Oct 18,2021 06:49

   చార్య కొలకలూరి ఇనాక్‌ ప్రసిద్ధ నవలా కథానికల రచయిత, ప్రముఖ కవి, ఉత్తన నాటక కర్త, విశిష్ట విమర్శకుడు, లోతయిన పరిశోధకుడు. ఎన్నెన్నో ఉన్నత పదవుల్ని చేపట్టి నిర్వహించిన కార్యదక్షుడు. ఇనాక్‌ గారిని తెలుగు సాహితీ లోకం ముందుగా గొప్ప కథకుడనే అంటుంది. ఆ ఆయన కథల్లోని వస్తు రూప విశ్లేషణ చేయడం ప్రస్తుతాంశం.
     కట్టడి : ఇనాక్‌ గారి కలం నుంచి వెలువడిన 'కట్టడి' కథ - ఒక దయనీయమైన జీవన స్థితికి అత్యంత వాస్తవిక దర్పణం. 'తోటి మనిషి పరిస్థితి ఇదీ' అని తెలిసి గుండె పగిలిపోయే నగ వాస్తవికత. 'బావిని కట్టడి చేశారు' - ఇదే మొదటి వాక్యం. ఇలా కథ ఎత్తుగడ చదవరిలో ఉత్కంఠనీ, ఉత్సాహాన్నీ రేపుతుంది. రెండో వాక్యం : ''ఎవరూ నీళ్ళు తెచ్చుకోవటం లేదు'' అని సాగుతుంది.
    ఒక మహోన్నత పర్వతపాదం దగ్గర నిలబడి, తలెత్తి చూస్తే కలిగే భావానుభూతి కలిగిస్తుంది ఈ కథ ఎత్తుగడ. 'ఈ కట్టడి ఏమిటి' అనే కుతూహలం ఆగనివ్వదు. ఇదే కుతూహలం పదేళ్ళు కూడా లేని పెద్దోడికీ కలిగింది. అతని దృక్కోణం నుంచే కథ జరుగుతుంది.
'పొద్దున్నే నీళ్ళు లేకపోతే, పోయి ముట్టించకపోతే, రోజు మొదలుకాదు అయినా బావి దగ్గరకు ఎవ్వరూ పోవడం లేదు'. 'బావి గిలకలకు, బద్దెలకు వెంట్రుకలు చుడితే గిలకలు తిరగవు. వెంట్రుకలు తెంచగలిగిన వాళ్ళు లేరు. చుట్టిన వాళ్ళే వెంట్రుకలు విడదీయాలి. అప్పుడే నీళ్ళు తోడటం సాధ్యం! మాదిగ పల్లెకు అదొక్కటే బావి. దీనికి కట్టడి !
   'అది మొండోడి పని'. మొండోడు కనిపించడం, వాణ్ణి చూడటం అపశకునంగా భావిస్తారు. వాడు రాత్రిపూట వస్తాడు.
'మొండోడు మాదిగ ఉపకులం వాడే!' మాదిగల దగ్గరే యాచిస్తాడు...' వీడికి పెట్టే వాడూ కనిపించడు, వాళ్ళకు పెట్టించుకనే వీడూ కనిపించడు. 'గుప్తదానం, గుప్త స్వీకారం' ఇదీ తంతు.
    ఊరు గిజగిజ లాడుతోంది. చివరికి పెద్ద మాదిగ మార్గం చెప్పాడు. చద్ది అన్నం వుంటే పెట్టవచ్చు. ఊర్లో అందరూ ఉన్నది తెచ్చిపెట్టటానికి నిర్ణయించుకున్నారు. పెద్దోడు కూడా తన కూడు అనిష్టంగానే మొండోడికి సమర్పించాడు. పెద్దోడి బుర్రలో చాలా పెద్ద ప్రశ్నలు. అసలు మొండోడు bవడు, ఎలా వుంటాడు? ఎక్కణ్ణుంచి వస్తాడు, వాణ్ణి ఎవరూ ఎందుకు చూడకూడదు? - ఇదీ కుతూహలం, వాడికి దీన్ని ఛేదించాలనే నిశ్చయం! ఎవ్వరికీ కనిపించకుండా వాణ్ణి చూడాలి. దొంగగా నక్కినక్కి పోసాగాడు... ఇంకా కపెరకపెర చీకటి ముసురుకునే వుంది. బావికాడ మనుషుల్లేరు. అలికిడి లేదు. ఇక ఎప్పుడైనా మొండోడు రావచ్చు. పెద్దోడు చూస్తున్నాడు. చివరికి బొగ్గులాటుల్లోంచి వచ్చాడు మొండోడు.
    మొండోడు ఎలా వచ్చి, ఎలా పెట్టిన పదార్థాన్ని ఆప్యాయంగా ఆరగించాడో - అదొక మహత్తర సన్నివేశం. అది! కడకు 'కట్టడి' వీడింది. తూరుపు తెల్లబడింది. 'మొండోడు మళ్ళీ కనిపించలేదు' అని ముగుస్తుంది కథ.
ఇలా కట్టడితో మొదలై కట్టడి వీడటంతో కథ ముగుస్తుంది. మొండోడు ఎవరో, ఈ కట్టడి ఏమిటో తెలుసుకోదలచుకున్న పెద్దోడి ఉత్సుకతతో మొదలై సమాధానంతో ముడివీడుతుంది.
పల్లె దినచర్య, జీవన స్తంభనంతో మొదలై సూర్యుడు ఉదయించటం, బావి గిలకలు విరామం లేకుండా మోగటంతో కథ ముగింపుని పొందుతుంది. పెద్దోడి ఉత్కంఠ అనే ఏకసూత్రత కథలో అపూర్వంగా నిర్వహించబడింది. కథా వాతావరణం మనుషులు, వారి స్వరూప స్వభావాలు, ఆచార వ్యవహారాలు, ప్రవర్తనా విధానం, పలుకుబడి - వంటి సహజనైజ స్ఫోరకాలు ఇందులో ఆవిష్కరించబడినాయి.
   రెండే రెండు పాత్రలతో ప్రత్యక్షంగా - ఒక ఛిద్ర జీవనచిత్రాన్ని రచయిత ఇనాక్‌ ఈ కథ ద్వారా మన ముందుంచుతారు. 'ఇదా ఈ సమాజంలో కొందరి జీవిత పద్ధతి?' అని ఒక నమూనాగా చెప్పుకోగలిగిన చాలా గొప్ప కథ - కట్టడి.
   విఘ్న వినాయకుడు : పద్దెనిమిదేళ్ళ క్రితం (2002) కర్నూలు జిల్లా ప్యాపిలి గ్రామంలో వినాయక చవితి ఊరేగింపు సందర్భంగా దళితులపై సవర్ణ వర్గాలు చేసిన దాడిలో కొందరు దళితులు చనిపోయారు. ఈ సంఘటన నేపథ్యాన్ని తీసుకొని ఇనాక్‌ 'విఘ్న వినాయకుడు' కథను రాశారు. ఈ కథ 2006 మార్చిలో 'మన భూమి' పత్రికలో ప్రచురితమైనది.
    రచయిత కథలో కూడా ఊరికి ప్యాపిలి అనే పేరే పెట్టడం వల్ల సంఘటన యథార్థత గురించి మనం ప్రశ్నించే ఆస్కారం లేదు. రచయిత ఈ కథ ద్వారా ప్యాపిలి సంఘటన గురించి మనం అప్పట్లో వార్తా పత్రికలో చదివిన వార్తా కథనాల వెనక ఉన్న అసలు కథను ఇందులో ఒక ఆర్థిక సామాజిక విశ్లేషకుని మాదిరిగా హృద్యంగా చెబుతారు. గత ఏడాది మాదిరిగానే వినాయక నిమజ్జనం శాస్త్రోక్తంగా చేయాలనుకుంటారు దళితులు. మాదిగల తరపున ఆ కార్య భారాన్ని నరసప్ప తలెత్తుకుంటాడు.
    గ్రామంలో సవర్ణ యువకుడు ఇది విని మండిపడ్డాడు. వీళ్ళకింకా బుద్ధి రాలేదా? అనుకున్నాడు. పోయినేడు నలుగురితో పోయింది. ఈ ఏడు పదిమంది అవుతారు అనడం నరసప్ప విన్నాడు. అప్పటి నుంచి కాలుగాలిన పిల్లిలాగా అయిపోయాడు. చరిత్ర పునరావృతం కాకూడదని నరసప్ప కోరిక. ఈ నేపథ్యంలోనే ఈ కథ మొదలవుతుంది.
   నరసప్ప ఊరిపెద్ద తలకాయల దగ్గరకు వెళ్ళి, విషయం చెప్పి, సహాయం చేయాలని కోరాడు. జయన్న- నాయుడన్న దగ్గర్నుంచి ఊళ్ళో ఉన్న - చాకలి, మంగలి, కమ్మరి, నేసేవాళ్ళు, బలిజలు, కురబలు అందర్నీ కలిసి గణేష్‌ అత్సవం బాగా జరగాలని, మాదిగల్ని ఎవ్వరూ చంపకుండా కాపాడాలని అర్థించాడు. 'మేం మీకు మిత్రులమే, మేం మిమ్మల్ని చంపం' అని వాగ్దానం చేయించుకున్నాడు. నరసన్న తలూపగానే పెద్దమ్మ గుడిపక్క పందిరి లేచింది. గణేష్‌ విగ్రహం మొలిచింది. పూజలు మొదలయ్యాయి.
    సవర్ణ యువకులు చాలా సందేహాలకు లోనయ్యారు. వీళ్ళు ఏం బలం చూసుకొని ఈ ఏడు కూడా విగ్రహం పెట్టారు అని, వీళ్ళకు ఎందుకు భయం లేకుండా పోయిందీ అని, గుంజాటనలో పడ్డారు. మాదిగలు ఏం చేస్తారో అని వాళ్ళు కూడా భయపడుతున్నారు.
ఒకసారి గతంలో ఆ ఊళ్ళో సవర్ణుల దాడిలో చనిపోయిన వారి వివరాలు చూద్దాం. 'నరసప్ప ఒకగానొక్క కొడుకు కాంట్రాక్టు లెక్చరయి కళ్ళు తెరిచే లోపల శవమయ్యాడు. సివిల్స్‌ ప్రిలిమినరీ పాసై మెయిన్‌ రాయడానికి సిద్ధపడుతున్నవాడు చచ్చిపోయాడు. పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి పల్లెకు వచ్చి లా అండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుతున్నవాడు, యం.ఆర్‌.ఓ.గా సర్వీస్‌ కమిషన్‌లో సెలక్ట్‌ అయి ఉద్యోగంలో చేరినవాడు, పోయినేడు గణేష్‌ నిమజ్జనం రోజున చనిపోయిన మాదిగల యువకులు.
    ''ఎవరి పూజ వాళ్ళది. ఎవరి ఊరేగింపు వాళ్ళది. ఎవరికీ ఎవరూ అడ్డుపడకూడదు. గొడవలు సృష్టించకూడదు'' అని చివరకు పెద్దలు తేల్చారు. 'ఎవరి ఊరేగింపు ముందు పోవాలి?' అని పట్టింపు వచ్చింది. చివరకే ఉండాలన్నారు. సరేనంటే సరేననుకొన్నారు. ఆరు గంటల కంటే ముందే మాదిగల గణేష్‌ విగ్రహం ఊరేగింపు మొదలయింది. ఇంకా చీకటి పడలేదు. నేషనల్‌ హైవేకి రెండు వైపులా ఎక్కడో ప్రమాదం పొంచి ఉందని వాళ్ళు భయపడుతూ ఉన్నారు.
కథ ముగింపులో 'ఈ ఊరేగింపు అవసరమా?' ఎవరో అడిగారు.
నరసప్ప చాలాసేపు ఆలోచించాడు.
''ఇప్పటికి అవసరమే! ఊరేగింపు అవసరం లేని రోజు చేరుకోవడానికి ఈ ఊరేగింపు అవసరమే'' నరసప్ప జవాబు.
భారత జాతీయోద్యమం ఆరంభ దినాల్లో 1893లో లోకమాన్య బాలగంగాధర తిలక్‌ గణేష్‌ ఉత్సవాలను కూడా బ్రిటీష్‌ పాలకులపై భారతీయుల అస్తిత్వం పోరాటంగానే తొలుత ఆరంభించాడు. అప్పట్లో తిలక్‌ కూడా స్థానిక బ్రిటీష్‌ కలెక్టర్‌ వద్దకు నేటి మన నరసప్ప మాదిరి అనుమతి కోసం వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు అనే ప్రశ్నకు - కాలమేదైనా ఒక్కటే, పైకి చెప్పలేని జవాబు! తమ అస్తిత్వాన్ని ప్రకటించుకోవడానికి! తమ స్వీయ గౌరవాన్ని ప్రకటించడానికి!
నాటి బాలగంగాధర్‌ తిలక్‌ వినాయకుడు - నేటి మాదిగ నరసప్ప వినాయకుడు ఇద్దరూ ఒక్కరే! కథ ముగింపు ఆలస్యం కావచ్చునేమోగాని, ఒక సినీకవి అన్నట్లుగా - వసంతం తనదరికి రాని వనాలను సైతం వెతుక్కుంటూ వస్తుంది.
కథ చివరలో - 'నరసప్ప అడుగులు... చిందు చూడడం ఒక ఆనందం గజ్జెల మోత... సంగీతం... వినడం ఒక పండుగ'.
ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనమయింది, ట్రాఫిక్‌ మొదలయింది. 'రిపబ్లిక్‌ డే నాడు వాహనాల గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతిలాగా నరసప్ప వచ్చిపోయే వాహనాలకు దండం పెడుతున్నాడు.' ఈ కథలో రచయిత నరసప్ప పాత్రను మలచిన తీరు అద్భుతమైనది. ఇక కథ సాగుతూ ఉంటే తెరలాగా కథ వెనక ప్యాపిలి ఊరు గత 60 ఏళ్ళుగా ఏ విధంగా రూపాంతరం చెందిందో కథలో చూస్తాం. కథ చదవడం పూర్తి చేసేసరికి ప్రతి దినం పత్రికల్లో చూస్తున్న ఆత్మగౌరవం నినాద వార్తలకు ఒక క్రూడ్‌ ఫార్మేట్‌ను ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్ని పొందుతాం.
కులవృత్తి : ఈ కథలో కొన్ని వర్ణాలు, మరికొన్ని వర్ణాలపై, అవసరానికనుగుణంగా మార్చుకుంటూ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. ఇందులో పూజారి స్వామి మొదట్లో మూర్తిని చెప్పులతో దేవాలయ ప్రవేశానికి అంగీకరించడు. కాళ్ళు రసిక కారుతున్నాయని మూర్తి అనగానే, బూట్లు కడుక్కుని దేవాలయంలోనికి వెళ్ళడానికి స్వామి అంగీకరిస్తాడు. అంటే ప్రమాణం మారింది. ఆచారం - సంప్రదాయం ఒకేలా ఉండాలని ఏమీలేదు. వాటిని మార్చుకునే స్వభావం ఉందనేది స్వామి చేతనే నిరూపించారు రచయిత.
పూజారులు చూడకుండా పక్షులు, జంతువులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు దేవాలయం - వాటి మలమూత్రాల వల్ల అపవిత్రం కావటం లేదు. అంటే దేవుడి కంటే పూజారికే నియమ నిష్ఠలపై ఆసక్తి ఎక్కువగా ఉంది. ఆ నియమ నిష్ఠలు కొన్ని వర్ణాల నుండే రూపొందుతున్నాయని, మరికొన్ని వర్ణాలకు అవి శాపంగా మారుతున్నాయని రచయిత ఈ కథ ద్వారా ఒక నూతన దృష్టిని ప్రదర్శించారు. అవసరానికి అనుగుణంగా బలైపోతున్న వాళ్ళు అంటే సామాజిక సంబంధాలకు దూరం చేయబడుతున్న వాళ్ళు, 'కింది వర్ణాల వర్గాల వాళ్ళే!' అనేది నిరూపించటం ఈ కథలో కనిపిస్తుంది.
ఈ కథ పవిత్రతను పరీక్షకు పెడుతుంది. ఇప్పటికీ చాలా చోట్ల దళితులకు దేవాలయ ప్రవేశం లేదు. శుభ్రంగా ఉన్నంత మాత్రమే సరిపోదు. మరింకొకటేదో కావాలి. అదే మానసికంగా ఏర్పడిన ఆచారాలతో కూడిన భావన. ఆ ఆచారాలే క్రమేపీ సంప్రదాయాలుగా మారిపోతాయి. శుభ్రతలో, మానసిక భావనలో పవిత్రత ఉంటుంది. అందుకనే కథలో బ్రాహ్మణుడు వేసుకున్న మురికి వస్త్రాలు గానీ, మాసిపోయిన జంధ్యం గానీ పవిత్రతకు అడ్డు రాలేదు.
అసలు కులవృత్తి కథలో రచయిత 1. దేవుడికీ - భక్తుడికీ మధ్య పూజారి అవసరమా? 2. పవిత్రతను అర్థం చేసుకోవడమెలా? పవిత్రత - అపవిత్రతలను నిర్ణయించటానికి తీసుకుంటున్న ప్రమాణాలేమిటి? 3. దేవాలయంలోకి పూజార్లు లేకుండా / చూడకుండా చెప్పులతోనూ, ఇంకా రకరకాల గానూ పోయినప్పుడు నిజంగా వాళ్ళందరికీ / ఆ పశు పక్షులకు 'పాపం' చుట్టుకుంటుందా? ఇలాంటి సమస్యలన్నింటినీ ఆలోచింపచేసే విధంగా ఈ కథ ఉంది.
రచయిత ఇనాక్‌ కులరీత్యా దళితుడు బాల్యంలో పలు కష్టాలను అనుభవించాడు. ఆ కష్టాలతో పాటు సమాజంలో ఉన్న కుల వివక్షను అర్థం చేసుకున్నాడు. సమాజాన్ని వర్గాలుగా - వర్ణాలుగా దర్శిస్తూ, వర్గరహిత - వర్ణరహిత సమాజం కోసం కథారచన చేశాడు. అణచివేతకు - పీడనకు వ్యతిరేకంగా దళితులను జాగృతం చేయడం, తిరుగుబాటుకు సిద్ధం చేయడం, కర్తవ్యాన్ని బోధించడం ఈయన కథారచన లక్ష్యాలు. తెలుగు కథానిక సాహిత్యంలో మరువగూడని రచయిత ఇనాక్‌.
 

- డా|| వీపూరి వేంకటేశ్వర్లు
98855 85770