Nov 26,2020 07:34

కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వాలు ఆదుకుంటాయని ప్రజలు భావించడం సహజం! ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం కూడా అదే! కానీ, ఆ కష్ట కాలంలోనే పన్నులు బాది, భారాలు మోపిన రాష్ట్ర సర్కారు తీరును చూస్తే ఇంత ఘోరమా అనిపించక మానదు. కరోనా వైరస్‌ విజృంభణ, ఏమాత్రం కసరత్తు లేకుండా అమలు చేసిన లాక్‌డౌన్‌ల కారణంగా కుప్ప కూలింది ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలు మాత్రమే కాదు, వాటికి మూలమైన సామాన్యుల జీవనాధారాలు కూడా! రేపటి మీద బెంగతోనే వీరి జీవితాలు ఇప్పటికీ గడుస్తున్నాయి. కరోనా ప్రభావం ఎన్నాళ్లు ఉంటుందో, ఈ భయోత్పాత వాతావరణం ఎంత కాలం కొనసాగుతుందో పాలకులకే స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి, వారి మూలుగులు పిండి బొక్కసాలు నింపాలని ఆలోచించడం ఎంతవరకు సబబు?
మున్సిపల్‌ చట్టాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌, మూడు జీఓలు పట్టణ ప్రజలపై మోపే భారం ఇంతా అంతా కాదు. అద్దె ఆధారంగా నిర్ణయించే ఆస్తిపన్నును ఇకనుండి మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించాలన్న తాజా నిర్ణయం పెను ప్రభావం చూపనుంది. ఒక అంచనా ప్రకారం ఈ నిర్ణయం కారణంగానే వేల కోట్ల రూపాయల మొత్తం రాష్ట్ర ఖజానాకు అదనంగా చేరనుంది. పైగా ప్రతి ఏడాది పెరిగే భూముల విలువతో పాటు పన్నుల మోత కూడా మోగనుంది. పెరిగిన పన్నును ఇంటి యజమానులు అద్దెకుంటున్న వారిపైకి బదలాయిస్తారు. అంటే, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరిపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, చెత్త సేకరణ పన్నుల పెంపు, యూజర్‌ ఛార్జీలను విధించడం వంటి చర్యలు కూడా ప్రజలందరి పైనా ప్రభావం చూపేవే! నిజానికి ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ చట్టం లోని 327వ సెక్షన్‌ సబ్‌సెక్షన్‌ ఒకటి ప్రకారం ఆస్తిపన్ను లోనే ఈ సేవలన్నీ భాగం! అంటే ఆస్తిపన్ను చెల్లించడమంటేనే ఈ సేవలన్నింటికీ చెల్లిస్తున్నట్లు లెక్క! ఒకే సేవకు రెండు సార్లు ఛార్జీలు వసూలు చేస్తారా? అది చాలదన్నట్లు ఎడాపెడా పెంచుతారా? ఇదెక్కడి న్యాయం? స్థానిక సంస్థలు అందించే సేవలు అంగడి సరుకులుగా మారితే సామాన్యుల సంగతి ఏమిటి? వారి బాగోగులు పట్టించుకోరా?
స్థానిక సంస్థల నిర్వహణకు, సేవలు అందించడానికి ఎంత ఖర్చయితే అంత మొత్తాన్ని ప్రజల నుండే వసూలు చేయాలన్నది ప్రపంచబ్యాంకు ఎప్పుడో చేసిన నిర్దేశం! మరో మాటలో చెప్పాలంటే ప్రజల నుండి వసూలు చేసే మొత్తం తోనే స్థానిక సంస్థలు స్వయం సమృద్ధి కావడంతో పాటు, లాభాల బాటన నడవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇచ్చే వనరులుగా ఉండాలేగానీ, వాటిని అర్ధించే సంస్థలుగా ఉండకూడదు. కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచబ్యాంకు ఆదేశిత ఈ విధానాలనే ఇప్పుడు నూరు శాతం అమలు చేస్తోంది. దానిలో భాగంగానే రాష్ట్రాల అధికారాలను, వనరులను గుంజుకుంటూ హక్కులపై దాడి చేస్తోంది. దానిని ప్రతిఘటించడం పోయి బలపరచడం ఒక తప్పు కాగా, తన వంతుగా పురపాలక సంస్థల అధికారాలపై రాష్ట్ర ప్రభుత్వం దాడికి పూనుకోవడం అప్రజాస్వామికం.
వాస్తవం ఇదికాగా, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తమ ప్రభుత్వం, ప్రజలను ఇబ్బంది పెడుతుందా అని పురపాలక శాఖ మంత్రి ప్రశ్నించడం అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడమే! పప్పు బెల్లాలు పెడుతున్నామంటూ, భోజనం ప్లేటును గుంజుకుంటామంటే ఎలా? ప్రజలపై నిజంగా అంత ప్రేమ ఉంటే, ముందుగానే ఆ విషయాన్ని ఎందుకు బహిరంగపరచలేదు? విస్తృతంగా చర్చ ఎందుకు నిర్వహించలేదు? అసలు పట్టణ స్థానిక సంస్థలకు ప్రస్తుతం ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాలే లేవు కదా! పురపాలక సంస్థల సమావేశాల్లో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఒక్క కలంపోటుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా! ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రజలపై భారాలు మోపే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రజలు కూడా నిర్బంధ, నిరంకుశ నిర్ణయాలను ప్రశ్నించడానికి, ప్రతిఘటించడానికి సిద్ధం కావాలి.