాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కౌలు రైతుల వివరాలను వారికి జారీ చేసిన సిసిఆర్‌సి ప్రాతిపదికన పోర్టల్‌లో ఎక్కించాలి. వెబ్‌ల్యాండ్‌ డేటాలో దొర్లిన తప్పుల వలన ఇ-క్రాప్‌లో సమస్యలొచ్చాయి. వాటితో పాటు నెట్‌, సర్వర్‌ మొరాయింపు సాగుల నమోదును ఆటంకపర్చాయి. కొంత మంది సిబ్బంది చివరి నిమిషంలో పొలాలు తిరగకుండా ఆఫీసుల్లో కూర్చొని హడావుడిగా సాగులు నమోదు చేశారు. రైతు వేసిన పంట ఒకటైతే రికార్డులో వేరే పంట నమోదైంది. ఇక కౌలు రైతులకు సిసిఆర్‌సిని తప్పనిసరి చేయడంతో ఇ-క్రాప్‌లో స్వల్ప సంఖ్యలోనే ఎక్కారు. మొత్తమ్మీద ఖరీఫ్‌ విస్తీర్ణంలో సగటున 80 శాతం మాత్రమే ఇ-క్రాప్‌లోకి ఎక్కిందని, ఇరవై శాతం ఎక్కలేదని సమాచారం.
ఫిర్యాదుల వెల్లువ
విపత్తుల బారిన పడిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి వచ్చే సరికి ఇ-క్రాప్‌ తప్పులు బయట పడుతున్నాయి. ఖరీఫ్‌లో వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఎన్యుమరేషన్‌ చేయబోతే ఇ-క్రాప్‌లో నమోదు కాకపోవడమో, లేదంటే ఒక పంట బదులు మరొక పంట ఎక్కించడమో జరిగింది. ఉదాహరణకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మొత్తం వేరుశనగ విస్తీర్ణం నష్టపోయిందని చెపుతుండగా, పరిహారానికి ప్రతిపాదనలు తయారు చేసే క్రమంలో ఇ-క్రాప్‌లో చాలా చోట్ల నమోదులు లేవని, ఉన్నా వేరొక పంటను ఎక్కించారని రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్య బీమా పరిహారాన్ని సైతం వెంటాడుతుందని చెపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తీవ్రంగా ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా గ్రామ సచివాలయానికి కేటాయించిన వివిఎలపై అజమాయిషీ విషయంలో వ్యవసాయ, పంచాయతీరాజ్‌ శాఖల మధ్య గందరగోళం నెలకొంది. వారి పని తీరును పరిశీలించి నెల నెలా వర్క్‌ రిపోర్టు ఇవ్వాల్సింది, పని అప్పగించాల్సింది, ఎఓలుకాగా, జీతాలిచ్చేది పంచాయతీరాజ్‌ డిపార్టుమెంట్‌కు చెందిన గ్రామ సచివాలయ కార్యదర్శి. పై నుంచి కింది వరకు రెండు విభాగాల మధ్య సమన్వయం లేనందునే ఇ-క్రాప్‌ బుకింగ్‌ సహా పలు ముఖ్యమైన పనులు సక్రమంగా జరగట్లేదని వ్యవసాయాధికారులు ఆరోపిస్తున్నారు.