Nov 25,2021 20:18

ప్రతి అనారోగ్య సమస్యకు ప్రధాన కారణం ఒత్తిడి అని అనేక అధ్యయనాలు నివేదికలు ఇచ్చాయి. ఎవరైతే ఎక్కువ ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు కనిపిస్తారో, వారు అనేక మానసిక, శారీరక అనారోగ్యాలకు కూడా ప్రభావితమవు తారని మానసిక వైద్యులు చెబుతున్నారు. మరి అటువంటి ఒత్తిడిని దూరం చేయాలంటే వ్యాయామం తప్పనిసరి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అధిక ఒత్తిడిని నియంత్రించవచ్చు.
 

శారీరక వ్యాయామం
ప్రతిరోజూ ఉదయం రెండు లేదా మూడు కిలోమీటర్లు నడవాలి. కాళ్లు, చేతులు, మెడ, నడుం భాగాలను కదిలించేలా వర్కవుట్స్‌ చేయాలి. స్విమ్మింగ్‌ లేదా ఆటలాడడం చేయాలి. అప్పుడే శారీరక కదలిక కండరాలను వేడెక్కించి మెదడుకి విశ్రాంతి కలుగుతుంది. అయితే, ఇది అతిగా చేస్తే శరీరం నొప్పులు పెడుతుంది.
 

గాఢ శ్వాసలు తీయడం
నిదానంగా గాలి పీల్చడం, వదలడం చేయాలి. ఇలా తరచూ తీస్తే శరీరం విశ్రాంతి పొంది మెదడుకు వెళ్లే సంకేతాల తరంగాల వేగం తగ్గుతుంది. ఒత్తిడి హార్మోన్లు తొలగుతాయి. మీ పొట్టపై ధ్యాస పెట్టండి. ఛాతీ కంటే కూడా పొట్ట బాగా కదలాలి. ఇది విశ్రాంతి పొందేందుకు మంచి పద్ధతి. గాఢ శ్వాస వల్ల ఏకాగ్రత దృష్టి పెరుగుతుంది.
కండరాల విశ్రాంతి
యోగా, శరీర భంగిమలపై ధ్యాస పెట్టండి. వివిధ యోగా, ఇతర భంగిమలు ఆచరించటం వల్ల కండరాలు విశ్రాంతిని పొంది ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు సడలి విశ్రాంతి పొందుతారు. జాగింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, డాన్సింగ్‌ వంటివి కూడా ఒత్తిడిని తగ్గించే ప్రక్రియలే. మెదడుని ప్రశాంతంగా పెట్టుకుంటూ శరీర కదలికలపై దృష్టి పెడితే శరీరానికి అలసట తగ్గి మనస్సు ప్రశాంతమవుతుంది. అప్పుడు ఒత్తిడీ తగ్గుతుంది.