Mar 02,2021 21:51

రేషన్‌ పంపిణీని పరిశీలిస్తున్న కమిషనర్‌ శశిధర్‌

విజయనగరం/డెంకాడ: ఇంటింటికీ రేషన్‌ సరఫరా విధానాన్ని మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌ అన్నారు. మంగళవారం ఆయన డెంకాడ మండలం జొన్నాడ, విజయనగరం పట్టణంలోని లంకాపట్నం, బొగ్గులదిబ్బ ప్రాంతాల్లో, ఎండియుల ద్వారా జరుగుతున్న రేషన్‌ పంపిణీని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ మొబైల్‌ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా జరుగుతున్న ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో వాలంటీర్లను మరింతగా భాగస్వాములను చేయాలని ఆదేశించారు. వాలంటీర్లకు ఈ కార్యక్రమం పట్ల అవగాహన పెంచాలని, ఈ పాస్‌ వేసే పనిని వారికి అప్పగించాలని అన్నారు. సరుకులు పంపిణీ చేసే రోజుకు ఒకటిరెండు రోజుల ముందుగానే ఆయా ప్రాంత ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. వాహనం వెళ్లేందుకు వీలైన ప్రతీ వీధిలోకి వెళ్లి, సరుకులను పంపిణీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వాహనం దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువమంది ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ తప్పనిసరిగా సంచుల ద్వారా సరుకులను అందజేయాలని సూచించారు. మురికివాడలు, కడు పేదలు నివశిస్తున్న ప్రాంతాల్లో ముందుగా సరుకుల పంపిణీ చేయాలన్నారు.గిరిశిఖర గ్రామాలకు వీలైనంత దగ్గర ప్రాంతాలకు వాహనాలను తీసుకువెళ్లి సరుకులను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియపై కమిషనర్‌ సమీక్షించారు. మిల్లింగ్‌ చేసి, బియ్యాన్ని తిరిగి ఇవ్వడంలో రైస్‌ మిల్లర్లు చేస్తున్న జాప్యంపై అసంతప్తి వ్యక్తం చేశారు. సార్టెక్స్‌ ఎందుకు ఇవ్వడంలేదని మిల్లర్లను ప్రశ్నించారు. రోజుకు 4వేల టన్నులు చొప్పున, ఈ నెలాఖరునాటికి లక్షా, 28వేల టన్నుల సార్టెక్స్‌ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ హరి జవహర్‌ లాల్‌, జెసి కిశోర్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ విదేఖర్‌, ఐటిడిఎ పిఒ ఆర్‌.కూర్మనాధ్‌, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, ఆర్‌డిఒ బిహెచ్‌ భవానీ శంకర్‌, డిఎస్‌ఒ పాపారావు, సివిల్‌ సప్లయిస్‌ డిఎం భాస్కర్రావు తదితర అధికారులు పాల్గొన్నారు.