Nov 30,2020 20:04

వ్యవసాయ శాఖ జెడి వద్ద రైతుల ఆవేదన
ప్రజాశక్తి - భీమడోలు

'వరద ముంపు నుంచి పొలాలు తేరుకోలేదు.. ఇంకా వరి కోతలు కూడా పూర్తి కాలేదు.. ఈ దశలో ముందస్తు సాగు సాధ్యమేనా' అంటూ రైతులు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు గౌసియా బేగంను ప్రశ్నించారు. ముందస్తు దాళ్వాసాగుపై రైతులను చైతన్యపరిచేందుకు పూళ్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆమె విచ్చేశారు. అతిథిగా భీమడోలు సహాయ సంచాలకులు కెజెడి.రాజన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భీమడోలు వ్యవసాయ అధికారి పి.ఉషారాజకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంయుక్త సంచాలకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు చెందిన కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం నేపథ్యంలో మార్చి 31వ తేదీతో కాలువలను కట్టి వేస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు సాగుకు సమాయత్తం కావాల్సి ఉందన్నారు. దీనికోసం వ్యవసాయ శాఖ రాయితీపై విత్తనాలు ఇచ్చేందుకు సిద్ధం చేసిందన్నారు. రైతుల అవసరాల కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, ఇతర వ్యవసాయసామగ్రి అందుబాటులో ఉంచిందన్నారు. ముందస్తుసాగులో భాగంగా డిసెంబర్‌ మొదటివారంలో నారుమళ్లు వేయడం నెలాఖరుకు నాట్లు వేసుకునే కార్యక్రమాన్ని పూర్తిచేసుకోవాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా డిసెంబర్‌ మొదటివారంలో నారుమళ్లు వేసే కార్యక్రమం పూర్తికాకుంటే రెండోవారంలో విత్తనాలు వెదజల్లే విధానాన్ని అమలు చేసి నారుమళ్లు వేయాలని సూచించారు. దీనికి ఎకరాకు 16 కేజీల విత్తనాలు సరిపోతాయన్నారు. రెండోవారం నాటికి నారుమళ్లు వేసే కార్యక్రమం పూర్తికాకుంటే రైతులు సామూహిక నర్సరీల పెంపకాన్ని చేపట్టాలని కోరారు. ఆ మేరకు స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని సూచించారు. ఆ తరువాత రైతులకు రైతు భరోసా నెలవారీ సంచికలను పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో భీమడోలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షులు పులిచర్ల వెంకట కృష్ణారావు, ఎంపిఇఒ జి.ఫణికుమార్‌, సచివాలయ వ్యవసాయ సహాయకులు జివై.సుస్మిత, పద్మ పాల్గొన్నారు.