
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటికే రేషన్ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో పార్టీ రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమయ్యింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పాల్గొన్నారు. 'ఇంటింటికీ రేషన్ అందిస్తామని, నాణ్యమైన బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. 20 రోజులు గడిచినా ఇప్పటికీ 50 శాతం కూడా రేషన్ పంపిణీ జరగలేదు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ పంపిణీ దాదాపు స్తంభించింది. ఇంటింటికీ రేషన్ కాకుండా రోడ్లపై వాహనాలు ఉంచి నడిరోడ్డుపై నిలబెట్టి రేషన్ అందించే పద్ధతి అమలులో ఉంది. పనులు మానుకొని రేషన్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కావున రేషన్ ఇంటింటికీ అందిస్తామన్న ప్రభుత్వ వాగ్దానాన్ని అమలు చేయాలి' అని కోరుతూ సమావేశం తీర్మానం ఆమోదించింది.
